హెక్టారులోపే భూమి

0
261
  • దేశంలో మూడొంతుల రైతులకున్నది ఇంతే  
  • తెలంగాణ గ్రామీణ కుటుంబాల్లో 87 శాతానికి సేద్యంలోనే ఉపాధి
  • ఈ విషయంలో దేశంలోనే మొదటి స్థానం
  • జాతీయ నమూనా సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌: మనది వ్యవసాయాధారిత దేశం. అయితే మూడొంతుల మంది రైతుల (72.6 శాతం) భూ కమతం సగటు విస్తీర్ణం  హెక్టారు(2.47 ఎకరాలు) లోపే ఉంది. అలానే ఈ మూడొంతుల రైతుల వద్ద ఉన్న భూమి మొత్తం విస్తీర్ణంలో మూడోవంతు (34.5%) మాత్రమేనని 77వ జాతీయ నమూనా సర్వేలో వెల్లడించింది. 2002తో పోలిస్తే 2019 నాటికి కౌలుకిచ్చిన భూమి విస్తీర్ణం 100 శాతం అదనంగా పెరిగి 6.5 నుంచి 13 శాతానికి చేరినట్లు తెలిపింది. దేశంలో ఉన్న భూమి కమతాలు, రైతు కుటుంబాలు, పాడి పశువుల పెంపకం తదితరాలపై చేసిన సర్వే వివరాలను జాతీయ కార్యక్రమాల అమలు, గణాంకాల శాఖ విడుదల చేసింది.

గ్రామీణ ప్రాంతాల్లో 17.24 కోట్ల కుటుంబాలు
హెక్టారులోపే భూమి* దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 17.24 కోట్ల కుటుంబాలున్నాయి. వీరిలో వ్యవసాయం చేసే రైతు కుటుంబాలు 54 శాతం (9.30 కోట్లు), ఇతర వృత్తుల్లో 46 శాతం (7.93 కోట్లు) కుటుంబాలున్నాయి.

* గ్రామీణ ప్రాంతాల్లో సాగులో ఎక్కువ శాతం మంది ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. ఇక్కడ 87.6% కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ 60.8 శాతంతో 19వ స్థానంలో ఉండటం గమనార్హం.

* పాడిపశువుల పెంపకంతో స్వయం ఉపాధి పొందే విషయంలో తమిళనాడు (12.3%), ఏపీ (9.3%) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో పాడి పశువులతో ఆదాయం పొందే కుటుంబాలు 0.7 శాతమే కావడం గమనార్హం.

* గ్రామీణ రైతు కుటుంబాల్లో 73.6% అక్షరాస్యత ఉంది. ఇతర వృత్తుల్లో ఉన్నవారిలో 72.9% అక్షరాస్యత నమోదైంది. ఏపీ రైతుల్లో 60.6%, తెలంగాణ రైతుల్లో 61.2% అక్షరాస్యత ఉంది. ఈ విషయంలో చాలా రాష్ట్రాలకన్నా తెలుగు రైతులు వెనుకబడి ఉన్నారు.

* పదో తరగతికన్నా ఎక్కువ చదివిన రైతులు తెలుగు రాష్ట్రాల్లో తక్కువే. తెలంగాణ రైతుల్లో 34.2%, ఏపీలో 31.9% మంది మాత్రమే సెకండరీ విద్యకన్నా ఎక్కువ చదివినట్లు సర్వేలో తేలింది. ఈ విషయంలో 60.2 శాతంతో మణిపూర్‌ రైతులు అగ్రస్థానంలో ఉన్నారు.

సగం మందికే ధరలపై సంతృప్తి
2019లో ధాన్యానికి మంచి ధర వచ్చిందని 62.1% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. పత్తి ధరపై 56.3%, గోధుమలపై 66.2%, మొక్కజొన్నపై 67.8% మంది సంతృప్తి వెలిబుచ్చారు. పంట విక్రయించాక సకాలంలో డబ్బు చెల్లించడం లేదని రైతులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయంలో అత్యధికంగా చెరకు రైతులు 25.4% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

13 శాతం భూమి కౌలుకి…
దేశంలోని మొత్తం 10.18 కోట్ల భూ కమతాల్లో 2.28 కోట్ల కమతాలను 2019లో కౌలుకిచ్చినట్లు భూ యజమానులు తెలిపారు. వీరిలో 49.4 శాతం మంది నగదుకి, 34.7 శాతం మంది పంటలో వాటా తీసుకునే పద్ధతిలో కౌలుకిచ్చారు. మరో 13.7 శాతం మంది బంధువులకు కౌలుకు ఇచ్చినట్లు తెలిపారు.

Courtesy Eenadu

Leave a Reply