వలస కూలీలు… పట్టణీకరణ

0
388

”గంజి అన్నంలో ఇంత ఉప్పు కలుపుకుని తిని బతుకుతాం, అంతే కాని మళ్ళీ పని కోసం పట్నానికి రాం, రానే రాం”. లాక్‌డౌన్‌ తర్వాత నానా తిప్పలూ పడుతూ తమ స్వంత ఊళ్లకు తరలిపోతున్న వలస కూలీలు కొందరు చెప్పిన ఈ మాటలు పట్టణాల్లో వారెటువంటి అవస్థలు పడ్డారో, ఎంత విసిగిపోయారో సూచిస్తున్నాయి. ప్రభుత్వాలు వారి బాగోగులను ఏమాత్రం పట్టించుకోకుండా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో తెలియజేస్తున్నాయి.

‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’ అధ్యయనం ప్రకారం నిరుద్యోగం 27 శాతానికి చేరుకుంది. దాంతోబాటు పని చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసిన వారి శాతం 74 నుంచి 38 కి పడిపోయింది. దీనిని బట్టి పట్టణాల్లో అసంఘటిత కార్మికులు, అందునా ముఖ్యంగా వలస కార్మికులు ఏవిధంగానైనా తమ స్వగ్రామాలకు వెనక్కి పోడానికే సుముఖంగా ఉన్నారని స్పష్టం అవుతోంది. బతుకు తెరువు కోసం పల్లెల్ని వదిలి పట్టణాలకు తరలి పోవడం వలస పోవడం అంటాం. ఇప్పుడు జరుగుతున్నది దానికి రివర్స్‌. పట్టణాల్లో బతకలేక తిరిగి స్వంత ఊళ్లకు పోతున్నారు. అందుచేత ఇవి రివర్స్‌ వలసలు.

గత కొన్ని సంవత్సరాలుగా అమలులో ఉన్న పట్టణాభివృద్ధి పథకాలు, ”నిలకడతో కూడిన అభివృద్ధి నమూనా”లు (సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ మోడల్‌) ఏమైనట్టు? ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఊదరగొడుతున్న అభివృద్ధి నిజంగా జరిగి వుంటే ఈ రోజు వలస కార్మికులు ‘మేమిక్కడ బతకలేం బాబో’ అని ఎందుకు వెనక్కి పోవాలి? మోడీ ప్రభుత్వం వచ్చాక ప్రకటించిన ‘స్మార్ట్‌ సిటీ’, ‘అమృత్‌’ (అటల్‌ మిషన్‌ ఫర్‌ అర్బన్‌ రిజువెనేషన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌) పథకాల లోని డొల్లతనం ఇప్పుడు బైటపడింది. ‘స్వాస్థ్య నగరాలు’ (రిసైలెంట్‌ సిటీస్‌) ప్రాజెక్టు కింద అంతర్జాతీయ నిధులతో సూరత్‌ వంటి నగరాల్లో అమలు జరిపిన స్కీముల ప్రయోజనం ఏమీ లేదని తేలిపోయింది. ఈ స్కీములేవీ శ్రామిక ప్రజలకు ఇసుమంతైనా ఉపయోగపడలేదు. వలస కార్మికులు అతి ఎక్కువగా అవస్థలు పడిన నగరాల్లో సూరత్‌ మొదటిది. అక్కడ లాక్‌డౌన్‌ అనంతరం వలస కార్మికులు కనీసం ఐదు సార్లు ఆందోళనలు చేశారు, లాఠీచార్జి, నీటి ఫిరంగులు, అరెస్టులు ఎదుర్కున్నారు.

ఇప్పుడు వలస కార్మికుల పరిస్థితి ‘ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి’ అన్నట్టు అయింది. పల్లెల్లో బతకలేకనే వారంతా పట్నాల బాట పట్టారొకప్పుడు. ఇప్పుడు ఆ పట్నాల్లో సైతం బతకలేని పరిస్థితులు వచ్చి పడ్డాయి. రేపు కోవిడ్‌-19 అదుపు లోకి వచ్చి, మళ్లీ వారంతా పట్నాలకు తిరిగి వస్తే ఇక్కడ బతుకులు సాఫీగా సాగిపోతాయన్న నమ్మకం లేదు. కాని తిరిగి రావాల్సిందే. ఆ పల్లెల్లో వ్యవసాయ రంగంలో వారికి ఎటువంటి ఉపాధీ లేకనే కదా వారు వలసలబాట పట్టారు. ఇప్పుడు మాత్రం పల్లెల్లో పరిస్థితి ఏమైనా మారిందా? లేదు కదా. మరి వీరి భవిష్యత్తు సవ్యంగా ఉండాలంటే ఇప్పుడు అమలు జరుగుతున్న పట్టణీకరణ నమూనాలను మొత్తంగానే మార్చివేయాలి. అప్పుడే పట్టణాభివృద్ధిలో శ్రామికులకు న్యాయమైన భాగం దక్కుతుంది.

