స్వాప్నికుడు, ఉద్యమశీలి

0
34

వై.కె.

ఉద్యమాల ఉపాధ్యాయుడుగా ప్రసిద్ధుడైన ఉప్పుమావులూరి సాంబశివరావు(ఉసా)ది మౌలికంగా మార్క్సిస్ట్‌ గతితార్కిక-చారిత్రక భౌతికవాద ప్రాపంచిక దృక్పథం. భారతదేశంలో ఆ దృక్పథం ప్రాతిపదికగా ప్రారంభం అయిన సిపిఐ ఉద్యమం, 1967లో నగ్జల్బరీ మలుపు తిరిగిన తరువాత 1970 దశకంలో ఆయన ఉద్యమంలో ప్రవేశించాడు. ఉ.సా స్వగ్రామం గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం లోని బ్రాహ్మణకోడూరు. అది గొప్ప కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర గల గ్రామం. ఒక పాత తరం కమ్యూనిస్టు నాయకుడి స్థూపం, మరో నగ్జల్బరీ దళిత విప్లవ విద్యార్థి యువ అమరుడు దున్నా సుధాకర్‌ స్థూపం – ఈ రెండు స్థూపాలు వెలసిన గ్రామం అది. అలాంటి గ్రామ స్వభావం ఉ.సా పైన ఉండటం సహజమే.

దేశంలో విప్లవోద్యమం, ప్రారంభం నుంచే రెండు పంథాలుగా నడిచింది. (1) చారూ మజుందార్‌ పీపుల్స్‌వార్‌ ప్రవాహం. (2) తరిమెల నాగిరెడ్డి విధానం. రెండోది అయిన యు.సి.సి.ఆర్‌.ఐ. (ఎం.ఎల్‌.) నిర్మాణంలో భాగంగా ఉ.సా ప్రయాణించారు. ఇండియాలో వేళ్ళూనుకుని ఉన్న కుల సమస్యనీ, కుల దృక్పథాన్నీ ఉ.సా ఆ నిర్మాణంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేశాడు. కులాన్ని కీలక అంశంగా గుర్తించ నిరాకరించిన ఆ పార్టీ నాయకత్వం ఉ.సా.ని నిర్మాణం నుంచి తొలగించింది. సైద్ధాంతిక రాజకీయ సమస్యని అవగాహన, చర్చ, ఆచరణాత్మక పద్ధతుల ద్వారా కాకుండా, ఉ.సా పైన నిర్మాణ చర్యల ద్వారా పార్టీ నాయకత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది.

1985 జూలై 17న కారంచేడులో మాదిగ సామాజిక వర్గంపైన హత్యాకాండ, 1991 ఆగస్టు 6న చుండూరులో మాల సామాజిక వర్గంపైన దాడిచేసి ఊచకోత కోసిన దమన కాండలు ఉ.సాని బహు తీవ్రంగా కలత పెట్టాయి. రెండు సందర్భాల్లో సాగిన మహోద్యమంలో ఉ.సా ప్రత్యక్షపాత్ర వహించి తనదైన ముద్ర వేశాడు. రచయిత, కవి, గాయకుడు కూడా అయిన ఉ.సా, దళితులు అనుభవించిన బాధల్నీ, సాగించిన పోరాటాల్నీ అక్షరీకరించాడు; కవిత్వీకరించాడు; గానం చేశాడు. ఆ పాటలు ఉద్యమ క్రమంలో ప్రతిధ్వనించాయి. కారంచేడులో ప్రజాకవి గద్దర్‌, చుండూరులో విప్లవకవి సత్యమూర్తి (శివసాగర్‌), రెండు ఉద్యమాల నాయకుడు కత్తి పద్మారావు, మేధావి, న్యాయవాది బొజ్జా తారకం వంటి ప్రముఖులతో ఉ.సా ఉన్నతస్థాయిలో కలిసి పని చేశాడు. ఆ గ్రామాల ప్రజలుగానీ, రాష్ట్ర నలుమూలల నుంచి పాల్గొన్న ఉద్యమకారులుగానీ, ఉ.సా కృషినీ, పాత్రనీ సదా జ్ఞప్తికి తెచ్చుకుంటారు.

కుల-వర్గ దృక్పథంతోనే అమరవీరుడు మారోజు వీరన్న నాయకత్వంలో రాజకీయ పార్టీ స్థాపనకీ, అణచబడ్డ కుల సంఘాల నిర్మాణాలకీ ఉ.సా పూర్తిగా సహకరించారు. అంతిమంగా వర్గాలను నిర్మూలించి, వర్గరహిత సమాజ స్థాపనకై, వర్తమాన కాలంలో శ్రామిక వర్గ సంఘాల నిర్మాణం ఎలా అవసరమో, అలాగే, అంతిమంగా కులాలను నిర్మూలించి, కులరహిత సమాజ స్థాపనకై వర్తమాన కాలంలో అణచబడ్డ కుల సంఘాల నిర్మాణం అంతే అవసరం అని ఉ.సా సూత్రీకరించారు. వర్గాల నిర్మూలనలో శ్రామిక వర్గ పాత్ర ఎలా నిర్ణాయకమైనదో, కుల నిర్మూలనలో అణచబడ్డ కులాల పాత్ర కూడా అంత నిర్ణాయకమైనదని ఉ.సా విశ్లేషించారు.

