– నయీమ్, ఐటీగ్రిడ్, ఉగ్రవాది వికారుద్దీన్ బృందం ఎన్‌కౌంటర్ కేసులపై సర్వత్రా సందేహాలు
రాష్ట్రంలో సంచలనం రేపిన మూడు కేసులపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు టీమ్(సిట్)ల దర్యాప్తులు పూర్తయినట్టేనా? లేక ఆ సిట్‌లను సర్కారు రద్దు చేసిందా? ఈ అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మూడేండ్ల కిందట చోటు చేసుకున్న గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ ఎలియాస్ నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత వెలుగు చూసిన నేరాల చిట్టా, బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం సిట్‌ను వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత నగర సీపీ అంజనీకుమార్ స్వీయ పర్యవేక్షణలో ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు జరిపిన ఈ సిట్ దర్యాప్తు తొలుత అత్యంత వేగవంతంగా సాగింది. 170కి పైగా కేసులతో పాటు 277 మంది వరకు నయీమ్ గ్యాంగ్ సభ్యులు, అతని కుటుంబసభ్యులను సిట్ అరెస్టు చేసింది. అంతేగాక నయీమ్‌కు సంబంధించి రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్, నల్లగొండ వరంగల్ మొదలైన పోలీసులు జరిపిన విచారణల్లోనూ సిట్ అధికారులు చురుకుగా పాల్గొని నయీమ్ అరాచకాల ఆధారాలను సంపాదించారు. అనేక భూకబ్జాలు, చేసిన కిడ్నాప్‌లు, బెదిరించి దోపిడీలు, హత్యలపై క్షేత్ర స్థాయిలో సిట్ దర్యాప్తు జరిపి పలు ఆధారాలను సేకరించడమే గాక కేసులపై కోర్టులలో చార్జిషీట్‌లను కూడా దాఖలు చేసింది. అయితే ఈ కేసులో అత్యంత కరడుగట్టిన నేరస్తుడు , నయీమ్ కుడిభుజంగా పిలిచే గ్యాంగ్‌స్టర్ శేషన్న ఆచూకీ మాత్రం కనిపెట్టడంలో సిట్ విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి.
శేషన్న తో పాటు అతని వెంటున్న మరో ముప్పై మంది గ్యాంగ్ సభ్యుల ఆచూకీ ఇంకా కనిపెట్టలేక పోయారని ఆరోపణలు ఉన్నాయి. కాగా శేషన్న ఇంకా దొరక్క పోవడంతో నయీమ్ బాధితులు అనేక మంది ఇంకా భయాందోళనలకు గురవుతున్నారని తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం శేషన్న కోసం తమ గాలింపు చర్యలు సాగుతున్నాయని అంటున్నారు. ఇక ఆలేరులో మూడేండ్ల క్రితం జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్ మరో ఐదుగురి ఎన్‌కౌంటర్‌పై వేసిన సిట్ విచారణ ఏమైందనేది ఇంతవరకూ బహిర్గతం కాలేదు.
లష్కరే తోయిబా ప్రేరణతో హైదరాబాద్‌లో పలు హత్యలతో పాటు పోలీసులనూ హతమార్చిన వికారుద్దీన్‌ను ప్రత్యేక పోలీసు బృందాలు అరెస్టు చేశాక సెక్యూరిటీ కారణాల చేత చర్లపల్లి జైలు నుంచి వరంగల్ కేంద్ర కారాగారంలో ఉంచారు. కోర్టులో హాజరుపర్చడానికి… వికార్ తో పాటు మరో ఐదుగురు ఉగ్రవాదులను ప్రత్యేక వ్యాన్‌లో తీసుకు వస్తుండగా ఆలేరు వద్ద ఎన్‌కౌంటర్ జరిగింది. ఎస్కార్టు పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కొని పారిపోయే ప్రయత్నం చేసిన వీరిపై పోలీసులు కాల్పులు జరపడం, వారు మరణించడం జరిగిందని ఆ సమయంలో పోలీసు అధికారులు ప్రకటించారు.
అయితే ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని దీనిపై సమగ్రవిచారణ జరిపించాలనే డిమాండ్ రావడంతో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ప్రస్తుత రైల్వే పోలీసు విభాగం అదనపు డీజీ సందీప్ శాండిల్యను విచారణాధికారిగా నియమించారు. విచారణ సాగింది ..కానీ అందులో ఎవరిది తప్పు పోలీసులు చెబుతున్న దాంట్లో ఈ మేరకు నిజముందనేది సిట్ ఏ మేరకు తేల్చింది..? దానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందా..?
అలా అయితే సర్కారుఆ విచారణ నివేదికపై ఎలాంటి చర్య తీసుకున్నది అనేది ఇంకా గోప్యంగానే ఉంది. ఇదిలా ఉంటే ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్ధ అపహరించి దుర్వినియోగం చేసిందనే ఆరోపణలపై రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ సంస్థ యాజమాన్యంపై సైబరాబాద్ పోలీసులు కేసును నమోదు చేశారు. ఏపీకి చెందిన డేటాతో పాటు తెలంగాణకు చెందిన డేటాను కూడా చోరీ చేశారని, దీని వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ హస్తం ఉన్నదనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు తెలంగాణ, ఏపీ సర్కారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలా మారింది.
దీంతో ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో రాష్ట్ర సర్కారు వేసిన సిట్ దర్యాప్తును ప్రారం భించింది. ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ శేఖర్ కోసం గాలించిన సిట్ అతన్ని ఏపీలోనే అప్పటి టీడీపీ సర్కారులోని పెద్దలు దాచి పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. మరో వైపు ఏపీ ప్రభుత్వం సైతం తమ డేటాను తెలంగాణ పోలీసులు దొంగిలించారంటూ కేసులు నమోదు చేయడం, ఇక్కడ అధికారులను విచారించడానికి రావడం పెద్ద సంచలనానికి దారి తీసింది. ఇంత ప్రతిష్టాకరంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేసును తీసుకోవడంతో చివరికి రాజ్యాంగ ప్రతిష్టంబన ఏర్పడుతందా అనేంత వరకు పరిస్థితులు వెళ్లాయి.
తర్వాత ఎన్నికలు రావడం ఈ కేసు దర్యాప్తు కూడా సాగుతూ పోవడం జరిగింది. తీరా ఏపీలో వైసీపీ సర్కారు అధికారం లోకి రావడంతో ఐజీ స్టీఫెన్ రవీంద్రను అక్కడ ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా సీఎం జగన్ నియమించుకోవడంతో సిట్ కథ ముగిసినట్టేనని పరిశీలకులు భావించారు. తీరా కారణాలు ఏమైనా ఇంకా స్టీఫెన్ రవీంద్ర తెలంగాణలోనే కొనసాగుతున్నారు. మొత్తం మీద పై మూడు సంచలన కేసులకు సంబంధించిన మూడు సిట్‌ల విచారణలు కొనసాగుతున్నట్టా లేక ముగిసినట్టా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
Courtesy Nava Telangana