గర్భవిచ్ఛిత్తిని రాష్ట్రాలు నిషేధించొచ్చు

0
37

అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు

వాషింగ్టన్‌: అమెరికాలో గర్భవిచ్ఛిత్తి (అబార్షన్‌)కి సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశంలో అబార్షన్‌ చేయించుకునేందుకు వీలుగా మహిళలకు దాదాపు 50 ఏళ్లుగా అందుబాటులో ఉన్న రాజ్యాంగపరమైన రక్షణలకు ముగింపు పలికింది. గర్భవిచ్ఛిత్తిని నిషేధించే విషయంలో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. 5-3 మెజార్టీతో సంబంధిత తీర్పు వెలువడింది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 25 రాష్ట్రాలు గర్భవిచ్ఛిత్తిపై త్వరలోనే నిషేధాజ్ఞలు విధించే అవకాశాలున్నాయి.

సుప్రీం తీర్పును అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తప్పుపట్టారు. అబార్షన్‌ విషయంలో మహిళల హక్కులను కాపాడేందుకు తన అధికారాలను ఉపయోగించుకుంటూ అవసరమైన కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఒక మహిళ, ఆమె డాక్టర్‌ తీసుకునే నిర్ణయంలో రాజకీయ నాయకుల జోక్యం ఎంతమాత్రమూ అభిలషణీయం కాదని పేర్కొన్నారు. సుప్రీం తీర్పుపై మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా విమర్శలు గుప్పించారు.
అమెరికన్ల స్వేచ్ఛపై దాడిగా దాన్ని పేర్కొన్నారు. మరో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం దీనిపై హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్‌ హయాంలో నియమితులైన ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్‌ నీల్‌ గొర్సుచ్‌, జస్టిస్‌ బ్రెట్‌ కావనాగ్‌, జస్టిస్‌ అమీ కొనే బారెట్‌ అబార్షన్‌ హక్కులకు మంగళం పాడేందుకు మద్దతు పలికారు. గర్భవిచ్ఛిత్తికి సంబంధించి అమెరికాలో ఇటీవల ఒపీనియన్‌ పోల్స్‌ నిర్వహించగా.. మెజార్టీ పౌరులు మహిళలకు ఆ విషయంలో పూర్తి హక్కులు ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికే ముప్పుందని అంచనాలు వెలువడుతున్నాయి.

Leave a Reply