ఏపీలో మరో రెండు పాజిటివ్‌

0
212

ఈ రెండూ విశాఖలోనే.. 21 కి చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య
విశాఖ ఛాతీ ఆస్పత్రిలో పూర్తిగా కోలుకున్న కరోనా బాధితుడు

అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలో ఆదివారం మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రెండూ విశాఖలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 21కి చేరింది. విశాఖలో కేసుల సంఖ్య 6కి పెరిగింది. తాజాగా నమోదైన రెండు కేసులూ ఇతర దేశం నుంచి వచ్చిన వారినుంచి సోకినవేనని నిర్ధారించారు. బర్మింగ్‌హాం నుంచి విశాఖ వచ్చిన వ్యక్తికి ఈనెల 17వ తేదీన పరీక్షలు జరపగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అనంతరం అతని బంధువులను ఐసొలేషన్‌లో ఉంచి పరీక్షించగా తండ్రికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

తాజాగా మరో ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్‌గా తేలింది. ఆదివారం 85 నమూనాలను ల్యాబొరేటరీకి పంపించగా, అందులో 83 నమూనాలు నెగిటివ్‌గా తేలగా మిగతా 2 పాజిటివ్‌గా వచ్చాయని వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇదిలా ఉండగా ఈనెల 17వ తేదీన మదీనా నుంచి విశాఖ వచ్చిన 65 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా గుర్తించి విశాఖ ఛాతి ఆస్పత్రిలో చికిత్స చేశామని, ఇప్పుడా పేషెంట్‌ పూర్తిగా కోలుకున్నాడని అధికారులు పేర్కొన్నారు.

మధుమేహ వ్యాధిగ్రస్తుడైన ఆ వ్యక్తికి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.విజయకుమార్, డా.అయ్యప్ప, నోడల్‌ అధికారి డా.విజయబాబు, స్టాఫ్‌ నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది కష్టపడి మెరుగైన వైద్యం చేశారని తెలిపారు. ఆ  పేషెంటుకు రెండు సార్లు నమూనాలు పరీక్షించగా,రెండు సార్లూ నెగిటివ్‌గా తేలిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 29,494 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని, మరో 178 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

Courtesy Sakshi

Leave a Reply