సీఏఏ రద్దుకు బెంగాల్‌ అసెంబ్లీ తీర్మానం

0
241
Against CAA Bengal govt

కోల్‌కతా : సీఏఏను వెంటనే రద్దు చేయాలని, ఎన్పీఆర్‌, ప్రతిపాదిత ఎన్నార్సీలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ సోమవారం పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌, సీపీఎం సారథ్యంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ మద్దతు తెలిపాయి. రాజ్యాంగానికి, ప్రజలకు సీఏఏ వ్యతిరేకమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సీపీఎం, కాంగ్రెస్‌ రాజకీయ విభేదాలను వీడి కేంద్రంలోని ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసి రావాలని కోరారు. తమ ప్రభుత్వంపై అబద్ధాలను ప్రచారం చేయడం మానుకోవాలని చెప్పారు. ఢిల్లీలో ఎన్పీఆర్‌ సమావేశానికి గైర్హాజరై తమ ప్రభుత్వ దమ్ము ఏమిటో చూపించామని, కావాలనుకుంటే బీజేపీ తమ ప్రభుత్వాన్ని రద్దు చేసుకోమనండి అని సవాల్‌ విసిరారు.

కాగా, పొరుగు దేశాల్లో మతపరమైన పీడనకు గురై శరణార్థులుగా వచ్చినవారికి భారత పౌరసత్వం ఇచ్చేందుకే సీఏఏను తెచ్చారంటూ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాకు బీజేపీ శాసనసభా పక్షం కృతజ్ఞతలు తెలిపింది. మమత ప్రభుత్వం పెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించింది. ఎన్నార్సీకి వ్యతిరేకంగా గత ఏడాది సెప్టెంబరులోనే బెంగాల్‌ అసెంబ్లీ తీర్మానం చేసింది. సీఏఏను వ్యతిరేకిస్తూ కేర ళ, రాజస్థాన్‌, పంజాబ్‌ కూడా ఇప్పటికే తీర్మానాలు చేశాయి.

నిరసనకారుల మరణాలపై దర్యాప్తు: రాహుల్‌
యూపీలో సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సోమవారం జాతీయ మానవహక్కుల సంఘం ప్రతినిధులను కలిశారు. నిరసనకారులపై అకృత్యాలకు పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసనల్లో పాల్గొన్న పౌరుల మరణాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని కోరారు. పోలీసులు మితిమీరి ప్రవర్తించారంటూ ఆధారాలను సమర్పించారు. దేశంలో పరిస్థితులు మరింత క్షీణించకుండా సీఏఏ-ఎన్నార్సీ-ఎన్నార్పీ వ్యతిరేకులతో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా చర్చలు జరపాలని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ సూచించారు.

ఉత్తరప్రదేశ్‌లో సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న మహిళలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి డిమాండ్‌ చేశారు. సీఏఏ అమలులోకి వస్తుండటంతో ఒక దేశం గురించి పాకిస్థాన్‌ జాతిపిత మహమ్మద్‌ అలీ జిన్నా ఆలోచనలు భారత్‌లో విజయం సాధిస్తున్నట్లేనని కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ వ్యాఖ్యానించారు. ఎన్పీఆర్‌, ఎన్నార్సీలకు కూడా సీఏఏ మార్గం సుగమం చేస్తే జిన్నాకు పూర్తి విజయం అవుతుందని పేర్కొన్నారు.

దూకుడుగా వ్యవహరించండి: సోనియా
కాగా, కేంద్ర బడ్జెట్‌ సమావేశాల్లో సీఏఏ, ఎన్నార్సీ అంశాలపై దూకుడుగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం ఆమె నివాసంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. భారత రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని అమెరికా నగరాల్లో ప్రవాసులు సీఏఏకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. సీఏఏ, ఎన్నార్సీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారతదేశంలో లౌకికవాదం ప్రమాదంలో ఏర్పడిందని పేర్కొన్నారు.
షర్జీల్‌ ఇమామ్‌ కోసం పోలీసుల వేట
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బా్‌ఘలోనూ, దేశంలోని ఇతరచోట్లా నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్న జేఎన్‌యూ విద్యార్థిఽ నేత షర్జీల్‌ ఇమామ్‌ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, యూపీల్లో ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. జార్ఖండ్‌లోని జెహానాబాద్‌ జిల్లాలోని కాకో బజార్‌ ప్రాంతంలో ఉన్న ఆయన పూర్వీకుల ఇంటిని మూడు రాష్ట్రాల పోలీసులు సోదా చేశారు. జేఎన్‌యూ, ఏఎంయూ హాస్టళ్లలన్నింటినీ జల్లెడ పట్టారు.

(Courtesy Andhrajyothi)

Leave a Reply