ఐదు వేల మంది.. 350 ఎఫ్ఐఆర్లు

0
145

– సీఏఏ, ఎన్నార్సీ నిరసనకారులపై కేసులు
– వారిలో ముస్లింలే అధికం
– యూపీలోని అరెస్టులపై నివేదిక

న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ (ఎన్నార్సీ)కు వ్యతిరేకం యూపీలో నిరసన ప్రదర్శనలలో దాదాపు ఐదువేల మందిపై 350 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అరెస్టయినవారిలో అత్యధికం ముస్లింలే ఉండటం గమనార్హం. సీఏఏ అమలును, ఎన్నార్సీని తీసుకొస్తామన్న మోడీ సర్కారు ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. అదే సమయంలో యూపీలోనూ నిరసనలు జరిగాయి. అయితే, ఆ సమయంలో యోగి సర్కారు వీరిపై ఉక్కుపాదం మోపి నిరసనలను అణచివేసే ప్రయత్నం చేసింది.ఈ నివేదిక ప్రకారం.. యూపీలో జరిగిన నిరసనల్లో పోలీసు చర్యలకు 23 మంది మృతి చెందారు. దాదాపు 3000 మందిని యూపీ ప్రభుత్వం అరెస్టు చేసిందని అంచనా. ‘యూపీలో సమాన పౌరసత్వం కోసం పోరాటం : ముస్లిం మైనారిటీలపై ఎఫ్‌ఐఆర్‌లు, అరెస్టులు, వేధింపులు’ పేరుతో ఈ నివేదికను అసోసియేషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ (ఏపీసీఆర్‌) ప్రచురించింది. గత రెండు ఏండ్లుగా యూపీలో సీఏఏ-ఎన్నార్సీ వ్యతిరేక నిరసనల్లో ముస్లింలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, వారి అరెస్టుల గురించి ఈ నివేదిక కవర్‌ చేసింది.

ప్రస్తుతం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో తాజా నివేదిక విడుదల కావడం గమనార్హం. దాదాపు 10వేల మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తుల పేర్లు ఈ 350 ఎఫ్‌ఐఆర్‌లలో ఉన్నాయి. ముఖ్యంగా, 2019 డిసెంబర్‌ 19న జరిగిన నిరసనల్లో 3,305 మంది ఆందోళనకారులను యూపీలోని యోగి సర్కారు నిర్బంధించింది. దీంతో అరెస్టయిన నిరసనకారుల సంఖ్య ఒక్కసారిగా 5,400కు చేరుకున్నది. అంతేకాకుండా, ఎలాంటి న్యాయప్రక్రియ లేకుండానే దాదాపు రూ. 3.55 కోట్ల విలువ గల నష్టాలకు సంబంధించి పది జిల్లాల్లో 500కు పైగా రికవరీ నోటీసులు జారీ అయ్యాయి. అయితే, ముస్లింలను లక్ష్యంగా చేసుకొనే ఈ నోటీసుల జారీ అయ్యాయి. అయితే, యూపీలోని యోగి ప్రభుత్వం మాత్రం ఈ 350 ఎఫ్‌ఐఆర్‌లలో మొత్తం నిందితుల సంఖ్యను వెల్లడించకపోవడం గమనార్హం. అయితే, వార్తల్లో వచ్చిన అంశాలు, ఎఫ్‌ఐఆర్‌లు, ప్రజలకు అందిన నోటీసులను ఆధారంగా చేసుకొని ఈ నివేదికను తయారు చేశారు. 350 ఎఫ్‌ఐఆర్‌లలో 250 వరకు సమాచారాన్ని మేము సేకరించగలిగామని నివేదికను రూపొందించిన వారిలో ఒకరైన మానవ హక్కుల కార్యకర్త నదీమ్‌ ఖాన్‌ తెలిపారు. ఒక్క కాన్పూర్‌లోనే ఒక్క ఎఫ్‌ఐఆర్‌లో 21,500 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను చేర్చినట్టు వివరించారు.

Courtesy Nava Telangana

Leave a Reply