కాచిగూడలో రెండు రైళ్లు ఢీ!

0
261

  • హంద్రీ ఎక్స్‌ప్రె‌స్‌ను ఢీకొన్న ఎంఎంటీఎస్‌
  • లెవల్‌ క్రాసింగ్‌ వద్ద ఒకదానికొకటి ఢీ
  • ఎగిరి పడిన ఎంఎంటీఎస్‌ బోగీలు
  • 17 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
  • బోగీలో చిక్కుకున్న ఎంఎంటీఎస్‌ డ్రైవర్‌
  • ఏడున్నర గంటల ప్రయత్నంతో బయటకు

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, నవంబరు 11: సోమవారం ఉదయం 10.20 గంటలు! కాచిగూడ రైల్వే స్టేషన్‌! కర్నూలు నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ లెవల్‌ క్రాసింగ్‌ (ట్రాక్‌ చేంజ్‌ క్రాసింగ్‌) వద్దకు వచ్చింది! రెండో నంబరు ప్లాట్‌ఫాంకు వెళ్లే ట్రాక్‌లో సిగ్నల్‌ కోసం ఆగింది! ఐదు నిమిషాల తర్వాత.. నాలుగో నంబరు ప్లాట్‌ఫాంకు వెళ్లాలంటూ సిగ్నల్‌ వచ్చింది! అదే సమయంలో, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు వెళ్లే ఎంఎంటీఎస్‌ ఉదయం 10.30 గంటలకు రెండో నంబరు ప్లాట్‌ఫాంకు వచ్చింది! ప్రయాణికులు ఎక్కిన తర్వాత సిగ్నల్‌ రావడంతో 10.35 గంటలకు బయలుదేరింది! అటు రెండో నంబరు ట్రాక్‌ నుంచి నాలుగో నంబరు ట్రాక్‌లోకి 20 కిలోమీటర్ల వేగంతో హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ వస్తోంది. రెండో నంబరు ప్లాట్‌ఫాం నుంచి బయలుదేరిన ఎంఎంటీఎస్‌ 50-60 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. సరిగ్గా.. ట్రాక్‌ చేంజ్‌ క్రాసింగ్‌ వద్ద రెండు రైళ్లూ ఒకదానికొకటి ఢీకొన్నాయి! ఢీకొట్టిన తర్వాత మూడు సెకన్లలోనే ఎంఎంటీఎ్‌సకు చివర ఉన్న బోగీలు ఎగిరి పక్కకు పడ్డాయి. ఈ ఘటన కాచిగూడ స్టేషన్‌ వద్ద సోమవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు రైళ్లలో ప్రయాణిస్తున్న 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎంఎంటీఎస్‌లో 360 మంది వరకూ ప్రయాణిస్తుండగా.. హంద్రీలో 1000 నుంచి 1300 మంది వరకు ఉన్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రమాదంలో ఎంఎంటీఎస్‌ బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మొత్తం 9 బోగీలతో రైలు బయలుదేరగా.. లోకో పైలెట్‌ శేఖర్‌ ఉన్న బోగీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్యాబిన్‌ భాగంలో లోకో పైలెట్‌ కూరుకుపోయాడు. కాగా, ఎంఎంటీఎస్‌ బోగీలు 2 నుంచి 3 అడుగుల వరకు ఎగిరి పడ్డాయి. 2-3 బోగీలు పట్టాలపై నుంచి ఎగిరి పక్కకు పడ్డాయి. 4, 5 బోగీలు పట్టాలు తప్పాయి. 6, 7 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇక, డీజిల్‌ ఇంజిన్‌తో వస్తున్న హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌ సహా 18 బోగీలూ పట్టాలు తప్పాయి. ఎంఎంటీఎస్‌ 50 కిలోమీటర్ల స్పీడ్‌తో వచ్చి ఢీకొనడంతో 5 నుంచి 7 ఇంచుల వరకు హంద్రీ ఎక్స్‌ప్రె్‌సలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.

గవర్నర్‌ ఆరా : క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్‌ తమిళిసై ఆరా తీ శారు. ఉస్మానియా సూపరింటెండెంట్‌ నాగేందర్‌కు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కొత్త బోగీలకు యాంటీ క్లైంబింగ్‌ సిస్టమ్‌ : సికింద్రాబాద్‌: ఎంఎంటీఎస్‌ బోగీలు కొత్తవి కావడం, వాటికి యాంటీ క్లైంబింగ్‌ సిస్టమ్‌ ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఢీకొనగానే ఎంఎంటీఎస్‌ రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఎదురుగా ఉన్న రైలుపైకి ఎక్కి కిందపడలేదు. కొత్త బోగీలకు ఉన్న యాంటీ క్లైంబింగ్‌ సిస్టమ్‌ దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. అదే.. పాత బోగీలతో కూడిన రైలింజన్‌ ఢీకొని ఉంటే ఎదుటి రైలుపై బోగీలు ఎక్కి ఉండేవని వివరించారు.

ఎమర్జెన్సీ బటన్‌ నొక్కినా: హంద్రీ డ్రైవర్‌ : ప్రమాదంపై హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌ బాలకృష్ణయ్య స్పందించారు. హోమ్‌ సిగ్నల్‌ వద్ద తమ రైలును నిలుపుతుండగా ఎంఎంటీఎస్‌ వేగంగా వచ్చి ఢీకొట్టిందని, ఎమర్జెన్సీ బటన్‌ నొక్కినా వేగంగా వచ్చి ఢీకొట్టిందని తెలిపారు. ఎంఎంటీఎస్‌ మరింత వేగంగా ఉండి ఉంటే ప్రమాదం తీవ్రస్థాయిలో ఉండేదని ఆయన తెలిపారు.

Courtesy Andhrajyothi…

Leave a Reply