జీఎస్టీపై పోరు వెనుక..

0
302

– రాష్ట్రాలకు నష్టపరిహారం ఎందుకు?..కేంద్రం బాధ్యత ఏమిటీ..
– సీఎంల లేఖలతో మోడీ సర్కారు దిగివస్తుందా..!
”రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికే ఉంటుంది. మీ బాధ మీరు పడండి అనడం అన్యాయం” అంటూ అనేక రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా దీనిపై కేంద్రానికి లేఖ రాశారు.
జీఎస్టీ పరిహారం అంటే ఏమిటీ? రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారం అనేది ఎందుకు వచ్చింది? ఇది అర్థం కావాలంటే.. అసలు జీఎస్టీ అంటే ఏమిటి?

న్యూఢిల్లీ : జీఎస్టీకి పూర్వం(2017 జులైలో జీఎస్టీ వచ్చింది) కేంద్రం ఎక్సైజ్‌ సుంకాలు విధించేది. రాష్ట్రం ముందు అమ్మకం పన్ను, తర్వాత వాల్యూ యాడెడ్‌ టాక్స్‌(వ్యాట్‌- విలువ ఆధారిత పన్ను) అనేది వేసేది. అలాగే కేంద్రం సర్వీసెస్‌ పైన సర్వీస్‌ ట్యాక్స్‌ వేసేది. ఇవన్నీ కలిపి జీఎస్టీ రూపంలో ఒక యునిఫైడ్‌ ఆలిండియా ట్యాక్స్‌ రెజిమ్‌.. దేశవ్యాప్తంగా జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. ఈ జీఎస్టీకి కేంద్రం తమకు రాజ్యాంగం ఇచ్చిన పన్నుల అధికారాలు కొన్నింటిని, రాష్ట్రము తమకు రాజ్యాంగం ఇచ్చినటువంటి పన్నుల అధికారాలు కొన్నింటిని మేళవించి జీఎస్టీగా రూపొందించారు. దీనికి జీఎస్టీ కౌన్సిల్‌ ఉంటుంది. కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కలిపి జీఎస్టీ కౌన్సిల్‌ ఏర్పాటు అవుతుంది. జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే ఒక రకంగా కేంద్రం తమ ట్యాక్స్‌ సార్వభౌమాధికారాన్ని, రాష్ట్రాలు తమ ట్యాక్స్‌ సార్వభౌమాధికారాన్ని జీఎస్టీకి సరెండర్‌ చేశాయి. అందుకే రాజ్యాంగ సవరణ అవసరం వచ్చింది. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా జీఎస్టీ వచ్చింది.

అయితే జీఎస్టీ తేవాలని చర్చలు జరిగినప్పుడు కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. మాకు ఇప్పుడొస్తున్న పన్నుల ఆదాయం కంటే జీఎస్టీ వస్తే ఆదాయం తగ్గుతుందేమో? అని అనుమానాలు వ్యక్తం చేశాయి. కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామన్నాయి. అయితే ‘జీఎస్టీతో ఆదాయం తగ్గదు. పెరుగుతుంది’ అని రాష్ట్రాలకు కేంద్రం చెప్పింది. ‘జీఎస్టీ చాలా మంచి ట్యాక్స్‌. ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో జీఎస్టీ ఉంది. కాబట్టి లాంగ్‌టర్మ్‌లో మీకు ఇంకా ఆదాయం పెరుగుతుంది’ అని కేంద్రం రాష్ట్రాలకు తెలిపింది. రాష్ట్రాలకు అనుమానాల నేపథ్యంలో ఏకాభిప్రాయం తీసుకొచ్చి జీఎస్టీ చట్టం చేయాలి. ఎందుకుంటే జీఎస్టీకి పార్లమెంటు ఒక్కటే చట్టం చేస్తే సరిపోదు. రాష్ట్ర శాసనసభలకు కూడా రాష్ట్ర జీఎస్టీ చట్టాలు చేయాలి. అందువల్ల రాష్ట్రాలను ఒప్పించడానికి కేంద్రం ఒక ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదన ఏమిటంటే.. మీకు ఇప్పుడొస్తున్న ఆదాయం కంటే తక్కువగా ఆదాయం వస్తే దాన్ని మేము(కేంద్రం) భర్తీ చేస్తాం అని ఒక ప్రతిపాదించింది. ఇందుకోసం జీఎస్టీ చట్టంలో విధివిధానాలు పెట్టారు.

