చూశాను, వచ్చాను, జయించాను!

0
287

జూలియస్‌ సీజర్‌ లాటిన్‌ భాషలో వెని, విడి, విసి అన్న మాటను షేక్స్‌పియర్‌ తన ‘లౌవ్స్‌ లేబర్స్‌ లాస్ట్‌’ నాటకంలో వేరే సందర్భంలో రాశాడు. దాన్ని నేడు మనం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కి ఆపాదించుకుని ఆలోచించాలి. ఎందుకంటే ట్రంప్‌ దొర వచ్చాడు. తన దేశానికి అవసరమైనన్ని గెల్చుకుని వెళ్లాడు. కాకపోతే మోడీని పదేపదే ఆలింగనం చేసుకుని మరీ గెల్చుకున్నాడు. అహ్మదాబాద్‌లో కాలు మోపినప్పటి నుంచి మోతేరా స్టేడియం నుంచి వెళ్లే లోపు నాలుగు గంటల్లో ఆరుసార్లు కౌగిలించు కున్నట్టు మీడియా లెక్కించింది. భారతదేశానికి నమ్మకమైన, విశ్వాసమైన మిత్రుడుగా అమెరికా ఉంటుందన్న విషయాన్ని నొక్కి వక్కాణించాడు ట్రంప్‌ దొర.

హౌస్టన్‌లో అతిపెద్ద ఫుట్‌బాల్‌ స్టేడియంలో జరిపిన ”హౌడీ మోడీ”కి దీటైన ”నమస్తే ట్రంప్‌” సభకు పదే పదే మోడీని అభినందించాడు ట్రంప్‌. ఏమైనా ఆయనకి, ఆయన దేశానికి కావల్సిన వాటిని రాబట్టుకునే పోయాడు.
ట్రంప్‌ వచ్చినదెందుకు? ఆయన గెలిచిందేమిటి? అన్న రెండు విషయాలూ నేడు మనదేశానికి ముఖ్యమే. అమెరికాలోని హౌస్టన్‌లో (రెండున్నర లక్షలమంది భారతీయులు నివశించే టెక్సాస్‌ రాష్ట్రంలో ఉంది) అచ్చంగా ట్రంప్‌ గెలుపు కోసం ఉద్దేశించిన సభ అది. నేడు అహ్మదాబాద్‌లో కోటిమందితో ఆహ్వానం పలుకుతానని వాగ్దానం చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో లక్షమందితో సభ జరిపింది కూడా బహుశా ట్రంప్‌ సేవకే అని మరువరాదు. అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న గుజరాతీ ఓటర్లను ట్రంప్‌కి వేయించేందుకే ఇంత ఖర్చు. మూడు గంటల సభకోసం అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ రూ.120 కోట్లు ఖర్చు చేసింది.

ఇక గెలిచిందేమిటనే అంశం చూద్దాం. ఒక గంటసేపు ట్రంప్‌ – మోడీల వన్‌ – టు – వన్‌ మీటింగ్‌ జరిగింది. ఇద్దరూ బయటకొచ్చి చెప్పిందేమంటే.. ”ఇప్పటిదాకా ఉన్న ఇరుదేశాల సంబంధాలను సమగ్ర గ్లోబల్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి అప్‌గ్రేడ్‌ చేశా”మని!

