ఇపుడు కాకుంటే మరెప్పటికీ కాదు

0
308

కె.ఎన్. మల్లీశ్వరి 

ఎనిమిది వేల కుటుంబాలు, కుటుంబానికి ఒక ఉద్యోగం కోసం మూడు తరాలుగా, దాదాపు నలభై ఏళ్లపాటు ఆశతో నిలబడటానికి ఏం పేరు పెట్టాలి? కాసేపు మనభాషలో పోరాటం అనుకుందాం. పరిహారం పొందడానికి పెద్ద రాజకీయ ఉద్యమాల మాదిరి, సుదీర్ఘ పోరాటం చేయాల్సిన దుస్థితి నిర్వాసితులకి ఎందుకు కలిగింది! విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్చీకి కుడివైపు శిబిరంలో కూచున్న ఉక్కు నిర్వాసితులని కదిలిస్తే కల్పనలకి మించిన జీవనగాథలు వినబడతాయి. కార్మిక సంఘాలు, రాజకీయపార్టీలు, మెజారిటీ పౌరసమాజం దృష్టంతా ఇపుడు విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిలుపుదల మీదే ఉంది. అది ప్రధానమైన సమస్యే కానీ వేలాది నిర్వాసితుల పునాదుల మీద నిర్మించినవి కదా తమ భద్రజీవితాలు, వాటికోసం ఈ పోరాటాలు! ‘కూలాడితే గానీ కుండాడని బతుకుల’వారు రోజుకి కొంతమంది చొప్పున వంతులు వేసుకుని, న్యాయం చేయమని పోరాడుతుంటే వారిని కలుపుకోవడానికి ఎడమవైపు శిబిరంవారికి సంకోచం ఏమిటి, కార్మిక సంఘాల డిమాండ్లలో నిర్వాసితుల నష్టపరిహారం సంగతి ఎందుకు ప్రాధాన్యతలోకి రాలేదు?

1970లో ఉక్కు కర్మాగార ప్రకటన వస్తే, 1971లో శంకుస్థాపన జరిగింది. దాదాపు 32 వేల ఎకరాలు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం దశలవారీగా సేకరించారు. కురుపాం జమిందార్ 6వేల ఎకరాలు దానంగా ఇచ్చారు. ఎనిమిది పంచాయతీల పరిధిలోని అరవై నాలుగుగ్రామాల్లో సుమారు 26వేల ఎకరాలు ప్రజలనుంచి సేకరించారు. అప్పట్లో 16,500 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించారు. భూములు కోల్పోయినవారికి ధనరూపేణా నష్టపరిహారం, ఇళ్లు కోల్పోయినవారికి 107 గజాల స్థలం, కుటుంబానికి ఒక ఉద్యోగం చొప్పున హామీ ఇచ్చే రీ హాబిలిటేషన్ నంబర్ (ఆర్‌-కార్డు) ఇచ్చారు.

