ఉరి కోరిన ప్రేమ!

0
218

రంగారెడ్డి జిల్లాలో రెండు ప్రేమ జంటల ఆత్మహత్యలు

ఉరి కోరిన ప్రేమ!
కేశంపేట గ్రామీణం, షాబాద్‌, న్యూస్‌టుడే: తమ ప్రేమను పెద్దలు నిరాకరించారని వేర్వేరు ప్రాంతాల్లో రెండు ప్రేమ జంటలు ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. ఈ విషాద ఘటనలు రంగారెడ్డి జిల్లాలో జరిగాయి. అతను లేని జీవితం నాకొద్దు అంటూ.. అమ్మాయి ఉరితాడుకు వేలాడితే.. ఆమెలేని బతుకు వ్యర్థమంటూ యువకుడు బలవన్మరణం చెందాడు. మరో ఘటనలో ప్రేమ విఫలమైందన్న బాధతో ఇద్దరూ కలిసి ఉరి వేసుకుని బలవన్మరణం చెందడం కలకలం రేపింది.

చెట్టుకు ఉరేసుకుని..
ప్రేమతో ఒక్కటైన యువ జంట.. ఆ ప్రేమ కోసం ఉరితో తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం లింగారెడ్డిగూడలో సోమవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు… లింగారెడ్డిగూడకు చెందిన కర్రె పల్లవి (19), అదే గ్రామానికి చెందిన పోచమోళ్ల మహేందర్‌ (21) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఏడాది కిందట వీరిద్దరూ శంషాబాద్‌లో కలిసి తిరుగుతుండగా గమనించిన పల్లవి తల్లిదండ్రులు, మహేందర్‌ కుటుంబ సభ్యులను పిలిచి హెచ్చరించారు. శంషాబాద్‌లో ఒక ప్రైవేటు సంస్థలో పనిచేసే మహేందర్‌ రెండు నెలల కిందటి నుంచి పని మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. పల్లవి నాగర్‌గూడలో కుట్టు శిక్షణకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున వారిద్దరూ గ్రామ శివారులోని పొలంలోని మామిడి చెట్టు కొమ్మకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

కులమే అడ్డుగోడఉరి కోరిన ప్రేమ!
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో వెలుగు చూసిన విషాదమిది.  చెన్నయ్య, చిట్టెమ్మల కుమార్తె సుశీల (18), అదే గ్రామానికి చెందిన వెంకటయ్య, వెంకటమ్మల కుమారుడు శ్రీరాములు (23) ప్రేమించుకుంటున్నారు. యువతీయువకులు వేర్వేరు కులాలకు చెందినవారు. సుశీలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించగా.. ఆమె తానో యువకుడిని ప్రేమించినట్లు వెల్లడించింది. ఇరు కుటుంబాల కులాలు వేర్వేరు కావడంతో పెద్దలు వారి ప్రేమను అంగీకరించలేదు. ఆదివారం ఇదే విషయమై సుశీల ఆమె తల్లితో మాట్లాడింది. తల్లి మరోసారి మందలించింది. మనస్తాపానికి గురైన యువతి ఆదివారం అర్ధరాత్రి తన గదిలో ఉరి వేసుకుంది. ‘‘సుశీల లేని జీవితం నాకొద్దు.. నేనూ చనిపోతాను’’ అని శ్రీరాములు తన స్నేహితుడు భానుచందర్‌తో చెప్పాడు. సెల్‌ఫోన్‌లో మిత్రుడితో ఇలా మాట్లాడిన గంటకే తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు.

Courtesy Eenadu…

Leave a Reply