నీరుగల్లు

0
231
  • ఓరుగల్లుపై వరుణుడి ప్రతాపం.. కాలనీలు జలమయం
  • 3000 మందికిపైగా తరలింపు.. రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌
  • కాలనీల్లో 2-3 మీటర్ల ఎత్తున నీళ్లు
  • ముమ్మరంగా సహాయక చర్యలు
  • 13 పునరావాస కేంద్రాల ఏర్పాటు

చారిత్రక నగరంగా ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లు.. వాన బీభత్సానికి నీరుగల్లుగా మారింది! కాలనీల్లో 2-3 మీటర్ల ఎత్తున నీళ్లు.. ఇళ్లల్లోకి నీళ్లు.. రోడ్ల మీద వరద నీటిలో చిక్కుకుని సగం దాకా మునిగిన లారీలు.. నిండా మునిగిన కార్లు.. ఎటు చూసినా ఇవే దృశ్యాలు! లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం ఎప్పుడూ జరిగేదే.. కానీ, నగరం నడిబొడ్డున పక్కా ఇళ్లల్లోని ప్రజలు సైతం నీటి ముంపు భయంతో పై అంతస్తుల్లోకి వెళ్లి తలదాచుకున్నారు. ఎన్నడూ లేనిది.. వరంగల్‌ నగర చరిత్రలో మొదటిసారి.. వరద సహాయక చర్యల్లో భాగంగా పడవలను ఉపయోగించారు!!

హన్మకొండ : భారీ వర్షానికి తీవ్రంగా ప్రభావితమైన వరంగల్‌ నగరంలో వరద భీభత్సం ఆదివారం కూడా కొనసాగింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు ఇప్పటికీ నిలిచే ఉంది. ముంపునకు గురైన కాలనీల్లో పరిస్థితి ఇంకా మెరుగు పడలేదు. నగరంలో గడచిన 24 గంటల్లో 13.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరద ఉధృతి వల్ల 70కిపైగా ప్రాంతాలు నీట  మునిగాయి. వీటిలో సుమారు 40కి పైగా కాలనీల్లో రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తు వరకు వరద నీరు ప్రవహిస్తుండడంతో  రెండు రోజులుగా ప్రజలు ఇళ్లలోనే చిక్కుకుపోయారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే 3 వేల మందిని తరలించాయి. వరద సహాయక చర్యలకు పడవలను ఉపయోగించడం నగర చరిత్రలో ఇదే మొదటిసారి.

నగరంలోని హంటర్‌ రోడ్డు, సాయినగర్‌ కాలనీ, సంతోషిమాత కాలనీ, సరస్వతీ నగర్‌, ములుగు రోడ్డు, అండర్‌ రైల్వే గేటు, దేశాయిపేట, నజరత్‌పురం, వడ్డెపల్లి, కేయూ 100 ఫీట్ల రోడ్డు ప్రాంతాలు తీవ్రంగా వరద తాకిడికి గురయ్యాయి. ఈ ప్రాంతాల్లోని కాలనీలే ఎక్కువగా నీట మునిగాయి. ఇక్కడి ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరింది. హంటర్‌ రోడ్డులోని నాలాను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులు ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉన్నాయి. డాక్టర్స్‌ కాలనీ, కాకతీయ కాలనీ, ప్రశాంత్‌ నగర్‌, రాజాజీ నగర్‌, లష్కర్‌ సింగారం, గోపాల్‌పూర్‌, విద్యానగర్‌, సమ్మయ్య నగర్‌ వాజ్‌పాయినగర్‌ 1,2, ఫారెస్టు కాలనీ, పోచమ్మకుంట, ప్రేమ్‌నగర్‌ కాలనీలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. డాబా ఇళ్లు, రెండు, మూడు అంతస్తుల భవనాల్లో నివసిస్తున్నవారు పై అంతస్తుల్లోకి వెళ్లి తల దాచుకున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరుకున్న వారిని పడవల సహాయంతో తరలిస్తున్నారు.

రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు..
వరంగల్‌ నగరంలో ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు జీహెచ్‌ఎంసీకి చెందిన మూడు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు రంగంలోకి దిగాయి. శనివారం రాత్రే నగరానికి చేరుకున్న ఈ బృందాల్లోని సుమారు 40 మంది సభ్యులు తెల్లవారుజాము నుంచే తీవ్ర స్థాయిలో వరదతాకిడికి గురైన ప్రాంతాల్లో పడవల సహాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించారు. వరద బాధితుల కోసం నగరంలో 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 3 వేల మందికి వీటిలో ఆశ్రయం కల్పించారు.

అవసరమైతే మరికొన్ని పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఫంక్షన్‌ హాళ్లను గుర్తించి పెట్టారు. వరంగల్‌ నగరంలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. ముంపు ప్రాంతాల సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, మేయర్‌ పమేలా సత్పతి, స్థానిక కార్పొరేటర్లు ఉన్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply