భిక్కనూరు, కమాన్పూర్ : అప్పులు తీర్చలేక ఒకరు, భూమి ధరణిలో నమోదు కాకపోవడంతో మనస్తాపానికి గురై మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన మాలిని రాజయ్య(42) మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నాడు. అయితే ఈ ఏడాది పంట దిగుబడులు సరిగ్గా రాక.. రూ.3 లక్షల మేర అప్పుల పాలయ్యాడు.
ఓ వైపు చేతిలో చిల్లిగవ్వ లేక కుటుంబ పోషణ భారంగా మారడం.. మరోవైపు అప్పులిచ్చిన వారు తీర్చాలని వేధింపులకు గురి చేయడంతో శుక్రవారం గ్రామ శివారులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన మరాల కిషన్(38)కు కమాన్పూర్ శివారులోని సర్వే నంబర్ 267లో 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమి ప్రభుత్వ నిషేధిత జాబితాలో నమోదైంది. దీంతో భూమి అమ్మలేక అప్పులు తీర్చలేక కిషన్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.