- 15 మీటర్ల దూరం లాక్కెళ్లిన వైనం
- ఢిల్లీలో అంజలి తరహా మరో ఘటన
- భద్రతపై తనిఖీలు చేస్తుండగా దారుణం
న్యూఢిల్లీ : అంజలి సింగ్ విషాదం మరువకముందే అలాంటి ఘటనే దేశ రాజధానిలో మళ్లీ వెలుగుచూసింది. ఈసారి సాక్షాత్తు ఢిల్లీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతీ మాలీవాల్‌కే ఆ అనుభవం ఎదురైంది. కారుతో పాటు 10-15 మీటర్ల దూరం వరకు ఆమెను ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. మహిళలకు ఎలాంటి భద్రత ఉందో తెలుసుకోవాలని స్వాతి తన బృందంతో తనిఖీలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. తాగి ఉన్న ఓ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి కారు ఎక్కాల్సిందిగా బలవంతపెట్టాడు. పైగా అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో స్వాతి అతన్ని కారులోంచి లాగే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ వ్యక్తి కారు అద్దాన్ని పైకి లాగి ముందుకు సాగాడు. ఆమె చేయి అందులో ఇరుక్కుపోయి 15 మీటర్ల దూరం వరకు అలాగే వెళ్లిపోయారు. తెల్లవారుజామున 3.15 గంటలకు ఎయిమ్స్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్వాతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు హరీశ్ చంద్రను అరెస్ట్ చేశారు.
కాగా ఢిల్లీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. శాంతిభద్రతలు మాత్రం కేంద్రం పరిధిలో ఉంటాయి. దీంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. ‘అర్థరాత్రి మహిళల భద్రతపై తనిఖీలు చేస్తున్నా. ఆ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించడంతో నాకు చాలా భయమేసింది. అక్కడ పోలీస్ పెట్రోలింగ్ కూడా లేదు. ‘దేవుడే నన్ను కాపాడాడు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కే ఇలా జరిగిందంటే పరిస్థితి అర్థంచేసుకోండి‘ అని స్వాతి ట్వీట్ చేశారు. కాగా, ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మ స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శాంతిభద్రతలు పట్టించుకోండి: కేజ్రీవాల్
ఢిల్లీ ఘటనపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాజకీయాలు పక్కనపెట్టి రాష్ట్రంలోని శాంతిభద్రతలపై దృష్టిసారించాలని హితవు పలికారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కే రక్షణ లేకుండాపోయిందని, దీనికి బాధ్యత లెఫ్‌నెంట్ గవర్నర్‌దేనన్నారు. ‘ఎల్‌జీ సాబ్ మీరు కొంతకాలం రాజకీయాలు పక్కనపెట్టి శాంతిభద్రతలు పట్టించుకోండి’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.