19 వ శతాబ్దంలో యూరప్‌లో జరిగిన ప్రపంచీకరణకు, ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న పట్టణీకరణకు మౌలికంగానే తేడా ఉంది. అక్కడ ముందు పరిశ్రమలు వచ్చాయి, ఆ తర్వాత పట్టణాభివృద్ధి జరిగింది. మన దేశంలో కూడా ముంబై, కోల్‌కతా, కాన్పూర్‌, చెన్నై వంటివి పరిశ్రమలు వచ్చాకనే నగరాలుగా అభివృద్ధి చెందాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలి దశాబ్దాలలో అభివృద్ధి చెందిన విశాఖపట్నం, హైదరాబాదు, కొచ్చిన్‌ వంటి నగరాలు అక్కడ భారీ, ప్రభుత్వ రంగ పరిశ్రమలు నెలకొల్పిన అనంతరమే అభివృద్ధి చెందాయి. కాని ప్రస్తుత ప్రపంచీకరణ కాలంలో మన దేశంలో సాగుతున్న పట్టణీకరణ సేవారంగం మీద ఆధారపడి జరుగుతోంది.

పరిశ్రమలు, ఉత్పత్తి ప్రధానం అయినప్పుడు పట్టణాల్లో ఏర్పడే వర్గాలు యజమానులు, కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు ప్రధానంగా ఉంటారు. అదే ఈ సేవారంగం ప్రధానం అయినప్పుడు ఇక్కడ సమీకరించబడే వర్గాలు వేరు. రియల్‌ ఎస్టేట్‌, చిట్‌ ఫండ్స్‌, ప్రైవేటు ఫైనాన్స్‌, కాంట్రాక్టర్లు, ఏజంట్లు – ఈ సంఖ్య పెరిగింది. మరో పక్క కార్మికులలో సైతం సంఘటిత భాగం బాగా తగ్గి అసంఘటిత భాగం విపరీతంగా పెరిగింది. నాలుగు దశాబ్దాల క్రితం పరిశ్రమ యజమానే తన కార్మికులకు క్వార్టర్లు, ఆస్పత్రి, స్కూలు కట్టించేవాడు. కంపెనీ బస్సుల్లో కార్మికులకు రవాణా ఏర్పాటు చేసేవాడు. క్రీడా, సాంస్కృతిక సదుపాయాలనూ కల్పించేవాడు. ఇక ప్రభుత్వ రంగంలో ఇవన్నీ తప్పనిసరిగా ఉండేవి. కాని ఉదారవాద విధానాలు వచ్చాక కార్మికుల సంక్షేమం యజమానులకు ఒక బాధ్యతగా ఇంకెంతమాత్రమూ లేకుండా పోయింది. ఆఖరుకు ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఆ బాధ్యతల నుండి తప్పించుకోడానికి కాంట్రాక్టు కార్మికులనే నియమిస్తున్నాయి.

గతంలో పల్లెల్లో కన్నా పట్టణాల్లో మంచి బతుకు దొరుకుతుందని పట్టణాలకు వచ్చేవారు. యూరప్‌లో పట్టణీకరణ అటువంటి నేపథ్యంలోనే జరిగింది. దానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు పల్లెల్లో బతకడం అసాధ్యం అయినందు వలన అనివార్యంగా పట్టణాలకు వస్తున్నారు. ముఖ్యంగా దళిత, గిరిజన, ఇతర బలహీన వర్గాలకు చెందిన పేదలు పట్టణాలకు వలసలొస్తున్నారు. రోజూ ఉదయాన్నే గుంపులు గుంపులుగా టౌన్లలో, ఎవరు పని లోకి పిలుస్తారా అని ఎదురుచూస్తూ మనకి దర్శనమిచ్చేది వీరే. అసంఘటిత రంగం పెరుగుదలలో భాగంగానే ఆటోలు, తోపుడు బళ్లు, ఇంటింటికీ తిరిగి రకరకాల వస్తువులను కేన్వాస్‌ చేసేవారు, హోమ్‌ డెలివరీ బార్సు…పెరిగారు.

