కశ్మీర్‌లో మరో ఉగ్ర ఘాతుకం.. టీవీ నటి కాల్చివేత

0
93

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. కొన్ని రోజులుగా బరితెగించి బహిరంగంగా ఇళ్లపైనే పడి కాల్పులు జరుపుతూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. 24గంటల వ్యవధిలోనే కశ్మీర్‌లో మరో ఉగ్రదాడి చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. తాజాగా బూద్గామ్‌ జిల్లాలో టీవీ నటి అమ్రీన్‌ భట్‌ (35)ను కాల్చి చంపారు. ఈ ఘటనలో ఆమె మేనల్లుడు గాయపడ్డాడు. ” బుద్గాం జిల్లా చదూరలోని ఆమె నివాసంలో ఈ రోజు రాత్రి 7.55 గంటల సమయంలో ఇంట్లో ఉన్న అమ్రీన్‌ భట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు” అని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు వెల్లడించారు. అమ్రీన్‌ భట్‌ టిక్‌టాక్‌ వీడియోలతో ఫేమస్‌ అయ్యారు.

ఈ ఘటనలో ఆమె పదేళ్ల మేనల్లుడు ఫర్హాన్‌ జుబీర్‌కు కూడా బుల్లెట్‌ గాయమైనట్టు పోలీసులు వెల్లడించారు. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఇది నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల పనేనని పోలీసులు తెలిపారు. ముష్కరుల్ని పట్టుకొనేందుకు ముమ్మరంగా గాలింపు ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కేసుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. 24 గంటల వ్యవధిలోనే ఇది రెండో ఘటన కావడం కలకలం రేపుతోంది. మంగళవారం శ్రీనగర్‌లో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఇంటి వద్ద కాల్పులు జరిపిన ముష్కరులు అతడిని బలితీసుకున్నారు. అంతేకాకుండా ఏడేళ్ల అతడి కుమార్తెపైనా కాల్పులు జరపగా.. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం కోలుకుంటోంది.

Leave a Reply