హిందూముస్లిం ఐక్య విప్లవం… వందేమాతర గీతం

0
245

భారత స్వాతంత్య్రోద్యమంలో తొలి పోరాటం అనగానే… 1857 సిపాయి తిరుగుబాటు అనే చెబుతారంతా! కానీ… అంతకు దాదాపు వందేళ్ల ముందే తెల్లవారిపై తిరుగుబాటు జరిగింది. అదీ… హిందూ సన్యాసులు… ముస్లిం ఫకీర్లు కలసి చేసిన తిరుగుబాటు! దీన్ని సన్యాసి-ఫకీర్‌ తిరుగుబాటుగా పిలుస్తారు. ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌ జిల్లా, భారత్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లాల్లో జరిగిందిది. ఉత్తర భారతంలోని సూఫీ ఫకీర్లు బృందాలుగా బయలుదేరి వివిధప్రాంతాల్లోని దర్గాలను దర్శించేవారు. ప్రతి ఏటా బెంగాల్‌కూ వచ్చేవారు. అదే విధంగా నాగసన్యాసులు కూడా తీర్థయాత్రలకు వెళ్ళేవారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లోని జమీందార్లు వీరికి డబ్బులిచ్చేవారు. కానీ… బెంగాల్‌ను స్వాధీనం చేసుకున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ అదే సమయంలో భూమిశిస్తును విపరీతంగా పెంచేసింది. ఒకవంక కరవుతో ప్రజలు అల్లాడుతున్నా శిస్తులతో రైతులను పీల్చి పిప్పిచేసింది ఈస్ట్‌ ఇండియా కంపెనీ! ఇదే సమయంలో… ఫకీర్లు, సన్యాసులకు డబ్బులివ్వటాన్ని కూడా అడ్డుకుంది. చాలామంది ఫకీర్లను చంపేశారు కూడా! దీంతో… మంజూషా సారథ్యంలో ఫకీర్లు తిరుగుబాటు చేశారు. వీరికి… భవానీపాఠక్‌, గణేశ్‌ గిరి లాంటి వారి సారథ్యంలో హిందూ సన్యాసుల మద్దతు లభించింది. దాదాపు 30 సంవత్సరాల పాటు వీరి పోరాటం కొనసాగింది. తర్వాతికాలంలో మరిన్ని పోరాటాలకు దారి చూపింది. అన్నింటికీమించి హిందూ, ముస్లింలు ఐక్యంగా చేసిన తొలి పోరాటంగా దీన్ని అభివర్ణిస్తారు. ఈ పోరాటం స్ఫూర్తితోనే బంకించంద్ర ఛటర్జీ ఆనంద్‌మఠ్‌ నవల రాశారు. అందులోనిదే వందేమాతరం గీతం! చరిత్రపుటల్లో పెద్దగా ఎక్కకున్నా… వందేమాతరం రూపంలో పరోక్షంగా ఈ సన్యాసి-ఫకీర్ల తిరుగుబాటు చిరస్థాయిగా నిల్చిపోయింది.

Courtesy Eenadu

Leave a Reply