మరి వీరందరికీ నివాసాలు, వీరి పిల్లలకి చదువు, వీరి కుటుంబాలకు వైద్యం, వీరికి రవాణా-ఇవన్నీ ఎవరు కల్పించాలి? ఒక యజమాని దగ్గర స్థిరంగా పని చేయగలిగిన పరిస్థితే లేనప్పుడు ఈ బాధ్యతను ఎవరు స్వీకరించాలి? ప్రభుత్వాలే ఆ బాధ్యతను స్వీకరించాలి. కాని నయా ఉదారవాదం అందుకు అంగీకరించదు. ప్రైవేటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని, విద్య, వైద్యం, రవాణా తదితర రంగాలలో ప్రైవేటు పెట్టుబడిని ప్రోత్సహించాలని, దానికి అనుగుణంగా విధానాలు ఉండాలని నయా ఉదారవాదం పట్టుబడుతుంది. వీటితోబాటు తాగునీటి సరఫరా, పారిశుధ్యం వంటి పౌర సేవలను కూడా ‘సరుకులు’గా పరిగణించి యూజర్‌ చార్జీలు వసూలు చేయాలంటుంది. వీటన్నింటినీ అమలు చేయడానికి అంగీకరించే స్థానిక సంస్థలకే రకరకాలుగా స్కీముల పేర అప్పులు ఇచ్చే విధానం వచ్చింది.

”నిలకడైన అభివృద్ధి లక్ష్యాలు” (సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌) పేరుతో 17 లక్ష్యాలను ప్రకటించింది కేంద్రం. ఈ లక్ష్యాలను 2030 నాటికి చేరుకోవాలి. వీటిలో ఏకంగా 9 లక్ష్యాలు పేదరిక నిర్మూలన కు సంబంధించినవే. అందుకోసమే ‘స్మార్ట్‌ సిటీ, అమృత్‌’ తెచ్చామంటూ మోడీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంది. మరి ఇందుకోసం చేస్తున్న ఖర్చు ఎంత? పట్టణాల్లో పౌరసేవల నిర్వహణకు, గృహ వసతి, రోడ్లు వగైరా మూలధన వ్యయానికి (కాపిటల్‌ వ్యయం) కలిపి సాలుకు 50 డాలర్లు తలసరి ఖర్చు మన దేశంలో చేస్తున్నారు. అదే చైనాలో 362 డాలర్లు, దక్షిణాఫ్రికాలో 508 డాలర్లు, బ్రిటన్‌ లో 1772 డాలర్లు ఖర్చు చేస్తున్నారు. మన దేశంలో పట్టణాల్లోని ప్రజలంతా కనీసంగా మౌలిక సదుపాయాలన్నీ కలిగివుండేలా చేయాలంటే మూల ధన వ్యయంగా 85 లక్షల కోట్ల రూపాయలు అవసరం. మెకన్సీ గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక తెలిపిన వివరాలివి.

కార్పొరేట్లను బలపరిస్తే అవసరమైన అభివృద్ధినంతటినీ వారే తీసుకొస్తారన్నది మన పాలకుల సిద్ధాంతం. మరి ఈ రూ. 85 లక్షల కోట్ల పెట్టుబడిని వారు తీసుకురావాలి కదా? కాని ఈ తరహా ప్రాజెక్టుల్లో ఆ కార్పొరేట్లెవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రానేలేదు. ప్రభుత్వమేమో పెట్టుబడి పెట్టలేదు, ఒకవేళ పెడదామనుకున్నా నయా ఉదారవాదం అందుకు ఒప్పుకోదు. అందుకే మన పట్టణాభివృద్ధి అంత అన్యాయంగా ఉంది. ఏ శ్రామికులైతే నగరాలను నిర్మిస్తారో వారికే ఆ నగరాల్లో బతికే చోటు లేకుండా పోయింది.

