మన సమాజంలో ఆడబిడ్డలకు భద్రతేది?

0
166
– వి.సంధ్య,
నేషనల్​ కన్వీనర్,​ పీవోడబ్ల్యూ

పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక మూలన ఆడవాళ్లపై అత్యాచారాలు, హింస కొనసాగుతూనే ఉంది. ఇటీవల వారం రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు సంబంధించి 12 అఘాయిత్యాలు జరిగాయి. ఇలాంటి ఘటనలకు కారణం విచ్చలవిడిగా పెరిగిన మద్యం వ్యాపారమే. వీటిపై వచ్చే డబ్బుని ప్రభుత్వం మూటలు కట్టుకుంటోంది గానీ మద్యం మత్తులో జరుగుతున్న దారుణాలను మాత్రం కనిపెట్టడం లేదు. అన్యాయాలకు గురైన ఆడపడుచులపై ప్రభుత్వం కనీస సానుభూతి చూపించకపోవడం విచారకరం. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లల జీవితాలకు భద్రత కల్పించేదెవరు?

దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, కుటుంబ హింస, వరకట్న వేధింపులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. అసలు మహిళల ఉనికే ప్రమాదంలో పడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కులం, మతం, జాతుల పేరిట, పేదరికం సాకుగా మహిళలపై దాడులు కొనసాగుతున్నాయి. చట్టాలు ఎన్ని తెచ్చినా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఆగడం లేదు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు నిరసన వ్యక్తమవుతుంది. ఉద్యమాల ఒత్తిడితో యంత్రాంగం కదులుతుంది. సింగరేణి లాంటి ఘటనలో నిందితుడు ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతారు. అడపాదడపా  అత్యాచారం, హత్యలు చేసిన నేరస్తులకు కోర్టులు మరణశిక్ష విధిస్తుంది. మహిళలను మభ్యపుచ్చడానికి కొన్ని చట్టాలు  వస్తాయి. కానీ చాలా మంది నేరస్తులు, హంతకులు అసలు దొరకనే దొరకరు. మరెందరో శిక్షలు పడకుండా తప్పించుకుంటారు. ఇలాంటి ఘటనలు మళ్లీ.. మళ్లీ జరుగుతూనే ఉంటాయి. రోజురోజుకు పెరిగిపోతున్న ఇలాంటి ఘటనల వల్ల చట్టాలను మరింత కఠినతరం చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.

వయసు‌‌‌‌తో సంబంధం లేకుండా..
మనదేశంలో చట్టాలు ఆమోదించడానికి ఏండ్ల తరబడి పోరాటాలు చేయాలి కానీ.. ఉల్లంఘనలకు క్షణాలు చాలు. చట్టాలను ఖాతరు చేసే పనే లేదన్నట్లుగా నేరస్తులు దాడులు, అత్యాచారాలకు తెగబడుతూనే ఉన్నారు. నెలల పసికందా? మైనరా? గర్భవతా? వృద్ధురాలా? ఇలాంటివేమీ పట్టవు. ఐదు నిమిషాల కోరిక కోసం క్రూరంగా మారుతున్నారు. ఇది లైంగికానందమే కాదని, ఎదుటి మనిషి నిస్సహాయంగా ఉంటే హింసించే శాడిస్టిక్ ప్లెజర్ అని సైకాలజిస్టులు చెబుతున్నారు. వీటితోపాటు సామాజిక వివక్ష, అణచివేత, దిగజారిన విలువలు, పెరుగుతున్న హింస, పితృస్వామిక భావజాలం అన్నీ కూడా ఇలాంటి దాడులకు  దారి తీస్తున్నాయి. వీళ్లని మృగాళ్లు అంటూ మృగాలను తక్కువ చేస్తున్నాం. జంతువులేవీ రేప్ చెయ్యవు. తమ జాతిని హత్య చెయ్యవు. కుల మతాలంటూ, లింగ భేదాలంటూ సాటివాళ్లను చులకనగా చూడవు.