‘మీ ఇంటికొస్తే నాకేమి పెడ్తావ్‌.. మా యింటికొస్తే నాకేమి తెస్తావ్‌?’ అన్న ధోరణే అమెరికా అధ్యక్షులది. పైగా ట్రంప్‌ స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు. వ్యాపారవేత్త. పెద్ద వాణిజ్య ఒప్పందానికి ట్రంప్‌ పునాది వేసి వెళ్లాడు. ప్రస్తుత రాజకీయ భౌగోళిక పరిస్థితిలో మన దేశాన్ని తన జూనియర్‌ భాగస్వామిగా చేయడానికి అవసరమైన పునాది 2008లోనే పడింది. ప్రస్తుతం మన దేశం అమెరికా వ్యూహాత్మక, మిలటరీ, భద్రతా ప్రయోజనాలు కాపాడే భాగస్వామిగా మారింది. అహ్మదాబాద్‌ సభలో ట్రంప్‌ ”భారతదేశం అమెరికా ప్రధాన మిలటరీ భాగస్వామిగా అయ్యేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ప్రకటించారు. గత దశాబ్ద కాలంలో అమెరికా నుంచి భారతదేశం 15 నుంచి 18 (1,05,000-1,26,000 కోట్ల రూపాయలు) బిలియన్‌ డాలర్ల ఆయుధాలు కొన్నది. ట్రంప్‌ నిరంతర వత్తిడి ఫలితంగా 24ఎంహెచ్‌.60ఆర్‌ నావల్‌ హెలీకాప్టర్లూ, ఆరు అపాచి హెలీకాప్టర్లు కొంటామని రూ.21,000 కోట్ల కాంట్రాక్టు కుదిరింది. ఇప్పటికే మన ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌ అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలీకాప్టర్‌ ‘ధృవ’, లైట్‌ కాంబాట్‌ హెలీకాప్టర్‌ ‘రుద్ర’లు తయారు చేస్తున్నది. ఇప్పుడీ ఒప్పందం హెచ్‌ఏఎల్‌ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బెంగుళూరు, హైదరాబాద్‌, పూనే మొదలైన నగరాల్లోని 52డీఆర్‌డీఓ లేబొరేటరీల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టు ఆయుధాలు తయారుచేసుకునే సౌకర్యం ఉన్నా వాటిని పడావు పెట్టి అమెరికా నుంచి దిగుమతి, ఆ టెక్నాలజీతో భారతీయ పెట్టుబడిదార్ల కంపెనీలైన టాటా, ఎల్‌ అండ్‌ టీ, రిలయెన్స్‌ మొదలైన సంస్థలకు ఆర్డర్లు ఇవ్వడం.. ఇది మోడీ మార్క్‌ ”మేక్‌ ఇన్‌ ఇండియా”.
మన దేశానికి ఇప్పుడు సంతకాలైన మూడు ఒప్పందాల్లో కీలకమైంది ”బేసిక్‌ ఎక్స్చేంజి కో ఆపరేషన్‌ అగ్రిమెంట్‌” ఈ మూడూ కలిసి ఆసియాలోని జపాన్‌, దక్షిణ కొరియాల్లాగా మన సైన్యాన్ని అమెరికా రాజకీయ భౌగోళిక వ్యూహంలో అంతర్భాగం చేస్తాయి. ముఖ్యంగా అమెరికా, జపాన్‌, ఇండియా త్రిమూర్తి బృందంలోనూ, అమెరికా, ఇండియా, జపాన్‌, ఆస్ట్రేలియా చతుర్భుజ బృందాలలోను మనదేశాన్ని అంతర్భాగం చేస్తుంది. 70/80 దశకాల్లో చరిత్రలో కల్సిపోయిన సీటో (సౌత్‌ ఈస్ట్‌ ఏసియన్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) సెంటో (సెంట్రల్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) ఆన్జుస్‌ (ఆస్ట్రేలియా – న్యూజిల్యాండ్‌, అమెరికా) వంటివి మరో రూపంలో అమెరికా ఉనికిలోకి తెస్తున్నది. దారుణమైన విషయమేమంటే ఈ మిటలరీ కూటములకు దూరంగా అలీనోద్యమ నిర్మాతల్లో ఒకరుగా నిలిచిన భారతదేశం సరళీకృత ఆర్థిక విధానాల పుణ్యమా అని, అమెరికాతో అంటకాగే బీజేపీ విధానాల వల్ల నేడీ పరిస్థితి దాపురించింది.
భారతదేశ వ్యూహాత్మక స్వతంత్రత, స్వతంత్ర విదేశాంగ విధానాన్నీ ఆచరించే శక్తి మోడీ ప్రభుత్వ చర్యల వల్ల అడుగంటిపోతున్నాయి. ఇటీవల ఇరాన్‌ అత్యున్నత స్థాయి మిలటరీ అధికారిని అమెరికా హత్యచేస్తే మన దేశం కనీసం ఖండించనైనా లేదు. ఇరాన్‌ నుంచి చమురు కొనవద్దని అమెరికా శాసిస్తే మోడీ సర్కార్‌ ‘జీహుజూర్‌’ అన్నది. మిసైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ రెజీమ్‌ (ఎంటీసీఆర్‌)ను వామపక్షాలపై ఆధారపడ్డ యూపీఏ-1 కాలంలో మన దేశం తిరస్కరించింది. ఇవాళ మోడీ సర్కార్‌ సంతకం చేసింది.
ట్రంప్‌ను ముఖస్తుతితోనో, కౌగిలింతలతోనో, చక్కిలిగింతలతోనో ప్రసన్నం చేసుకునేందుకు మోడీ సర్కార్‌ చేస్తున్న ప్రయత్నాలు చెల్లుబాటు కావు. ఎక్కడైనా బావగానీ వంగతోట కాడ కాదనేది అమెరికన్‌ పాలకుల నైజం. మాయాబజార్‌లో శకుని అన్నట్టు ముఖస్తుతికీ, అఖండ సన్మానానికీ పడే ఘటాలు కారు అమెరికన్‌ పాలకులు.

Courtesy Nava telangana

Leave a Reply