వలస కార్మికులను ఎలాగైనా వెనక్కి రప్పించాలని అప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయి. పంజాబ్‌ లోని లూధియానా, పాటియాలా, జలంధర్‌ వంటి నగరాలకు యు.పి, బీహార్‌, ఒడిశా రాష్ట్రాల నుండి వలస కూలీలు వచ్చేవారు. ఇప్పుడు వారిని మళ్ళీ రప్పించాలని…అందుకోసం ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఇప్పుడు యాపిల్‌ తోటల్లో కూలీలు అవసరం. అందుకోసం ఆ రాష్ట్రంలోని ధనిక భూస్వాములంతా ముఖ్యమంత్రి పై వత్తిడి తెచ్చి నేపాల్‌ నుండి కూలీలను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. పలు పరిశ్రమల్లో, తోటల్లో, పొలాల్లో కూలీల అవసరం ఇప్పుడు చాలా ఉంది. అందుచేత ఇటువంటి ప్రయత్నాలే మరింత ముమ్మరం అవుతాయి. అప్పుడు మళ్ళీ వలస కూలీల ప్రయాణాలు మొదలవుతాయి. మళ్ళీ వారి వెతలూ మొదలవుతాయి.

ఈ సారైనా ముందుగానే వారి సమస్యలమీద ప్రభు త్వాలు దృష్టి సారించేలా కొన్ని డిమాండ్లతో కార్మికోద్యమం ముందుకు రావాలి. కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రంలో వలసకూలీల కోసం చాలా కాలం ముందు నుంచే చేసిన, చేస్తున్న ఏర్పాట్ల గురించి, కల్పించిన సదుపాయాల గురించి తెలుసుకుని వాటిపై అందరికీ అవగాహన కల్పించాలి.

సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టాక కేంద్రం వలస కూలీల గురించి ఏదో చేస్తున్నట్టు హడావుడి చేస్తోంది. వలస కూలీల సమస్యలను పరిష్కరించడానికి ఒక కమిషన్‌ (మిటిగేషన్‌ కమిషన్‌) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ముందుకొచ్చింది. అసలు ఎంతమంది వలస కార్మికులున్నారో, ఎక్కడెక్కడ నుంచి వచ్చారో, ఎటువంటి పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారో ఏమీ సమాచారం లేకుండానే ఇలాంటి ప్రతిపాదనలతో వస్తున్నారంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థం అవుతోంది. ఎప్పటి నుంచో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పడింది. కాని ఇప్పటికీ అందులో కనీసం 15 శాతం భవన నిర్మాణ కార్మికులు కూడా నమోదు కాలేదు. పైగా మన రాష్ట్రంలో ఆ నిధిని కూడా దారి మళ్ళించి తమ పేర్ల మీద పాలకులు రకరకాల పథకాలు ప్రకటిస్తున్నారు. ఇప్పుడీ కమిషన్‌ ను కూడా ఆచరణలో అలాగే నీరుగారుస్తారు.

అందుచేత వలస కార్మికుల కోసం కనీస సదుపాయాలు, రక్షణ ఉండే విధంగా డిమాండ్లు ఉండాలి. 74వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవరించి మునిసిపాలిటీలకు, కార్పొరేషన్లకు అధికారాలు, బాధ్యతలు, నిధులు ఇచ్చి అసంఘటిత కార్మికుల సంక్షేమం చూసేవిధంగా నిర్ణయించాలి. వలస కార్మికులకు ఉపాధిని గ్యారంటీ చేయాలి. ఆహార భద్రత కల్పించాలి. ఆరోగ్యసేవలను వారు పొందగలిగేలా అర్హత కల్పించాలి. కుటుంబాలతో వచ్చిన వారికి గృహ వసతి, తక్కిన వారికి లేబర్‌ హాస్టళ్ళు ఉండాలి. ఎప్పటికప్పుడు వలస కార్మికుల వలసల సమాచారాన్ని నమోదు చేసే విధానం ఉండాలి. కేరళలో స్థానిక సంస్థలకు ఈ బాధ్యతలను ఇచ్చి, నిధులను కేటాయించిన కారణంగానే అక్కడ వలస కార్మికులు ఈ కరోనా కాలంలోనూ ఎటువంటి ఇబ్బందులూ పడలేదు. ఆ అనుభవాలను అధ్యయనం చేయాలి. తక్కిన దేశమంతటా అమలు చేయాలి. అలా అమలు జరిగేలా కార్మికోద్యమం ఒత్తిడి చేయాలి. ఆ క్రమంలోనే వలస కార్మికులను సంఘటితం చేయడం సాధ్యపడుతుంది.

సత్యం

Courtesy Prajasakti

Leave a Reply