మరో లోక్‌నాయక్‌ మనకు కావాలి !

0
197
యోగేంద్ర యాదవ్
(స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు)

ఇదిజనసమ్మోహన ప్రధానమంత్రి ఎనిమిదో సంవత్సరం. అల్ప అభివృద్ధి, అధిక నిరుద్యోగం, అదుపు తప్పుతున్న ద్రవ్యోల్బణంతో ఆర్థికవ్యవస్థ చిక్కుల్లో పడింది. సందేహాలు భ్రమలను పోగొడుతున్నాయి; అసంతృప్తి ఆగ్రహానికి దారితీస్తోంది. రాజకీయ గర్వాతిశయం ప్రజల నిరసనలను ఏవగించుకొంటోంది…

లేదు, నరేంద్ర మోదీ ఏలుబడిలోని భారతదేశ స్థితిగతుల గురించి నేను వర్ణించడం లేదు. ఆ వ్యాఖ్యానం ఇంచుమించు అర్ధశతాబ్దం నాటిది. ఇందిరాగాంధీ పాలనలోని భారతదేశం గురించిన ఒక వాస్తవ చిత్రమది.

1974 జూన్ 5 : బిహార్ ఉద్యమ చరిత్ర ఒక మేలు మలుపు తిరిగిన రోజు అది. ఆ రోజున, పాట్నాలో జరిగిన ఒక బ్రహ్మాండమైన ర్యాలీలో లోక్‌నాయక్‌గా ప్రజలు ఆత్మీయంగా పిలుచుకునే జయప్రకాశ్ నారాయణ్ ‘సంపూర్ణ విప్లవం’కు పిలుపు నిచ్చారు. సంపూర్ణ విప్లవం తదాది బిహార్ ఉద్యమ నినాదమయింది. ఇందిరాగాంధీ పాలనకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలో ‘సంపూర్ణ క్రాంతి అబ్ నారా హై, భావి ఇతిహాస్ హమారా హై’ నినాదం నిండుగా ప్రతిధ్వనించింది. ఆ ఉద్యమం అత్యవసర పరిస్థితికి, అంతిమంగా 1977 బ్యాలెట్ విప్లవానికి దారితీసింది. వర్తమాన భారతదేశానికి ఆ సంపూర్ణ విప్లవ భావజాలం ఏమైనా ఉపయుక్తత కలిగి ఉందా? ఉందనే నేను భావిస్తున్నాను. కనుకనే ఈ జూన్ 5న ‘సంపూర్ణ క్రాంతి దివస్’ ఘనంగా జరుపుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది. ఈ నిర్ణయానికి చారిత్రక ప్రాధాన్యమున్నది.

క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించక ముందు ప్రజల అభిప్రాయాల, వైఖరుల, ప్రవర్తనల పరిశోధకుడుగా ఉండేవాణ్ణి. ఆ పరిశోధనా కార్యకలాపాలలో ఒక విషయం నన్ను నిరంతరం విస్మయపరుస్తుండేది. జీవన స్థితిగతులు భరింపరానివిగా ఉన్నప్పటికీ భవిష్యత్తు ఎలా ఉండవచ్చన్న ప్రశ్నకు దాదాపు ప్రతి ఒక్కరూ గొప్ప ఆశాభావాన్ని వ్యక్తం చేసేవారు. తమ ప్రస్తుత జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు భావి జీవితంలో ఉండబోవని అందరూ దృఢస్వరంతో చెబుతుండేవారు. వారి పరిపూర్ణ ఆశాభావం నాలోని విశ్లేషకుడిని అబ్బురపరుస్తుండేది. నాలోని రాజకీయ జంతువుకు ఆశాభంగం కలిగిస్తుండేది. ఇప్పుడు ఒక సారి ఆ గతించిన రోజులను సింహావలోకనం చేసుకుంటే అసంఖ్యాక భారతీయులలోని ఆ సహజ ఆశాభావమే మన ప్రజాస్వామ్యం సజీవ చైతన్యంతో వర్థిల్లుతుండడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది.

నేడు ఆ ఆశాభావం ప్రమాదంలో పడింది. భవిష్యత్తు మీద నమ్మకం చాలా మందిలో సడలిపోయింది. ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది తమ ఆదాయం పెరగగలదని విశ్వసిస్తున్న వారి సంఖ్య 2019 ఏప్రిల్ (అప్పటికే మన ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడిపోయింది)లో 30 శాతం నుంచి 2021 ఏప్రిల్‌లో 5 శాతానికి తగ్గిపోయినట్టు సిఎమ్‌ఐఇ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే వర్తమాన భారతదేశంలో ఆశ అనేది చాలా చాలా అరుదైన సరుకుగా ఉంది. ప్రజల్లో నెలకొన్న నైరాశ్యం మోదీ ప్రభుత్వంలో వారు విశ్వాసాన్ని కోల్పోయారన్న వాస్తవాన్ని చెప్పకనే చెప్పుతోంది. అయితే ఇది ప్రతిపక్షాలకు, ప్రజాస్వామిక వ్యవస్థకు కూడా ఒక సవాల్. భవిష్యత్తు పట్ల ఆశాభావం కలిగిఉండడం భారత్‌కు ఎంతైనా అవసరం.

