రెండేళ్ల అనంత వేదన

0
155

రమా తేల్తుంబ్డే అంబేడ్కర్

నాజీవితంలో ఇటువంటి కోణం ఒకటుందని కూడా తెలియని కోణాన్ని నాకిది పరిచయం చేసింది. ఈ మలుపు గోవాలో మా ఇంటి మీద మేం లేనప్పుడు పోలీసులు దాడి చేసిన రోజున మొదలయింది. కుటుంబం కోసం ఆరోజు నేను బైటికి చూడడానికి ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించాను గాని లోలోపల భయానకమైన ఉద్వేగాలు చెలరేగాయి. టివి తెరల మీద నా భర్త చిత్రాలతో, మా ఇంటి చిత్రాలతో వార్తలు హోరెత్తుతుండగా భర్తనూ, పిల్లలనూ ఇంట్లోనే ఉండమని, నేను ముంబాయి నుంచి గోవాకు వెళ్లే విమానం అందుకున్నాను. ఎటువంటి ముందస్తు హెచ్చరికా సమాచారమూ లేకుండా ఒక ఆగంతుకుల గుంపు మా సొంత, వ్యక్తిగత స్థలంలో జొరబడి ఏమి మిగిల్చిపోయారో చూడదలచుకున్నాను. అక్కడ ఫిర్యాదు ఇవ్వడానికి మా న్యాయవాదిని వెంటపెట్టుకుని సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్తున్నంతసేపూ మౌనంగా నాకు నేనే ఒక మాట చెప్పుకుంటూ ఉన్నాను. నేనూ నా భర్తా భయపడవలసిన పనేదీ చేయలేదు, మేం చట్టానికి లోబడి నడిచే పౌరులం. అందువల్ల నా భర్తకు ఏదో ఆపద రానున్నదని భయపడే అవకాశమే లేదు. ఆయన మన సమాజంలోని పీడిత ప్రజల అభ్యున్నతి కోసం విరామమెరుగని కృషి చేస్తూ వచ్చాడు. అయితే అలా మొదటిసారి పోలీసు స్టేషన్‌కు వెళ్తున్నప్పుడు, కనుచూపుమేరలో అంతం కనబడని సుదీర్ఘ కష్టభరిత ప్రయాణానికి ప్రారంభం మాత్రమేనని నాకు తెలియలేదు.

ఆ ఘటన తర్వాత మా జీవితాలు మేం ఊహించగలిగినదానికన్న ఎక్కువ రకాలుగా మారిపోయాయి. ఆనంద్‌కు తన జీవితంలో ఒక్క క్షణం కూడా వృథాగా గడపడం ఇష్టం లేదు. తను తన పాఠాలను ఎప్పట్లాగే కొనసాగించాడు. విద్యార్థుల అవసరాలను ఎప్పట్లాగే నెరవేర్చాడు. స్పష్టంగా తనను బెదిరించడానికి కొద్ది రోజుల కిందనే అంత పెద్ద ఘటన జరిగితే ఏమీ జరగనట్టుగా తన పని తాను చేసుకుంటూ ఉండిపోయిన ఆనంద్‌ను నేను ఆరాధించాను. తను పోలీసు నిర్బంధంలోకి వెళ్లే చివరి రాత్రి దాకా ఆనంద్ పని చేస్తూనే ఉన్నాడు.