ఏ సందర్బంలోనైనా, రాజకీయానికీ, రాజ్యాధికారానికీ ఆధిపత్య స్థానం కల్పించాలనే భావజాలం గల ఉ.సా, మహాజన ఫ్రంట్‌ నిర్మాణంలో కీలక పాత్ర వహించారు. ఫ్రంట్‌ ప్రారంభోత్సవ సభ హైదరాబాద్‌లోని నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో సందేశాత్మకంగానే గాక, సంఖ్యాపరంగా కూడా ఒక అద్భుతమైన సంఘటనగా జరిగింది. అలాగే మహాజన పార్టీ రాజకీయ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకి కూడా తీసుకెళ్ళడంలో ఫుల్‌టైవ్‌ు కార్యకర్తగా ఉ.సాది ప్రధాన పాత్ర. ఆ తరువాత 2004లో జరిగిన ఎన్నికల్లో మహాజన పార్టీ బహుజనుల్లో రాజకీయ చైతన్య కృషిని కొనసాగించింది.

ఉ.సా గొప్ప చారిత్రక దృక్పథం గల మేథావి. చారిత్రక భౌతికవాద సిద్ధాంతాన్ని ఔపోసన పట్టిన తాత్త్వికుడు. కనుకనే వంద సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను కుల-వర్గ దృక్పథం కోణం నుంచి సమీక్షించాలనేది ఆయన దృఢ సంకల్పం. అందులో భాగంగానే కరోనా ప్రవేశానికి కొద్ది రోజుల ముందు హైదరాబాద్‌లో నిర్వహించిన రాజకీయ అధ్యయన తరగతుల్లో ఈ సమీక్షా అంశాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చారు. ఆ సబ్జెక్టు గురించి ఒక క్లాసు నిర్వహణ బాధ్యతని నాకు అప్పగించారు. నా క్లాసు ప్రసంగపాఠాన్ని ఉ.సా రికార్డు చేయించారు. ఆ తర్వాత కూడా మేము ఆ కర్తవ్యాన్ని దేశస్థాయిలో విస్తృతంగా, లోతుగా చేపట్టాలని అభిప్రాయపడ్డాం.

ఉ.సా జీవిత లక్ష్యం దేశంలో కులరహిత–వర్గరహిత సమ సమాజ స్థాపన. కులంలేని, మతం లేని, వర్గంలేని నూతన మానవ సమాజ స్థాపన ఉ.సా జీవిత ఆశయం. ఆ లక్ష్య సాధనలో తొలినాళ్ళలో మార్క్సిస్ట్‌ సిద్ధాంతాన్ని స్వీకరించి, అనుసరించాడు. కానీ, ఆ తర్వాత ఇండియాలోని నిర్దిష్ట పరిస్థితులలో ఫూలే, అంబేడ్కర్‌ల భావజాలాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసి, ఆ భావజాల ఆచరణాత్మకతని మనసారా స్వీకరించి, త్రికరణశుద్ధితో అమలు పరిచారు. తనకున్న మార్క్సిస్ట్‌ పరిజ్ఞానంతో ఫూలే, అంబేడ్కర్‌ భావజాలాన్ని ఆచరణలో మరింత పరిపుష్టం చేసే కృషి కూడా చేశారు. అదే సమయంలో, ఫూలే, అంబేడ్కర్‌ల భావజాలంతో మరింత పరిపుష్టమైన తన విజ్ఞానంతో, మార్క్సిస్ట్‌ సాధారణ సిద్ధాంతాన్ని ఇండియా నిర్దిష్ట పరిస్థితులకి అన్వయింప చేయడంలో అవిరళ కృషి చేశారు. ఆ విధంగా, మార్క్సిజాన్ని ఇండియనైజ్‌ చేయడంలో ఉ.సా పాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఈ క్రమంలో మారోజు వీరన్న ఉద్యమంతో గల ఉ.సా సాహచర్యాన్ని సదా జ్ఞప్తికి తెచ్చుకోవాలి.

ఉ.సా చిరకాల వాంఛ, మహాత్మ జోతీరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్‌.అంబేడ్కర్‌, కార్ల్‌మార్క్స్‌ సిద్ధాంతాల ప్రాతిపదికగా జనాభాలో 80 శాతంగా గల బహుజనులకు తమదైన, బలమైన రాజకీయపార్టీ నిర్మాణం. ఎందుకంటే, రాజకీయ పార్టీ లేకుండా రాజ్యాధికారం లభించదు. రాజ్యాధికారం లేకుండా సామాజిక పరివర్తన సాధ్యం కాదు. ఆ ఆకాంక్ష నెరవేరకుండానే ఉ.సా అసువులు బాశారు. అమరులయ్యారు. బృహత్తరమైన ఉ.సా లక్ష్యసాధనకై, ఆయన చూపిన మార్గంలో నడుస్తామని ఆ ఆదర్శమూర్తి ప్రథమ వర్థంతి సందర్భంలో పునరంకితమవుదాం.

(నేడు ఉ.సా ప్రథమ వర్ధంతి)

Leave a Reply