ముంబయి: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ సంక్షోభపు సెగలు గురువారం కేంద్రంలోని మోడీ సర్కారు తగిలాయి. ఇటీవల బ్యాంకులో ఆర్థిక అవకతవకలను సాకుగా చూపుతూ ఆర్బీఐ పీఎంసీ బ్యాంక్ ఖాతాదారుల లావాదేవీలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ చర్య బ్యాంక్ డిపాజిటర్లను తీవ్ర కష్టాల్లోకి నెట్టివేసింది. ఆర్‌బీఐ ఆంక్షల మేరకు పీఎంసీ ఖాతాల నుంచి రోజుకు కేవలం రూ.1000 మాత్రమే విత్‌డ్రా చేసుకొనే అవకాశం ఖాతాదారులకు కలిగింది. దీనిని నిరసిస్తూ ఖాతాదారులు గగ్గోలుపెట్టడంతో.. ఇటీవలే నగదు ఉపసంహరణ మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ.25 వేలకు పెంచారు. అయినా డిపాజిటర్ల ఆగ్రహం చల్లారలేదు. దీంతో వారు తాజాగా మరోసారి ఆందోళనకు దిగారు. గురువారం ముంబయిలోని నారిమన్ పాయింట్‌లోని బీజేపీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఇక్కడకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ రానున్నారన్న విషయం తెలుసుకున్న ఆందోళనకారులు వందలాదిగా వచ్చి బీజేపీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. కేవలం 25 వేలతో తమ అవసరాలను ఎలా తీర్చుకోవాలంటూ బాధిత ఖాతాదారులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఖాతాదారులు కొందరు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కారు పాలనలో బ్యాంకులో డబ్బులు దాచుకున్న పాపానికి.. ఆదే బ్యాంకుల ముందు బిచ్చగాళ్లలా మారాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పీఎంసీ బ్యాంకులో ఏం జరుగుతోందో..? అధికారులు ఏం చేస్తున్నారో? తమకు అర్థం కావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము దాచుకున్న డబ్బును తమకు తిరిగి ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రలోని మోడీ సర్కారు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని.. ఇకనైనా స్పందించి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. తప్పుచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, వారికి బెయిల్ మంజూరు చేయకుండా జైలుకు పంపించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఖాతాదారుల నిరసనలు జరుగుతున్న నేపథ్యలోనే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రాత్రికి రాత్రే తమ ఖాతాలను స్తంభింప చేస్తు పరిస్థితి ఏంటని వారు ఆర్థిక మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ నేరం చేయకపోయినా తమ కష్టార్జితం కోసం బిచ్చగాళ్లలా ప్రభుత్వాన్ని అర్థించాల్సి వస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని గట్టిగా విజ్ఞప్తి చేశారు.
పీఎంసీ ఖాతాదారులకు నిర్మలమ్మ భరోసా
పీఎంసీ బ్యాంక్ సంక్షోభంపై ఆందోళన చేస్తున్న ఆ బ్యాంక్ ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. ఖాతాదారుల ఆందోళనపై ఆర్‌బీఐ గవర్నర్‌తో మాట్లాడతానని తెలిపారు. ఈ మేరకు తనను కలిసిన ఖాతాదారుల ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. అంతకుముందు ఆమె భాజపా కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడాల్సి ఉండగా.. అక్కడ ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఖాతాదారులను శాంతింపజేసేందుకు సీతారామన్ ఖాతాదారుల ప్రతినిధులతో కాసేపు మాట్లాడారు. తాను మరోసారి ఆర్‌బీఐ గవర్నర్‌తో మాట్లాడతాను. పీఎంసీ ఖతాదారుల ఆందోళనను ఆయన దృష్టికి తీసుకెళతానన్నారు. అలాగే ఆర్థిక శాఖ కార్యదర్శులను కూడా అసలు ఏం జరిగిందనే అంశంపై పరిశీలించాలని ఆదేశించానని తెలిపారు. అయితే అంతటితే శాంతించని ఖాతాదారులు రానున్న రోజుల్లో తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించారు.
courtesy Navatelangana..