మేం పాత రోజుల్లోలాగానే జీవించడానికి ప్రయత్నించినప్పటికీ, మా దినచర్యలోకి కొత్త అంశాలు చేర్చుకోవలసి వచ్చింది. మేం ఇప్పుడు కోర్టు తేదీలను లెక్కపెట్టుకోవలసి వచ్చింది. తన మీద మోపిన దుర్మార్గమైన, తప్పుడు ఆరోపణలను కొట్టివేయాలని ఆనంద్ ఒక కేసు దాఖలు చేశాడు. ఇప్పటివరకూ వచ్చిన చట్టాలన్నిటిలోకీ అత్యంత దారుణమైన, అప్రజాస్వామికమైన యుఎపిఎ చట్టం కింద ఆరోపణలను ఎదుర్కోవడమే చాల అవమానకరమైన విషయం. ఆనంద్ అనే డెబ్బై ఏళ్ల వ్యక్తి, ఒక భర్త, ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక కార్పొరేట్ వృత్తి నిపుణుడు, ఒక ప్రొఫెసర్, ఒక కార్యకర్త, ఒక రచయిత, హింసాత్మక తీవ్రవాదుల కోసమని చెప్పి తయారైన చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ఇక ఆయన పోలీసు నిర్బంధంలోకి వెళ్లిన 2020 ఏప్రిల్ 14 గురించి నా ఉద్వేగాలను వర్ణించడానికి నాకు మాటలు లేవు. మొట్టమొదట, ఆ రోజంతా ఒక విభ్రాంతిలో గడిచింది. కాని ఆ రోజు మిగిల్చిన జ్ఞాపకం అప్పటి నుంచి ప్రతి ఒక్కరోజూ పునర్జీవిస్తున్నది. నావరకు నాకు, 2020కి ముందు జీవితంలో ఏప్రిల్ 14 అంటే ఒక సంతోష సందర్భం. మా తాత డా. బి.ఆర్. అంబేడ్కర్ పుట్టినరోజు. నేను బొంబాయిలో నివసిస్తున్న ఇన్ని సంవత్సరాల్లో, ఆ రోజున చైత్యభూమికి వెళ్లకుండా ఒక్కసారి కూడా లేను. భారత దేశంలోనూ, ప్రపంచమంతటా కోట్లాది మంది జీవితాలను స్పృశించిన ఆ మహానుభావుడి జీవితాన్నీ, విజయాలనూ తలచుకుంటూ అక్కడ కొవ్వొత్తి వెలిగించి, ఆయన విగ్రహం ముందు మోకరిల్లేదాన్ని. ఆ రోజు కూడా అర్ధరాత్రి 12 కొట్టగానే, ఆనంద్ తన తెల్లని కుర్తా పైజామాలో తయారై, ఇద్దరమూ కలిసి రాజగృహ లోపల స్మారక చిహ్నం దగ్గరికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. కొవ్వొత్తి వెలిగించి, అంబేడ్కర్ చితాభస్మం ఉన్న కలశం ముందు మోకరిల్లినప్పుడు తన ముఖం మీద ఎల్లప్పుడూ వెలుగుతుండే చిరునవ్వు అలాగే ఉంది. నేనూ ఆ తంతు అంతా సాగించాను గాని కొన్ని గంటల తర్వాత ఏం జరగబోతున్నదో అని నా మనసు ఆందోళన పడుతున్నది.

2020 ఏప్రిల్ 14న జరిగిన ఘటనలు అంతకు ముందరి సంవత్సరాల మధుర జ్ఞాపకాలన్నిటినీ తుడిచేశాయి. ఆ తర్వాత ప్రతి ఏప్రిల్ 14, మామీద విరుచుకుపడిన ఆ మహా వేదనను జ్ఞాపకం చేసేదే. ఆ వేదన మా జీవితాలలో ప్రతి క్షణమూ మేము అనుభవిస్తున్నదే. ఆ రోజు నేను ఆయనను ఎన్ఐఎ కార్యాలయానికి నడిపించుకు వెళ్లాను. కోర్టు ఆదేశాల ప్రకారం అక్కడ ఆయన నిర్బంధంలోకి వెళ్లాడు. లోపలికి నడుస్తున్నప్పుడు కూడా తాను చాల ప్రశాంతంగా ఉన్నాడు. అప్పుడూ ఆయనకు తన గురించి విచారం లేదు. తల్లి గురించి మాత్రం విచారించాడు. చివరి క్షణం వరకూ కూతుళ్లతో మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్లకు ధైర్యం చెప్పాడు. అంతా మంచే జరుగుతుందని చెప్పాడు. మంచి మనుషులుగా, నిజాయితీతో బతకమని చెప్పాడు. వాళ్లు ఏడుస్తుంటే ఓదార్చాడు. నా భర్తకు జరిగిన సుదీర్ఘమైన, ఇంకా కొనసాగుతున్న క్రూరమైన అన్యాయానికి ఆ రోజు జరిగినది కేవలం మొదలు మాత్రమే. నేనూ నా కూతుళ్లూ అనుభవిస్తున్న వేదనకు, నానాటికీ మరింత దుస్సహంగా మారుతున్న వేదనకు అది మొదలు మాత్రమే.

కోవిడ్ 19తో ప్రపంచవ్యాప్తంగానే కనీవినీ ఎరగని మానవతా సంక్షోభం ప్రారంభమైంది. దూరం పాటించాక, లాక్‌డౌన్ విధించాక కూడ, కొత్త కొత్త వైరస్‌లు దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంటే, టివి వార్తలు చూడడమే దుర్భరంగా మారింది. దాని మధ్యనే ఆనంద్ జైలులో ఉన్నాడు. ఉండగలిగినవారికన్న మూడు రెట్ల మంది ఎక్కువ ఉన్న కిక్కిరిసిన స్థలంలో ఉన్నాడు. ఆస్త్మా వల్ల మామూలుగానే తనకు ఊపిరి పీల్చడం కష్టమవుతుంది. ఇప్పుడిక కోవిడ్ 19 తనను అంటుకుంటే ఏమవుతుందో అనే ఆలోచనతో నేను వణికిపోయేదాన్ని.