విశాఖఉక్కు ప్రయివేటీకరణకి వ్యతిరేకంగా సాగుతున్ననిరసన శిబిరాలు, స్టీల్ ప్లాంట్ సెక్టార్లు తిరిగి అక్కడి ప్రజలతో మాట్లాడాను. ఉక్కు నిర్వాసితుల పరిహారం ఇప్పటికీ అందలేదని తెలీడం విషాదంగా అనిపించింది. ‘మా తాతతండ్రులు –ఇరవై ఆరువేల ఎకరాల పంటభూములను, మా ఇళ్ళను జాతికి అంకితం చేస్తే మేము పొట్ట గడవడం కోసం స్టీల్ ఉద్యోగుల ఇళ్ళలో చిప్పలు తోముతున్నాం, కార్లు కడుగుతున్నాం. ఆఫీసుల్లో చీపుర్లు పట్టుకుని తుడుస్తున్నాం. వాళ్ళు చేసిన పుణ్యం ఏంటి? మేము చేసిన పాపం ఏంటి? ఇంత చేసినా మా కాలనీలకి ఒక్క వాటర్ టాంక్ కూడా పంపరు’ అని ఒకామె ఆగ్రహంతో అంది. స్టీల్ ప్లాంట్లో వాడకం లేని భూములు దాదాపు ఏడువేల ఎకరాలు ఉన్నాయి. నష్టపరిహార ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు కనుక, కాకినాడ సెజ్ భూములు తిరిగి ఇచ్చేయడానికి ప్రత్యేకమైన జీవో తెచ్చినట్లుగా ఇక్కడా మిగులు భూములు నిర్వాసితులకి పంపకం చేయాలని, ‘చట్టం ఎక్కడైనా ఒకటే, కాకినాడలో ఒకలాగా వైజాగ్ లో ఒకలాగా ఉండదు కదా’ అన్నది వారి ప్రశ్న. స్టీల్ ప్లాంట్ తో ఏ విధమైన సంబంధం లేని గంగవరం పోర్టు ప్రయివేట్ యాజమాన్యానికి పధ్నాలుగు వందల ఎకరాలు ఇచ్చిన స్టీల్ యాజమాన్యం భూములిచ్చిన నిర్వాసితుల విషయంలో ఎటువంటి నైతికమైన బాధ్యత వహించడం లేదన్నది వారి ఆరోపణ.

ఉక్కు నిర్వాసితుల నష్టపరిహారంలో వివాదాస్పదమైనదీ ఇప్పటికీ పరిష్కారం కానిదీ ఆర్–కార్డ్. ఇళ్ళస్థలాలు, పొలాలు, జీవిక పోయిన నిర్వాసితులకి నష్టపరిహారంలో భాగంగా కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అట్లా మొత్తం 16,500 కుటుంబాలకి ఆర్–కార్డ్ కేటాయించింది ప్రభుత్వం. అర్హత, నైపుణ్యం ఆధారంగా ఈ నలభై ఏళ్లలో 8,500 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చింది స్టీల్ ప్లాంట్. 8,000 మందికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వవలసి ఉంది. తరాలు గడుస్తూ, ఆర్–కార్డ్ తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి మనవడికి బదిలీ అవుతోంది తప్ప ఉద్యోగాలు ఇవ్వలేదు. వీరిలో కొంతమందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. అవి కూడా కళాసీలుగా, స్వీపర్లుగా. మంచి చదువులు చదివితే మంచి ఉద్యోగం వస్తుందన్న వాదనతో వారు ఏకీభవించడం లేదు, ‘మా మొత్తం లాక్కున్నారు. బతకడానికే తిప్పలు పడే కుటుంబాల్లో మంచి చదువులు ఎక్కడ! మా తాతతండ్రులకి మంచి ఉద్యోగాలుంటే కదా మేము కూడా అందరిలాగా బాగా చదువుకునేవాళ్ళం. పెద్దఉద్యోగులకి ఏ ధరలో మాకుకూడా అవేకదా పెద్దోళ్ళం ఎపుడవుతాం?’ అంటున్నారు.

ఆర్.కార్డుదారులని స్కిల్డ్ వర్కర్లుగా తయారుచేయడానికి స్టీల్ ప్లాంట్ ఐటిఐ కాలేజి పెట్టింది. ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ విభాగాలలో ప్రావీణ్యం పొందితే ఉద్యోగాలు వస్తాయని కూలిపనులు మానుకుని మరీ చాలామంది ఐటిఐ చదివారు. అయినా స్కిల్డ్ వర్కర్లుగా కాదు కదా సెమిస్కిల్డ్ గా కూడా వారిని గుర్తించడం లేదు. కాంట్రాక్ట్ లేబర్ గా మాత్రమే తీసుకుంటున్నారు. నిజానికి హామీఇచ్చిన ఉద్యోగాల పరికల్పన పూర్తయ్యేవరకూ అర్హులయిన వారికి జీవన భృతి కల్పించాలి యాజమాన్యం. 2005లో వైఎస్సార్ ప్రభుత్వం 68జీవో ద్వారా ఆర్-కార్డుదారులకి జీవనభృతి ఇవ్వాలని చెప్పింది. కానీ స్టీల్ యాజమాన్యం అమలు చేయలేదు.

