రికార్డుస్థాయికి నిరుద్యోగం

0
285
రికార్డుస్థాయికి నిరుద్యోగం

 మహిళలపై పెరిగిన నేరాలు…రైతు ఆత్మహత్యలు
స్వచ్ఛమైన గాలిలేక నగరాలు సతమతం
ప్రజల ఆందోళనల్ని, భయాల్ని పట్టించుకోని పాలకులు

ఇండియాలో గత 45ఏండ్లలో లేనంతస్థాయికి నిరుద్యోగం పెరిగింది. నేరాలు…ఘోరాలు నిత్యకృత్యంగా మారాయి. మహిళలు పట్టపగలే బయటకు రాలేని పరిస్థితి. రైతు ఆత్మహత్యలు పట్టించుకునే నాథుడే లేడు. చివరికి స్వచ్ఛమైన గాలిసైతం లభ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి వీటిన్నింటిపైనా 2019 ఏడాది స్పష్టమైన హెచ్చరిక ఇచ్చినట్టే. ప్రభుత్వాలు, పాలకులు దృష్టిసారించకపోతే, ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేదు.

న్యూఢిల్లీ : ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని ముఖ్యమైన గణాంకాలు బయటకు రాకుండా మోడీ సర్కార్‌ అడ్డుకుంది. ప్రజలముందుకు వాస్తవ గణాంకాలు వస్తే..సార్వత్రిక ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులుంటాయని కేంద్రం భావించింది. నేరాలు, నిరుద్యోగం, రైతు ఆత్మహత్యలపై వాస్తవ గణాంకాలు బయటకు రాకుండా చాలాకాలంపాటు వ్యవహారాన్ని పెండింగ్‌లో పెట్టారు. వీటితో తమ అధికారానికి వచ్చిన ముప్పేమీ లేదని భావించాక (మళ్లీ మోడీ సర్కార్‌ వచ్చాక) గణాంకాల్ని అధికారికంగా విడుదల చేశారు. నిరుద్యోగం (45ఏండ్ల గరిష్టం), రైతు ఆత్మహత్యలు (11,379మంది) మహిళలపై నేరాలు (9శాతం పెరిగటం)…ఈ ఏడాది పాలకుల్ని హెచ్చరించాయి.

నిరుద్యోగ భారతం
ఎన్‌ఎస్‌ఎస్‌ఓ విడుదల చేసిన నివేదిక ప్రకారం, గ్రామీణ భారతంలో నిరుద్యోగం 7.8శాతానికి చేరుకుంది. ముఖ్యంగా పట్టణాల్లోని మహిళల్లో 27.2శాతం, చదువుకున్న మహిళల్లో 19.8శాతం నిరుద్యోగ సమస్య నెలకొంది. గ్రామాల్లో నివసిస్తున్న పురుషుల్లో(యువత) 17.4శాతం, చదువుకున్న మహిళల్లో 17.3శాతం ఉపాధి, ఉద్యోగాల లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మోడీ సర్కార్‌ కీలక నిర్ణయాలైన నోట్లరద్దు, జీఎస్టీ…ఉపాధి, ఉద్యోగరంగాల్ని తీవ్రంగా ప్రభావితం చేశాయనీ, దీనివల్ల నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందనీ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈదేశంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్న 11 లేబర్‌ హబ్స్‌లో వేతనాలు పడిపోయాయి. కార్మికుల సంఖ్య తగ్గిపోయింది.

రైతు ఆత్మహత్యలు
నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్క ప్రకారం, 2016లో రైతు ఆత్మహ త్యలు 11,379. గతంతో పోల్చు కుంటే ఆత్యహత్యకు పాల్పడుతున్న రైతు కూలీల సంఖ్య పెరిగింది. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి కేటాయింపులు కాగితాలపై ఘనంగా కనపడుతోంది. ఇదంతా కూడా క్షేత్రస్థాయిలో రైతాంగానికి చేరటం లేదన్నది ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరిగిన రైతు ఆందోళనలే నిదర్శనం.

ముంబయి, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్‌…పలు నగరాల్లో రైతు ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, గుజరాత్‌, జార్ఖాండ్‌, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ…కరువు రైతులకు తీవ్ర నష్టాల్ని మిగిల్చింది.

సమస్యల్ని సృష్టిస్తోన్న పర్యావరణం
ఎండాకాలం…వానాకాలం…చలికాలం…ప్రతిదీ ఒక విపత్తును సృష్టించి వెళ్తోంది. మానవుడి ఊహకు అందని పరిణామాలు ఆయా కాలాల్లో ఏర్పడుతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావం నేడు మనదేశంలోని కోట్లాదిమంది ప్రజలపై పడుతోంది. జులై 2019లో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. కార్చిచ్చు ఘటనలు 113శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా ఏడు సైక్లోన్లు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నదేశాల్లో ఇండియా 5వస్థానంలో ఉంది. పర్యావరణ సమస్యల కారణంగా మనదేశం కోల్పోతున్న జీడీపీ రూ.2.7 లక్షల కోట్లు. ముంబయి, సూరత్‌, చెన్నై, కోల్‌కతా..సహా అనేక నగరాల్లో కార్బన్‌ ఉద్గారాలు పెరుగుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల మనదేశంలో 60కోట్లమందికి ప్రమాదం పొంచి ఉందిన ఒక నివేదిక హెచ్చరించింది.

దేశ జనాభాలో 15 నుంచి 59ఏండ్ల మధ్య వయస్సున్న జనాభా 68.8కోట్లు. ఇది భారత్‌కు అనుకూలించే అంశంగా ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వీరందర్నీ కార్మిశశక్తిగా మలుచుకుంటే దేశ ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరిగే అవకాశముందని అన్నారు. 1985లో చైనాలో కూడా పనిచేయగల జనాభా ఎక్కువగా నమోదైంది. ఈపరిస్థితిని చైనా పాలకులు అనుకూలంగా మలుచుకున్నారు. కాబట్టే చైనా ప్రతిఏటా సగటున 9.16శాతం వృద్ధిరేటు నమోదు చేస్తూ వచ్చిందని ఆర్థిక విశ్లేషకులు గుర్తుచేశారు. భారత్‌లో పాలకులు సరైన విధానాల్ని ఎంచుకుంటే తప్పకుండా వృద్ధి నమోదు అయ్యేదే!

(Courtesy Nava Telangana)

Leave a Reply