ఆ విధివిధానాలు ఏమిటి?
2015-16లో వచ్చినటువంటి ఆదాయాన్ని బేస్‌ ఇయర్‌(ప్రాతిపదిక సంవత్సరం)గా తీసుకుంటారు. అప్పటి నుంచి ప్రతి యేటా 14 శాతం వార్షిక పెరుగదల రేటు ఉంటుందని లెక్క వేస్తారు. ఇలా ప్రతి ఏడాది 14శాతం ట్యాక్స్‌ గ్రోత్‌ అని లెక్క వేసి ప్రతి ఏటా అంత రాకపోతే ఆ లోటును భర్తీ చేస్తారు. ఉదాహరణకు, 2015-16లో రూ.100 ఆదాయం వచ్చింది. అది 2017-18లో 14శాతం పెరగాలి. అలా రాలేకపోతే జీఎస్టీ ద్వారా అప్పుడు లోటును భర్తీ చేస్తారు. ఇలా 14శాతం వార్షిక వృద్ధిరేటు ఉంటుందని అంచనా. ఐదేండ్ల పాటు అంటే 2022 వరకు కూడా ఇలా రాష్ట్రాలకు ఎవరికైతే తక్కువ ఆదాయం వచ్చిందో.. అంటే ఆ రాష్ట్రానికి 2015-16లో వచ్చిన ఆదాయమెంత? దాని పైన ప్రతియేటా 14 శాతం పెరిగిందా? లేదా? చూస్తారు. అంత రాకపోతే లోటును భర్తీ చేస్తారు.

ఎక్కడ నుంచి భర్తీ చేస్తారు?
దీని కోసం ఒక మెకానిజంను కూడా జీఎస్టీ చట్టం చెప్పింది. జీఎస్టీ నష్టపరిహార సెస్‌(జీఎస్టీ కంపెన్సెషన్‌ సెస్‌) అనేది ఒకటి విధిస్తారు. కొన్ని రకాల వస్తువుల పైన(పొగాకు ఉత్పత్తులు లాంటి వస్తువుల పైన) సెస్‌ విధించి దాని ద్వారా వచ్చిన నిధుల్ని జీఎస్టీ కంపెన్సెషన్‌ ఫండ్‌లో జమ చేస్తారు. ఐదేండ్లుగా ఈ ఫండ్‌లో జమ చేస్తుంటారు. ఈ నిధి ద్వారా వార్షిక పెరుగదల తక్కువగా నమోదు చేసిన రాష్ట్రాలుంటే ఆ లోటును భర్తీ చేస్తారు. ఐదేండ్ల తర్వాత అంటే 2022 తర్వాత జీఎస్టీ నష్టపరిహార సెస్‌ ఉండదు. అప్పటికి ఆ నిధిలో మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే అందులో 50శాతం రాష్ట్రాలకు ఇచ్చేస్తారు. 50శాతం కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఇండియాలోకి జమ చేస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఈ విధంగా రాష్ట్రాలపై జీఎస్టీ నష్టపరిహార సెస్‌ను విధించారు. మొదటి రెండు ఏండ్లు అంటే 2019-20 కంటే ముందు వాస్తవంగా జీఎస్టీ నష్టపరిహార సెస్‌ ఎక్కువగా వసూలైంది. రాష్ట్రాలకివ్వాల్సింది తక్కువ ఉండేది. ఈ రెండేండ్లలో కలిపి 47వేల కోట్ల మిగులు ఏర్పడింది. ఈ మొత్తాన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియాలో కలిపేసుకున్నారు. వాస్తవానికి ఐదేండ్ల తర్వాత మిగిలిన మొత్తాన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియాలో కలుపుకోవాలి.

