అప్పులు ఓకే.. ఆస్తుల మాటేమిటి…?

0
262

– వాటి విలువ రూ.4 వేల కోట్లేనంటున్న ప్రభుత్వం
– మార్కెట్‌ రేటు కనీసం రూ.20 వేల కోట్లు ఉంటుందంటున్న అధికారులు
– ఈ విషయాలను వెల్లడించని సర్కారు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘ఆర్టీసీకి ఇప్పటికే రూ.5 వేలకు కోట్లకు పైగా అప్పులు న్నాయి. తక్షణం చెల్లించాల్సిన బకాయిలే రూ.2 వేల కోట్ల వరకూ ఉన్నాయి…’ ఆర్టీసీపై సమీక్ష సందర్భంగా ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం చేసిన ప్రకటన ఇది. ఆ సంస్థ అప్పుల గురించి మాట్లాడిన సీఎం.. దాని ఆస్తుల గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించకపోవటం గమనార్హం. రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9 ప్రకారం.. ఆర్టీసీ విభజన జరగలేదు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లోని బస్‌భవన్‌, ఆర్టీసీ కళాభవన్‌, మియాపూర్‌లోని వర్క్‌షాప్‌, నగరంలోని బాడీ బిల్డింగ్‌ యూనిట్లు, జేబీఎస్‌, సీబీఎస్‌ ఇరు రాష్ట్రాలకూ చెందుతాయి. అధికారిక లెక్కల ప్రకారం.. వీటిని మినహాయించినప్పటికీ టీఎస్‌ ఆర్టీసీకి తెలంగాణలోని వివిధ డిపోలు, బస్టాండ్లతో కలిపి కనీసంగా రూ.20 వేల కోట్ల ఆస్తుల విలువ ఉంటుందని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అంటున్నారు. కానీ ప్రభుత్వం వీటిని ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్తపడుతున్నది. ఇలాంటి వాస్తవా లకు విరుద్ధంగా ఆ సంస్థకు రూ.4 వేల కోట్ల ఆస్తులే ఉన్నాయి, కానీ అప్పులు మాత్రం రూ.5 వేల కోట్లున్నా యంటూ ప్రభుత్వ పెద్దలు ప్రకటించటం గమనార్హం.
మరోవైపు ఆర్టీసీ రూట్లను ప్రయివేటీకరించేందుకు సర్కారు శరవేగంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు వీటిని ఏం చేయబోతున్నారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తు తున్నది. ఇప్పటికే కరీంనగర్‌లాంటి చోట్ల ప్రయివేటు వారికి ఆర్టీసీ ఆస్తులను అప్పజెప్పారని తెలుస్తున్నది. ఇదే కోవలో రాష్ట్రంలో ఆ సంస్థకు ఉన్న ఆస్తులన్నింటినీ ప్రయివేటు వారికి ధారాదత్తం చేస్తారనే ఊహాగానాలు కూడా కొనసాగు తున్నాయి.
‘ఆర్టీసికి సంబంధించిన స్థలాలను కమర్షియల్‌ కాంప్లెక్సులుగా మార్చి.. వాటిని అద్దెకు ఇవ్వటం ద్వారా ఆ సంస్థకు లాభాలు చేకూర్చటమేగాక ఇప్పటికంటే మరింత మెరుగ్గా ప్రజా రవాణా వ్యవస్థను నడపొచ్చు…’ అని ఈ సందర్భంగా ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించటం గమనార్హం. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా ఆప్పుల గురించే ప్రస్తావించి వదిలేయటం గమనార్హం. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన విలేకర్ల సమావేశం సందర్భంగా ఆర్టీసీ కార్మికుల జీతాలపై అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానమిస్తూ… ‘ఏముంది రెండు బస్టాండ్లు అమ్మి చెల్లిస్తాం…’ అంటూ సమాధానమిచ్చారు. అంటే ఆర్టీసీ ఆస్తులను తెగనమ్మడానికో లేదా తక్కువ ధరకి ప్రయివేటు వారికి లీజుకివ్వడానికో రంగం సిద్ధం చేయబోతున్నారనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి.

Courtesy Navatelangana

 

Leave a Reply