యూపీ: ‘ఉపాధి హామీ’కి పట్టభద్రులు!

0
212

లక్నో : కరోనా వైరస్‌ కల్లోలంతో కూలి కోసం పట్టణబాట పట్టిన కార్మికులు.. తిరిగి పల్లెలకు చేరుకున్నారు. ఇక గ్రామాల్లో పని కోసం ‘ఉపాధి హామీ’కి దరఖాస్తు చేసుకుంటున్నారు. కాగా, ఇందులో కేవలం చదువుకోనివారే కాదు.. పీజీలు చదువుకున్న వారూ ఉపాధి హామీకి దరఖాస్తు చేసుకుంటున్నారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దేశ రాజధానికి 150 కిలో మీటర్ల దూరంలోని ఉత్తరప్రదేశ్‌ జునైద్‌పుర్‌ గ్రామానికి చెందిన రోషన్‌ కుమార్‌ ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కింద పని కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతను ఎంఏ పట్టభద్రుడు. రోడ్డు పనులు, పూడిక తీయడం వంటి పనులు చేసేందుకు సిద్ధమయ్యాడు. ‘పీజీ పట్టా వున్నా సరైన ఉద్యోగం దొరకలేదు. చివరకు చిన్న ఉద్యోగం దొరికినా.. లాక్‌డౌన్‌తో అదీ పోయింది. చేసేదిలేక.. సొంతూరుకు తిరిగివచ్చాను.. ఇప్పుడు ఉపాధి హామీ పనికి దరఖాస్తు చేసుకున్నాను’ అని కుమార్‌ చెప్పారు.

ఇలా దరఖాస్తు చేసుకున్నవారిలో గ్రాడ్యుయేట్లు, పోస్టుగ్రాడ్యుయేట్లు అనేక మంది ఉన్నారు. ‘నాకు బీబీఏ డిగ్రీ పట్టా ఉంది. సరైన ఉద్యోగం దొరకలేదు. చివరకు నెలకు ఆరు వేల జీతంతో చిన్న ఉద్యోగం దొరికింది. లాక్‌డౌన్‌తో అది కూడా పోయింది. గ్రామం తిరిగివచ్చాను. గ్రామ పెద్ద సహాయంతో ఎంజిఎన్‌ఆర్‌ఈజీఏ పని దొరికింది’ అని సతేంద్ర కుమార్‌ చెప్పారు. ‘ఎం.ఏ బీఈడీ పూర్తిచేశాను. ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉండగానే.. లాక్‌డౌన్‌ విధించారు. ఇప్పుడు ఉపాధి హామీ పనికి దరఖాస్తు చేసుకొన్నాను’ అని మరో యువకుడు సూర్జిత్‌ కుమార్‌ చెప్పారు.

లాక్‌డౌన్‌కుముందు ఉపాధి పనికి రోజుకు సగటును 20 మంది వస్తే.. లాక్‌డౌన్‌ తర్వాత ఆ సంఖ్య 100కు పైకే పెరిగింది. ఇందులో డిగ్రీ మొదలు పీజీ చదివినవారూ ఉంటున్నారని గ్రామ పెద్ద వీరేంద్ర సింగ్‌ చెప్పారు.. లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు, జీవనోపాధిని కోల్పోయిన వారికి ఇప్పుడు ఇదే ఆసరాగా నిలుస్తున్నదన్నారు. ఈ దశాబ్ధంలోనే అత్యధికంగా.. రాష్ట్రంలో ఏప్రిల్‌ 1 నుంచి దాదాపు 35 లక్షల మంది పనులు లేక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏ)కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో వలస కార్మికులే కాకుండా నిరుద్యోగులు కూడా ఉపాధి హామీ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా 14 కోట్ల మందికి ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏ కార్డులుండగా.. వీరందరికీ 100 రోజుల పనిదినాలను కల్పించడానికి ఏడాదికి రూ.2.8 లక్షల కోట్ల రూపాయలు అవసరం. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో గ్రామీణులను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులను పెంచాలని హక్కుల కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

Courtesy NavaTelangana

Leave a Reply