- మాదాపూర్‌లోని గుట్టలబేగంపేటలో వ్యక్తి మృతి..
- చిన్నా, పెద్దా.. అందరికీ వాంతులు, విరేచనాలు
- లంగర్‌హౌజ్‌లోని మూడు కాలనీల్లో ఇంటికొకరికి అస్వస్థత
హైదరాబాద్ సిటీ/మాదాపూర్/లంగర్‌హౌజ్ : గ్రేటర్ హైదరాబాద్‌లో కలుషిత నీరు కలకలం సృష్టిస్తోంది. జలమండలి సరఫరా చేసే తాగునీరు కలుషితమై ఓ వ్యక్తి మృతి చెందగా.. 200 మందికి పైగా అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజులుగా తాగునీరు దుర్వాసన వస్తోందని వాటర్ వర్క్స్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మాదాపూర్ గుట్టలబేగంపేటలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి భీమయ్య (27) మృతిచెందగా.. రెండేళ్ల అతని కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికంగా మరో 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే తమ వాళ్లు మంచాన పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. లంగర్‌హౌజ్, మాదాపూర్ ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా కావడంతో 200 మందికి పైగా అస్వస్థతకు గురవయ్యారు. లంగర్‌హౌజ్ పరిధిలోని మూడు కాలనీల్లో ఇంటికొకరు చొప్పున బాధితులున్నారు. బాధితులందరికీ వాంతులు, విరేచనాలు అవుతుండడంతో స్థానిక మెడికల్ షాపులు, ఆస్పత్రుల వద్ద బారులు తీరుతున్నారు. అప్రమత్తమైన వాటర్‌బోర్డు అధికారులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఒక వ్యక్తి మరణించడం, వందలాది మంది అస్వస్థతకు గురవడంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆయా కాలనీలకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. వాటర్‌వర్క్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, మృతుని కుటుంబానికి నష్టపరిహారంతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే..
కొద్దిరోజులుగా తాగునీరు మురుగు వాసన వస్తోందని పలుమార్లు వాటర్ వర్క్స్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. వారి నిర్లక్ష్యం వల్లే గుట్టలబేగంపేటలో ఓ వ్యక్తి ప్రాణం పోవడంతో పాటు 20 మంది ఆస్పత్రి పాలయ్యారన్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి తాగునీరు కలుషితం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. భీమయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.15 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
లంగర్‌హౌజ్‌లో ఇంటికొకరు..
లంగర్‌హౌజ్‌లోని అంబేడ్కర్‌నగర్, గాంధీనగర్‌లో తరచూ కలుషిత నీరు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వినాయకనగర్‌లో అప్పుడప్పుడూ వచ్చేవని చెప్పారు. సోమవారం వచ్చిన నీటిని తాగిన ఒక్కో కుటుంబంలో ఒకరిద్దరికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వినాయకనగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఆరు కుటుంబాలు ఉండగా, ఒక్కో కుటుంబంలో ఒకరిద్దరు బాధితులు ఉన్నారు. ఇక అంబేడ్కర్‌నగర్, గాంధీనగర్‌లో కలుషిత నీరు తాగడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ అస్వస్థతకు గురయ్యారు. గాంధీనగర్‌లో 250 వరకు ఇళ్లు ఉండగా, సుమారు వెయ్యి మంది నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో నాలుగు నెలలుగా కలుషిత నీరు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. బుధ, గురువారాల్లో కలుషిత నీరు తాగి 80 మందికి పైగా అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. అంబ్కేడర్ నగర్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు 100 మంది వరకూ వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. లంగర్‌హౌజ్‌లోని పలు ప్రాంతాల్లో కలుషిత నీరు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలియడంతో వాటర్‌బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు. వాటర్‌బోర్డు డైరెక్టర్ అజ్మీర కృష్ణ, సీజీఎం, జీఎంలు లంగర్‌హౌజ్‌లోని కాలనీల్లో తిరిగి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. వాటర్‌బోర్డు సరఫరా చేసే నీరు అంబేడ్కర్‌నగర్ మెయిన్ రోడ్డు వద్ద పాతలైన్ వల్ల కలుషితమవుతున్నట్లు ఇటీవల గుర్తించామని క్షేత్రస్థాయి అధికారులు వివరించారు.
దీంతో సత్వరమే కలుషిత నీళ్లు సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. ఆయా కాలనీవాసులకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించేందుకు వాటర్‌బోర్డు చర్యలు చేపట్టింది. మాదాపూర్ గుట్టల బేగంపేటలో కలుషితనీరు తాగి అస్వస్థతకు గురైన కుటుంబాలను వాటర్‌వర్క్స్ అధికారులు పరామర్శించారు. ఎక్కడ సమస్య ఉందో పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించామన్నారు. నీటి సరఫరా పూర్తిగా నిలిపివేశామని, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని వాటర్‌వర్క్స్ డీజీఎం శ్రీమన్నారాయణ తెలిపారు.
తాగునీరు కలుషితం కాకుండా చూడాలి..
కలుషిత నీరు తాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. తీవ్రమైన ఎండలకు తోడు చాలీచాలని నీరు రావడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇకనైనా సక్రమంగా తాగునీరు అందించాలి. – జయమ్మ, గుట్టల బేగంపేట
Courtesy Andhrajyothi