ఎన్‌‌‌‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు
దేశశ్యాప్తంగా ప్రతి రోజు మహిళలపై 93 అత్యాచార, 128 హత్యలు, 415 లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వాలు ఏ మాత్రం స్పందించటం లేదు. ఈ నేపథ్యంలోనే రేప్ చేసిన వారిని ఎన్‌‌‌‌కౌంటర్ చెయ్యాలి, బహిరంగంగా ఉరి తీయాలనే వాదన వినిపిస్తోంది. ఎన్‌‌‌‌కౌంటర్ అనేది చట్ట వ్యతిరేక చర్య. దీన్ని చట్టబద్ధం చేయలేం. మనదేశంలో చట్టాలు మన ఇష్టం అనుకుంటే ఎలా? ఈ ఎన్‌‌‌‌కౌంటర్ల వల్ల తాత్కాలికంగా సమస్య చల్లబడుతుందేమో, ప్రతీకార వాంఛ తీరుతుందేమో కానీ నేరానికి తగిన శిక్ష పడ్డట్టు కాదు. కోర్టుల్లో విచారణ జరిగి, వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారో, ఎవరి పాత్ర ఎంతుందో రుజువయ్యి, ఆ నేరానికి చట్టబద్ధంగా శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించి శిక్షిస్తే అప్పుడు సమాజంలో ఫలానా నేరానికి పాల్పడితే విధిగా శిక్ష ఉంటుందని తెలిసేది. తద్వారా నేరాలు తగ్గేవి. అప్పుడు మాత్రమే ఈ నేరాలు నిరోధించడానికి ఓ మేరకైనా వ్యవస్థ జవాబుదారీగా ఉండేది. నేరస్తులు ఎంతటివారైనా వారిని శిక్షించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నప్పుడే బాధితులకు తగిన న్యాయం జరుగుతుంది. నేరాలు తగ్గుముఖం పడతాయి. ఒక మేరకైనా రక్షణ పెరుగుతుంది.

కొండల్లా పెరుగుతున్న సమస్యలు
విచ్చలవిడిగా, రకరకాల మత్తుల్లో, మానవత్వం లోపించిన మనుషులు పెరిగిపోతున్న దేశం మనది. వాళ్లను సంస్కరించే నిజాయితీ, నిబద్ధత, ప్రణాళికలు మనకున్నాయా? పెరిగిపోతున్న పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం ఒకవైపు.. కొండల్లా పెరిగిపోతున్న పాలకుల  అవినీతి, అక్రమ ఆస్తులు మరోవైపు ఈ దుస్థితిని పెంచి పోషిస్తున్నాయి. ఈ వికృత అసహజ సమాజపు విలువలకు కొమ్ము కాస్తున్నాయి. ఇక్కడ చట్టాన్ని చేతుల్లో తీసుకోలేని వాళ్లే బలైపోతున్నారు. అత్యాచార  కేసులు ఎదుర్కొంటున్న బడా బాబులు దేశం వదిలి పారిపోతారు. లేదా జైళ్లను కూడా తమ అడ్డాలుగా మార్చుకుంటారు. పల్లెల్లో అయితే ఆధిపత్య కులాల వారి చేతుల్లో బడుగు వర్గాలు, దళిత, ఆదివాసీ మహిళలు బలైపోవడం సాధారణ విషయం. అంతా బహిరంగమే అయినా ఎవరూ దోషులుగా బోనెక్కరు.

శిక్షలు సత్వరమే అమలు చేసేలా..
వాకపల్లి, భల్లుగూడ, ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌, కుంట ఇంకా అనేక చోట్ల గిరిజన మహిళలపై అత్యాచారాలు జరిగినా చర్యలు లేవు. ఉత్తరప్రదేశ్​లో ఒక మంత్రి మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా కేసు పెట్టిందని ఆమె కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడి హత్య చేసినా శిక్షలేదు. కాశ్మీర్​లో పసిమొగ్గపై రోజుల తరబడి రేప్ చేసి చంపినా సరైన శిక్షలు లేవు. పైగా నిందితులను సమర్థిస్తూ అక్కడి లాయర్లు, నాయకుల ప్రదర్శన చేయడం సిగ్గు చేటు. భూటకపు ఎన్‌‌‌‌కౌంటర్లకు పాల్పడి ఉద్యమకారులతో పాటు అనేక మంది గిరిజనులను కాల్చి చంపుతున్న పోలీసులపై కోర్టుల తీర్పుల ప్రకారం కూడా కేసులు పెట్టరు. చర్యలు ఉండవు. కోర్టు తీర్పు ప్రకారం దిశ నిందుతుల భూటకపు ఎంకౌంటర్ పై పోలీసు అధికారులపై కేసు నమోదు చేసి విచారణ చేయాలి. కానీ చట్టం ఆ పని చేయడం లేదు. కోర్టు తీర్పులు అసలే అమలు జరగవు. దళిత, పేద వర్గాలకు ఇలాంటి అన్యాయాలు రోజూ ఎదురవుతూనే ఉన్నాయి. నిందితులు కింది వర్గాలు అయితేనే శిక్షలు, బాధితులు పైవర్గాలు అయితే న్యాయం అనే వివక్షత లేకుండా పనిచేసే వ్యవస్థలు కావాలి. నేరస్తులందరికి ఒకే రకమైన శిక్షలు ఉండాలి. కానీ ఆ శిక్షలు చట్టబద్ధంగా విధించాలి. విచారణ పేరుతో జాప్యం జరగకుండా, నిందితులు చట్టం లొసుగులతో తప్పించుకునే అవకాశం లేని విధంగా చట్టాలు మార్చాలి.