కోవిడ్ మహమ్మారి భయంకర రోజుల్లో ప్రియమైనవాళ్ల నుంచి దూరమైన ఖైదీల మానసిక ఆరోగ్యం గురించి ఎవరూ ఆలోచించనేలేదని చెప్పనక్కరలేదు. ప్రియమైనవాళ్లను ములాఖాత్‌లో కలుసుకుంటామనే అతి చిన్న దయను కూడ లాక్‌డౌన్ మా కుటుంబాల నుంచి లాగేసుకుంది. దాని బదులు వాట్సప్ మీద వారానికి పది నిమిషాల వీడియో సంభాషణ అనుమతించారు. నా ఫోన్ రింగ్ చప్పుడు వీలైనంత బిగ్గరగా ఉండేట్టు పెట్టుకున్నాను. వైఫై మోడెమ్ కనెక్టివిటీ సరిగ్గా ఉందా లేదా అని గడియకోసారి చూసేదాన్ని. ఆనంద్‌తో మాట్లాడగలిగే అవకాశాన్ని ఎంతమాత్రం, ఎట్టి పరిస్థితిలోనూ పోగొట్టుకోగూడదని నా ఆదుర్దా. నిజం చెప్పాలంటే, నా రోజులన్నీ కూడ ఎప్పుడొస్తుందో తెలియని ఈ వారానికొక ఫోన్‌కాల్ చుట్టూ తిరుగుతుండేవి. ఆ ఫోన్ సంభాషణ అయిపోగానే వెంటనే కూతుళ్లిద్దరికీ ఫోన్ చేసి ఆయన కబుర్లు చెప్పడం తప్పనిసరి తంతు. ఎందుకంటే ఆయన నేరుగా వాళ్లకు ఫోన్ చెయ్యడానికి వీలులేదు. అతి మామూలు వీడియో కాల్ అనే భాగ్యం, భాగ్యమే అనదలచుకుంటే, అనుభవించడానికి నాకు మాత్రమే హక్కుంది.

మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టాక, వారానికొక ములాఖాత్‌లు మళ్లీ మొదలయ్యాయి. ఇది వారానికొకటి, ప్రతిసారీ పది నిమిషాలు. ఇంటి నుంచి ఒక గంట ప్రయాణం చేసి జైలు చేరుతాను. పేరు రాయించుకోవడానికి ఒక పొడవాటి వరుసలో నిలబడతాను. తనను కలవడానికి ఎదురుచూస్తూ ఉంటాను. ఈ నిరీక్షణ రెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా కావచ్చు. కనీసం ఆనంద్ రూపం చూస్తాను గదా అని అది భరిస్తాను. దుమ్ము కొట్టుకుపోయిన గాజుతెర అవతలి నుంచి మసకగా తను కనబడతాడు. ఇంటర్ కామ్ ఫోన్‌లో తన మాట వినబడుతుంది. ఇతర ఖైదీలు తమ ప్రియమైనవారితో ఉత్సాహంగా బిగ్గరగా మాట్లాడుతుంటారు. చుట్టూ జైలు సిబ్బంది ఉంటారు. వయసు వల్ల బలహీనమైన మా గొంతుల శక్తిని పూర్తిగా వాడుకోవడానికి ప్రయత్నిస్తాం. వారంలో నేను తనను కలిసే ఆ ఒక్కరోజు కోసం ఆనంద్ కూడ చాల ఆతృతగా ఎదురుచూస్తాడు. ఈ ములాఖాత్‌లలో మేం ఒకరి చేతులు ఒకరం పట్టుకోవడానికి వీలు లేదు. కౌగిలిలోకి తీసుకుని ఓదార్చుకోవడానికి వీలులేదు. మొత్తానికి మేమిద్దరమూ కూడ ఒకరి బాధను మరొకరి ముందు దాచిపెట్టే విద్య, కనీసం ఆ పది నిమిషాల్లో, బాగా నేర్చుకున్నాం.

ఆనంద్ జీవితమూ నా జీవితమూ కూడా అర్ధాంతరంగా ఆగిపోయినట్టున్నాయి. నాకు చాలసార్లు ఈ పీడకల నుంచి మేల్కొన్నట్టు అనిపిస్తుంది. టీ తాగుతూ వార్తాపత్రికలు పట్టుకుని మా బాల్కనీలో కూచుని ఉన్నామనిపిస్తుంది. కాని, అయ్యో, గడిచిన ప్రతిరోజూ, మరొక కోర్టు వాయిదాకు దారితీసే ప్రతి కోర్టు వాయిదా రోజూ, మా ప్రస్తుతస్థితిలోని యథాలాపాన్నీ, అన్యాయాన్నీ ఎవరూ అర్థం చేసుకోవడం లేదే అనిపిస్తుంది. బహుశా, వాళ్లెవ్వరూ కూడా ఇది తమకు కూడా జరగవచ్చునని ఇంకా గుర్తించలేదేమో…

(బీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఆనంద్ తేల్తుంబ్డే నిర్బంధంలోకి వెళ్ళి రెండేళ్ళయిన సందర్భంగా ఆయన సహచరి రమ The Leafletలో రాసిన వ్యాసానికి ఎన్ వేణుగోపాల్ సంక్షిప్త అనువాదం ఇది)

Courtesy Andhrajyothi

Leave a Reply