తహసీల్దార్ విజయారెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం. విశ్రాంత ఉపాధ్యాయుడు చామకూరి లింగారెడ్డి దంపతుల రెండో కుమార్తె అయిన విజయారెడ్డి 1నుంచి 7వ తరగతి వరకూ పెర్కకొండారంలో, 8 నుంచి ఇంటర్ వరకూ నకిరేకల్, డిగ్రీ నల్లగొండలో చదివారు. 13 ఏళ్ల క్రితం మునుగోడు మండలంలోని కాల్వలపల్లికి చెందిన సుభా్‌షరెడ్డితో వివాహంకాగా, వీరికి కుమార్తె చైత్ర(11), కుమారుడు అభినవ్(7) ఉన్నారు. భర్త సుభా్‌షరెడ్డి హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్. విజయారెడ్డి 2004లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికై 2007 వరకు యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలంలో పనిచేశారు. 2009లో గ్రూప్-2 పరీక్ష రాసి డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం సాధించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో కలెక్టరేట్‌లో సీ సెక్షన్‌లో నాలుగు నెలలు విధులు నిర్వహించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశారు. 2016 అక్టోబరు 11న(దసరా రోజు) కొత్తగా ఏర్పడిన అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి తహసీల్దార్‌గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. నాటి నుంచి అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో వనస్థలిపురంలోని సొంత ఇంటిని అద్దెకు ఇచ్చి, పాఠశాలకు సమీపంలో కొత్తపేట గ్రీన్‌హిల్స్‌కాలనీలో నివసిస్తున్నారు. విజయారెడ్డి తండ్రి లింగారెడ్డి రెండేళ్ల క్రితం పదవీ విరమణ పొంది, న కిరేకల్‌లో ఉంటున్నారు. లింగారెడ్డి కుమారుడు ధర్మారెడ్డి ఇంటర్ చదువుతున్న సమయంలోనే బలవన్మరణానికి పాల్పడగా, ప్రస్తుతం విజయారెడ్డి కూడా అకాల మరణం చెందడంతో ఆ కుటుంబాన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి. లింగారెడ్డి పెద్ద కుమార్తె సంధ్యారాణి నకిరేకల్ మండలంలోని కురిమేడ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
Courtesy Andhrajyothi..