ఉ.సా. స్మృతిలో….

0
245

ఉ.సా.తో ఆనాటి జనసాహితీ రచయతగా, కళాకారునిగా …
రెండక్షరాల వాని పాట
జనంపాటై జనం వెంట సాగింది
అప్పులు మేం తీర్చలేం ఆందోళన సాగిస్తాం
అదిపాటే…అదే నినాదమైంది
నినాదమే పాటకు పల్లవై
పల్లవే నినాదమై
జనాందోళనల పతాకమై
కవీ… ఓ కళాకారుడా నీ వెటు వైపు
అనడిగే గోర్కీ ప్రశ్నై పల్లవించింది
వీరులంటే వీరులోరన్నా అంటూ పోరెత్తి
వింటినారై గిరిజనం చైతన్యపు అంబునొదిలింది
అడివింట పూసిన ఎర్రపూలుగా గుభాళించింది
కొండమొదలు కొండపై రేలా…రేలాయని రాగాలు తీసింది
పేదింటిపిల్లల నిదురకనులకు జోలాలీ పాడిన ఆ రెండక్షరాలు
మూసిన కన్నీటి వాకిటి పెనునిదుర పోతున్నాయి
అంటూ…. నాటి జనసాహితి సహచరునిగా ఉ.సా. కు జోహార్లు పలికింది నా కలం. ఉ.సా.గారు అంటే ఉప్పుమావులూరి సాంబశివరావు. మొన్నటి జూలై25వ తేదీన చనిపోయారు. జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య మచిలీపట్నం కన్వీనర్‌గా పనిచేస్తూ వీధినాటికలు రాసి, ప్రదర్శిస్తూండే మాకు, జనంపాటలు పాడి దళప్రచారాలు చేసే మాకు ఆరోజుల్లో ఒక ఇన్‌స్పిరేషన్‌ ఉ.సా.గారు. పలకాబలపం పట్టిన మొదటిసారి రాయించే అక్షరాల్లా జనంపాటల పుస్తకం మొట్టమొదటిసారి తెరిచినవారికి “మేం పాడుతాం జనంపాట పాడుతాం” అని పాడించేది, పాడేది ఉ.సా.గారు రాసిన పాటనే. ఆ పాట స్ఫూర్తియే మరో రచన, బాణీ గా ఆనాటి జనసాహితి సభ్యుడైన సన్నశెట్టి రాజశేఖర్‌ రాసి, బాణీ కట్టిన “జనంపాట పాడుతాం – జనంకోసమాడుతాం.” ఆ వరుసలో నాటి జనసాహితీ కళాకారులకు జనసాహితీ సంస్కృతిక సమాఖ్య సాహితీసభలకు ప్రారంభ గీతంగా గోర్కీ వేసిన ప్రశ్ననే పల్లవిగా పెట్టి ఉ.సా.గారు రాసిన పాట “కవీ …ఓ కళాకారుడా…. కవయిత్రీ ఓ కళాకారిణీ… అటా ఇటా నువ్వెటువైపు ….ప్రజలవైపా….ప్రభుతవైపా…. అన్నాడు ఓ ప్రజాకవీ… అతడే గోర్కీ ప్రజలకవీ ”. ఆ పాటను ఉ.సా. ఎంత బాగా రాశారంటే … గోర్కీ అంతటి ప్రజాకవిని, సాక్షాత్తు రష్యన్‌ కవిని మా పక్కనే నిలబెట్టుకుని అందర్నీ ప్రశ్నిస్తున్నామనేంతగా పాటలో మమేకమై పాడేవాళ్లం. అంత ప్రతిభావంతంగా రాశారు.

ఉప్పమావులూరి సాంబశివరావుగా పుట్టింది గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణ కోడూరు.
ఉ.సా.గా నాయకునిగా, కవిగా, కళాకారునిగా కృషిచేసింది తెలుగునేల ఊరూరు…
పగలు కాలేజీలో డిగ్రీ చదువు… రాత్రి ఓ హోటల్లో జీతపు క్యాషియరు…
టైమంటూ లేని అవిరామపు అరుణోదయం, జనసాహితి కళారంగ పనులు…
ఉద్యమంలోంచి పాటపుట్టిందో… పాటలోంచే ఉద్యమం పుట్టిందో కానీ పాటకు పల్లవి నినాదమైంది. నినాదమూ పాటకు పల్లవైంది. “అప్పులు మేం తీర్చలేం … ఆందోళన సాగిస్తాం “ పాటపల్లవి గోడలపై జేగురురంగు అక్షరాలయ్యింది . రాజశేఖర్‌ తోడు చేసుకుని ఇద్దరూ కలిసి, కొండమొదలు కొండాకోనా తిరిగి, సేకరించిన రేల పాటలు ఒక్కొక్కటీ కూర్చి “ఎర్రపూలు” గా కొండమొదలు పోరాటాన్ని దృశ్యీకరించి రంగస్థలం పై ఆడించారు. పాడించారు. “వీరులంటే వీరులోరన్నా విల్లంబులన్నా కుంజెం రాజులన్నా మడెం లచ్చుమన్నా” అంటూ గిరిజనం వీరులకు పాటలదండ వేశారు. మోత్కూరు ప్రాంత కరెంట్‌ ఉద్యమానికి తన నాయకత్వంతో పాటు జనంకోసం జనంపాటలందించారు.

అలాంటి ఘనమైన చరిత్రకు నేపథ్యం ఉద్యమం అని వేరే చెప్పాలా… ఉద్యమంలోంచే నాయకులు, గాయకులు, గేయకులు, కవులు, కళాకారులు పుట్టుకొస్తారు.
“ఎత్తిన జెండా దించకోయ్‌ …అరుణ పతాకకు జై ” అని
ప్రతిజ్ఞాగీతంలా రాసినా…
ఎలుగెత్తి పాడినా …
ఎత్తినజెండా దించకుండా ఉండటమే అసలు విషయం…
సులువుగా నెరవేర్చేసే వీలుగాని ఆశయం….
గతమెంతో ఘనకీర్తి …గతించినవాడు ఘనమైన యశస్వీ …
చనిపోయినవాని కళ్లు చారెడేసి అని అనుకునేకన్నా…
ఎత్తిన జెండా – పాడిన పాట – ఆడిన ఆట – పలికిన ‘నీ’ నాదంతోనే
జీవితపు ఆఖరు స్టేషన్లో దిగావా… మధ్యలోనే దిగిపోయావా…
అని వర్తమాన చరితమడిగే ప్రశ్నకు నేనూ నువ్వూ ఎవ్వరమైనా జవాబుదార్లమే
కడవరకూ లేకుంటే మాటకైనా… పాటకైనా… కొరవ కొరవేకదా
లాల్‌, నీల్, గ్రీన్, ఎల్లో, తెలుపు… రంగు ఏదైనా
జెండాలకు తమ జీవితాలనే రంగులుగా అద్దిన శ్రామికజన విముక్తికై
ఎజెండా ఎత్తిపట్టేందుకు ఓ చేయి తగ్గినా కొరవ…కొరవేకదా
జెండాల ఎజెండాల తర్జనభర్జనలతో సిద్దాంతాల కొలతల రణగొణులతో
సంతాప సందేశాల అక్షరఘోషలో జోహార్లు చెప్పే ఒక్కగొంతు
శృతిలో లేకున్నా కొరవ… కొరవే కదా

– ఉదయ్

Leave a Reply