ది వైర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఢిల్లీ ఆర్థిక మంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ”ఈ రూ.47వేల కోట్లు మిగులున్నప్పుడు మీరు కలుపుకున్నారు. ఇప్పుడు తక్కువ పడుతున్నప్పుడు మమ్మల్ని అప్పులు చేసుకొమ్మంటున్నారు. ఇది కరెక్టా?” అని అడిగారు. ”కలుపుకొనేటప్పుడు ఏ అటార్నీ జనరల్‌ అభిప్రాయాన్ని తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం తక్కువ పడుతున్నప్పుడు అటార్నీ జనరల్‌ ఒపీనియన్‌ను అడిగింది కేంద్రం” అని ఆయన అన్నారు. అయితే మాకు బాధ్యత ఏమీ లేదని రాష్ట్రాలకు కేంద్రం చెబుతున్నది.

2019-20లో ఆర్థిక మందగమనం వల్ల జీఎస్టీ వసూళ్లు ఓవరాల్‌గా తగ్గాయి. జీఎస్టీ పరిహార నిధిలో కూడా చాలినన్ని డబ్బులు లేవు. అంటే రాష్ట్రాలకేమో ఎక్కువ పరిహారం చెల్లించాలి. కంపెన్సేషన్‌ సెస్‌ ద్వారా వసూలైందేమో తక్కువ. దీన్ని ఏం చేయాలి? అనే చర్చ వచ్చింది. అయితే అంతక ముందు మిగులు ఉంది గనక రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చేసింది. 2020 మార్చి వరకు ఇచ్చారు. ఇప్పుడు మార్చి తర్వాత నష్టపరిహార సెస్‌ నిధులు ఇవ్వడం లేదు. ఏప్రిల్‌, మే, జూన్‌, జులై, ఆగష్టు మొత్తం ఐదు నెలలకు గానూ దాదాపు రూ. 2.35 లక్షల కోట్లు రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ నిధులు ఇవ్వాలని రాష్ట్రాలు అడిగితే కేంద్రం ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్‌లో రెండు ప్రతిపాదనలు పెట్టింది. రాష్ట్రాలు 14శాతం వార్షిక వృద్ధి రేటును పొందకపోవడానికి రెండు కారణాలను పేర్కొంది. అవి ఏంటంటే 1. కరోనా వల్ల 2. జనరల్‌ ఎకానమీ తగ్గుదల వల్ల. జనరల్‌ ఎకానమీ స్లోడౌన్‌ వల్ల రూ.97వేల కోట్లు రాష్ట్రాలకు జీఎస్టీ తక్కువగా వసూలైంది. మిగిలిన రూ. 1.38 వేల కోట్లు కోవిడ్‌-19 వల్ల అని రెండుగా వర్గీకరించి రెండు ప్రతిపాదనలను కేంద్రం పెట్టింది.

1. ఈ రూ.97వేల కోట్లకు కరోనాతో సంబంధం లేదు. సాధారణ ఆర్థిక మందగమనం ద్వారా వచ్చింది గనక ఈ రూ.97 వేల కోట్లు ను ఆర్బీఐ ద్వారా ప్రత్యేకంగా తక్కువ వడ్డీతో రాష్ట్రాలకు అప్పు రూపంలో ఇస్తాం. జీఎస్టీ కంపెన్సేషన్‌ సెస్‌ను 2022 తర్వాత కూడా రెండు నుంచి ఐదేండ్లు పెంచుతాం. అలా పెంచడం ద్వారా వచ్చిన డబ్బుతో ఈ ఆర్బీఐ దగ్గర తీసుకున్న డబ్బు, వడ్డీ కడతాం.
2. ఒక వేళ రాష్ట్రాలు రూ.2.35 లక్షల కోట్లు కావాలనుకుంటే ఆర్బీఐ దగ్గరం మేం అప్పు ఇప్పించం. తక్కువ వడ్డీ రేటు ఉండదు. మీరు(రాష్ట్రాలు) అప్పులు కావాలంటే బయట చేసుకోండి. మాకు సంబంధం లేదు.