భారత్‌కు ఆశ అవసరమని అన్నాను కదూ. అవును, అసంఖ్యాక భారతీయులు మోదీ పాలనలో తమకు ‘అచ్ఛే దిన్’ (మంచిరోజులు) రానున్నాయని విశ్వసించారు. వాస్తవమేమిటో ఇప్పుడు వారికి తెలిసివచ్చింది. అయినప్పటికీ తమను భద్రమైన భవిష్యత్తులోకి నడిపించే శక్తికోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రజలు ఇలా ఆశావహ దృక్పథంతో ఉండేలా చేసేవి భావజాలాలు. 21వ శతాబ్దంలో కూడా భావజాలానికి ప్రాధాన్యమివ్వడం విచిత్రంగా కన్పించవచ్చు. ఎందుకంటే శక్తిమంతమైన భావజాలాల ప్రాతిపదికన విలసిల్లిన వివిధ రాజకీయ వ్యవస్థలు కుప్పకూలిపోవడమే కదా ఇటీవలి ప్రపంచ చరిత్ర. సరే, తాము ఏ భావజాలాన్ని విశ్వసించమని, అనుసరించమని చెప్పుకునే వారు కూడా నిజానికి ఒక భావజాలాన్ని అనుసరించేవారే. ఆ భావజాలం యథాపూర్వస్థితిని విశ్వసించే, కాపాడేది కావడం కద్దు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు మనకు ఇటువంటి భావజాలం అవసరం లేదు. ప్రజల్లో పరిపూర్ణ ఆశాభావాన్ని నెలకొల్పే ప్రగతిశీల భావజాలం వర్తమాన భారతదేశానికి అవసరం.

ఇటువంటి ఆశాభావాన్ని ఏ భావజాలం సమకూర్చగలుగుతుంది? ప్రస్తుతమున్న ఏ భావజాలం కూడా సమకూర్చలేదు. 19వ శతాబ్ది భావజాలాల కళేబరాలతో మనం సుదీర్ఘకాలం ప్రయాణం చేశాం. వాటితోనే 21వ శతాబ్దిలోకి ప్రవేశించాం. నిజానికి 20వ శతాబ్ది ద్వితీయార్ధంలోనే వాటికి కాలం తీరిపోయింది. 21వ శతాబ్దిలో వాటిని ఇంకా అనుసరించడం అర్థరహితం. ఈ సత్యం అటు మితవాద భావజాలాలకు, ఇటు వామపక్ష భావజాలాలకూ వర్తిస్తుంది. కొత్త భావాలను, నూతన అంశాలను, నవ శక్తులను సమ్మిళితం చేసుకోవడంలో విఫలమయ్యాయి. ఇక్కడే లోక్‌నాయక్ జయప్రకాశ్ ఇచ్చిన ‘సంపూర్ణ విప్లవం’ పిలుపునకు విశేష ప్రాసంగికత ఉంది. 1974లో జేపీ ఆ పిలుపు ఇచ్చేనాటికి ఆయన తన కాలంలోని వివిధ భావజాలాలను అనుసరించారు, ఆచరించారు. ఆ అనుభవాల పరిణతితో సంపూర్ణ విప్లవ లక్ష్య తీరానికి చేరారు. 1940వ దశకంలో కమ్యూనిజంపై జేపీకి భ్రమలు తొలగిపోయాయి. తొలుత ప్రజాస్వామిక సామ్యవాదం, ఆ తరువాత గాంధేయవాదం, వినోబా భావే సర్వోదయ సిద్ధాంతం వైపు మొగ్గారు. సంపూర్ణ విప్లవానికి పిలుపు ఇవ్వడమనేది భారతదేశ సమస్యల పరిష్కారానికి ఇరవయో శతాబ్ది భావజాలాలు అన్నిటినీ సమన్వయపరిచే ప్రయత్నం.

కాలానికి ముందు నడిచిన దార్శనికుడు జయప్రకాశ్ నారాయణ్. మనం నివసించే వ్యవస్థను, మానవుడినీ మౌలికంగా మార్చివేయడమే సంపూర్ణ విప్లవమని ఆయన చెప్పారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే సంపూర్ణ విప్లవం అనేది రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలోనే కాదు, ఆధ్యాత్మిక రంగంలో కూడా సంభవించే విప్లవం. ఆయన భుజస్కంధాలపై నిలబడ్డ మనం భవిష్యత్తును మరింత విశాల దృష్టితో దర్శించగలం; మరింత మెరుగ్గా సంపూర్ణ విప్లవానికి కృషిచేయగలం. ఇప్పుడు మనం ఫూలే- అంబేడ్కరిజం, స్త్రీ వాదం, పర్యావరణ వాదం మొదలైన వాటిని సంపూర్ణ విప్లవంలో సమన్వయపరచుకోవాలి. ఒక ఉహాత్మక ఆదర్శ రాజ్యం (యుటోపియా) స్ఫూర్తితో ఒక మంచి సమాజాన్ని భావించడానికి బదులు, భారత రాజ్యాంగ విలువల ప్రాతిపదికగా కొత్త భావజాలాన్ని మనం అభివృద్ధిపరచుకోవాలి. ఆ బృహత్తర కృషిని ఈ జూన్ 5న ప్రారంభిద్దాం.

Courtesy Andhrajyothi

Leave a Reply