అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

0
218

పెన్‌పహాడ్‌/కొల్చారం : అప్పుల బాధ భరించ లేక రాష్ట్రంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన రైతు అబ్బగాని వెంకటేశ్వర్లు (35) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్లుకు రెండు ఎకరాల భూమి ఉంది.  మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని సన్నరకం ధాన్యం సాగు చేశాడు. పంటకు నీటి కోసం ఐదు బోర్లు తవ్వించగా, ఒక బోరులో మాత్రమే నీళ్లు పడ్డాయి.

దీంతోపాటు పంట పెట్టుబడికి రూ.4లక్షలకుపైగా అప్పులు చేశాడు. ఇటీవల వచ్చిన అధిక వర్షాలకు పంట దెబ్బతిని ఆశించిన దిగుబడి రాకపోవడం, తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి పొలం వద్దకు వెళ్లి క్రిమిసంహారక మందు తాగాడు. పక్క పొలంలోని రైతులు గమనించి అతణ్ని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మరోవైపు.. వర్షానికి పంట నష్టపోవడంతో చేసిన అప్పులు తీర్చే దారిలేక మెదక్‌ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన పోతుల రాములు (35) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రాములు తనకున్న రెండెకరాల్లో సన్నరకం వరిని సాగు చేశాడు. వర్షాలు, తెగుళ్లతో పంట పూర్తిగా నష్టపోయింది. పెట్టుబడి ఖర్చులతో పాటు కుటుంబపోషణకు చేసిన అప్పులు పెరిగిపోవడం, తీర్చేమార్గం లేకపోవడంతో కుటుంబంలో కలహాలు మొదలై భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో రాములు మానసిక క్షోభకుగురై ఇంట్లోనే ఉరేసుకున్నాడు.

Courtesy Andhrajyothi

Leave a Reply