నిర్వాసిత స్త్రీల అనుభవాలు, అందునా ఆర్.కార్డుదారుల్లో స్త్రీలుంటే వారి కష్టాలు చెప్పనలవి కాదు. శిబిరంలో ఒకామె చెప్పిన మాటలు ఆర్.కార్డ్ గుట్టు విప్పింది. ఆ కుటుంబంలో ఆమె మొదటి సంతానం. సోదరులు లేరు, ఇద్దరు చెల్లెళ్ళు. ఆమె తాతకి ఉద్యోగం రాకపోవడంతో తండ్రికి ఆర్.కార్డు బదిలీ అయింది. తండ్రికి ఉద్యోగం రాకపోవడంతో ఈమెకి బదిలీ అయింది. రెండుతరాలు రాలేదు కాబట్టి మూడోతరంలో తప్పకుండా ఉద్యోగం ఖాయనుకున్నారు. ఆ నమ్మకంతో కట్నం తీసుకోకుండా ఒకతను పెళ్లి చేసుకున్నాడు. రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాలేదు. మెల్లిగా అత్తింటినుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. తమకి ఉన్న ఏకైక ఆస్తి ఆర్.కార్డే, అది కూతురుకి ఇచ్చేసారు కనుక తమ తిండితిప్పలు ఆమే చూడాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తుంటారు. ఇక తమకి అన్యాయం చేసి అక్కకి మాత్రమే ఆర్.కార్డ్ ఇచ్చారు కనుక ఆ అక్క తమ బాగోగులు చూడాలని ఇద్దరు చెల్లెళ్ళు కోరుకుంటారు. ఇంతా చేసి ఆర్.కార్డ్ వల్ల పొందింది ఏమీ లేకపోగా ఎంతో శ్రమ, సమయం, డబ్బు వృధా అయ్యాయి, మానసిక ప్రశాంతతని కోల్పోవడం అదనం. ‘ఇన్ని కష్టాలమధ్య నేను బతికి ఉన్నానంటే పిల్లల మొహాలు చూసే’ అందామె కన్నీళ్లు బిగబట్టుకుని. ఇటువంటి స్త్రీల సంఖ్య నిర్వాసితుల్లో ఎక్కువే.

ప్లాంట్ ప్రయివేట్ పరం కాగానే ఆర్.కార్డు రద్దవుతుంది. కనుక ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాదు. ఆర్.కార్డ్ కి శాశ్వత పరిష్కారం దొరికేవరకూ శిబిరం నడుపుతూనే ఉంటామని చెప్పారు నిర్వాసితులు. ఆర్.కార్డ్ ద్వారా రెండవతరంలో ఉద్యోగం పొందిన ఒక వ్యక్తికి ఇంజనీరింగ్ చదివిన కొడుకు ఉన్నాడు. రేపోమాపో మంచి ఉద్యోగంలో చేరతాడు. అతను రోజూ వచ్చి నిర్వాసితుల శిబిరంలో కూచుంటున్నాడు. ‘ఒక తరానికి మంచి ఉద్యోగం వస్తే వారి పిల్లల్లో ఎంత చైతన్యం వస్తుందో నిరూపించడానికే ఇక్కడికి వస్తున్నాను. మిగిలిన ఎనిమిదివేల ఆర్.కార్డుదారులకి న్యాయం జరిగేవరకూ నా వంతు కృషి సామాజిక మాధ్యమాల ద్వారా, బైటా చేస్తాను’ అన్నాడతను.

బాధ్యత సరే, నిర్వాసితుల పట్ల ఇటువంటి కృతజ్ఞత కూడా లేదా విశాఖ ఉక్కుకి?

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక

Courtesy Andhrajyothi

Leave a Reply