ఆడపిల్లలపై ఇంకెన్నాళ్లీ ఆంక్షలు
కుటుంబం, సమాజం ఆడపిల్లల మీద ఆంక్షలు పెడుతూ, వారిని నిరంతరం అదుపులో పెడుతూ వాళ్ల ఎదుగుదలను కుదించి వేస్తుంది. వాళ్ల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొడుతోంది. ఫలితంగా తాము అన్నింటా తక్కువే, తమకు అసలు విలువ లేదనే ఆత్మ న్యూనతతో పెరుగుతున్నారు. తమ మీద హింస తప్పదు, మౌనంగా భరించాలి, ఎదురు తిరగకూడదు అన్న పితృస్వామిక భావజాలం నరనరానా నూరిపోయడం వల్ల అమ్మాయిలు ఇంటా బయటా హింసకు బలవుతున్నారు. వరుసగా జరుగుతున్న అమానుష హత్యలు, దాడులకు సమాజంలోని అన్ని వ్యవస్థలు బాధ్యత వహించాలి. గతంలో జరిగిన ఘటనల పట్ల నిరసన వ్యక్తమైనా, సత్వర న్యాయం, సమగ్ర న్యాయం చేకూర్చడంలో విఫలమైనా ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలు
ముఖ్యంగా బాధ్యత వహించాలి.

విముక్తి పోరాటాలను నిర్మించాలె
మహిళలపై దాడులకు మగాళ్లు మాత్రమే కాదు ఫ్యూడల్ భావజాలాన్ని తొలగించలేని, సామ్రాజ్యవాద విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలది కూడా బాధ్యత అని గుర్తించాలి. అందులో భాగంగా పోర్న్ కల్చర్ ను, అశ్లీల సంస్కృతిని పెంచి పోషిస్తున్న మార్కెట్ సంస్కృతిని అంతం చేయాలి. దశాబ్దాలుగా స్త్రీ, పురుష సమానత్వ స్పృహను అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఆడవాళ్లను తోటి మనిషులుగా కాక లైంగిక వస్తువుగా చూపిస్తూ, పురుషాధిక్య భావజాలం ఈ దాడులను ఉసిగొల్పుతోందనే స్పష్టతను పెంచుకోవాలి. పురుష దురహంకారానికి, లింగ వివక్షకు నిలువుటద్దమైన ఈ ఘటనల్లో బలైన అమ్మాయిలు ఎన్నో ప్రశ్నలు, సవాళ్లు విడిచివెళ్లారు. వాటి ఆధారంగా మహిళా విముక్తి పోరాటాలను నిర్మించాలి. హింసలేని శరీరం, జీవితం, కుటుంబం, సమాజం మహిళల హక్కు అని చాటాలి.

తీసుకోవాల్సిన చర్యలు
ఇలాంటి నేరాలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే మొదట విచ్చలవిడి మద్యం అమ్మకాలను నిషేధించాలి. లేదంటే కనీసం నియంత్రించాలి. ఎక్కువ శాతం నేరాలకు మద్యపానమే మూలమని అందరికీ తెలిసినా ఎవరూ పట్టించుకోరు. పైగా ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటే తప్ప ఖజానాకు దిక్కులేదన్నట్లుగా లిక్కర్​ను బలవంతంగా ప్రజలపై పాలకులు రుద్దుతున్నారు. అశ్లీల ప్రదర్శనలను, చిత్రీకరణలను, టీవీ, సినిమాల్లో కావచ్చు, అరచేతిలో ఉన్న ఫోన్, ఇంటర్నెట్​లో కావచ్చు పూర్తిగా నిరోధించాలి. ముఖ్యంగా లక్షల్లో ఉన్న పోర్న్ సైట్లను నిషేదించాలి. అలాగే అక్షరాస్యతను పెంచే చర్యలు తీసుకోవాలి. విద్యా వ్యవస్థలో లింగ స్పృహను పెంచేలా మార్పులు తీసుకురావాలి. ఉద్యోగావకాశాలు, ఉపాధి భద్రత కల్పించాలి. ప్రభుత్వం స్థాపించిన షీ టీమ్స్, హాక్​ ఐ యాప్ లు, హెల్ప్ లైన్ నంబర్లు సక్రమంగా పనిచేయాలి. వాటి గురించి అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలి. అవగాహన కల్పించాలి. నిర్భయ నిధులను సక్రమంగా వాడుకోవాలి. ఈ నిధులతో పోలీసులకు ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది కానీ, వారి ఆలోచనా సరళి మారలేదు. న్యాయవ్యవస్థ మాత్రం ఇప్పటికీ కావాల్సినంత బడ్జెట్ లేక ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, సిబ్బంది పెరగక ఇబ్బందులు పడుతూనే ఉంది. అందుకే ఇటీవల రాష్ట్రంలో నాలుగు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు రద్దయ్యాయి.

Courtesy V6velugu

Leave a Reply