రాష్ట్రాలు తమకు రావాల్సిన రూ.1.38 వేల కోట్లను వదులుకుంటే బాధ్యత తీసుకుంటామని కేంద్రం అంటోంది. అలా కాదని రూ.2.35 లక్షల కోట్లు కావాలని రాష్ట్రాలు అడిగితే బాధ్యత తీసుకోబోమని మోడీ సర్కారు చెప్తోంది. తాము బాధ్యత తీసుకోకపోవడానికి గల కారణాన్ని ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’ గా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ”అయితే ఇది సరైంది కాదు. మొత్తం రూ.2.35 లక్షల కోట్లు సమకూర్చాల్సింది కేంద్రమే” అని రాష్ట్రాలు అంటున్నాయి. దీనిని కేంద్రం తన జేబులో నుంచి కాకుండా ఎక్కడైనా అప్పు తీసుకొచ్చి ఇవ్వాలని చెప్తున్నాయి. ”2022 తర్వాత కూడా జీఎస్టీ కంపెన్సేషన్‌ సెస్‌ను కొనసాగిద్దాం. దీని ద్వారా వసూలైన డబ్బుతో కేంద్రం తీసుకున్న అప్పును, వడ్డీని కూడా కడదాం” అని రాష్ట్రాలు అడుగుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం మాకు సంబంధం లేదనీ, రాష్ట్రాలే తమ రుణ పరిమితికి లోబడి అప్పులు చేసుకోవాలని వాదిస్తోంది. ఇక్కడ కేంద్రం వాదన పూర్తిగా అన్యాయమైనది. తాము అప్పుజేస్తే తమ క్రెడిట్‌ రేటింగ్‌ పెరుగుతుందని కేంద్రం వాదన. అయితే ఇది పూర్తిగా అర్థరహితం. ఎందుకంటే క్రెడిట్‌ రేటింగ్‌ ఇచ్చేటప్పుడు 1.జాతీయాదాయంలో అప్పులెంత అన్న దానిని చూస్తారు. 2. ద్రవ్యలోటును చూస్తారు. అయితే ఈ రెండింటిని రేటింగ్‌ సంస్థలు కేంద్రం, రాష్ట్రాలు, కార్పొరేట్‌ అప్పులు ఇలా మొత్తం కలిపి చూస్తాయి. ఒక కేంద్రానికి మాత్రమే చూడవు.

కేంద్రం బాధ్యత ఎందుకు తీసుకోవాలి?

జీఎస్టీ పార్లమెంటు చట్టం. పార్లమెంటు చట్టంలో ఇబ్బందులకు కేంద్రమే బాధ్యత వహించాలి. అసలు ఈ జీఎస్టీ తగ్గడమనేది కరోనాతో మొదలు కాలేదు. కరోనాకు ముందు కూడా ఇది ఉన్నది. కారణమేంటంటే.. జీడీపీ గత రెండేండ్లుగా తగ్గుతోంది. 2019-20లో కూడా జీడీపీ పడిపోయింది. దీంతో జీఎస్టీ తగ్గింది. పెద్దనోట్ల రద్దు అనంతరం ఇలా పడిపోతూ వస్తోంది. జీఎస్టీ లో ఉన్న లోపాల్ని సరిచేయకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడింది. అంటే కేంద్రం అనుసరించిన ఆర్థిక విధానాల, వైఫల్యాల వల్ల జీడీపీ పడిపోతోంది. ఫలితంగా జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. అందుకొరకు కేంద్రానిదే బాధ్యత అని రాష్ట్రాల వాదన. కరోనా వల్ల వసూళ్లు తగ్గలేదనీ, కరోనాకు ముందు నుంచే ఈ పరిస్థితి ఉన్నదని అంటున్నాయి. లాక్‌డౌన్‌ విధించేటప్పుడు తమను సంప్రదించలేదనీ, తమకు ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదని ఆరోపిస్తున్నాయి. దేశంలో విధించిన మొదటి లాక్‌డౌన్‌ నిర్ణయం ప్రధాని మోడీ తనంతట తానుగా తీసుకున్నదేనని బీజేపీ ఎంపీ, సీనియర్‌ నాయకుడు జీవీఎల్‌ నరసింహరావు కూడా ఓ వార్తా ఛానెల్‌ చర్చలో తెలిపారు.

21 రోజుల్లో అంతా సర్దుకుంటుందనీ, క్రెడిట్‌ అంతా మోడీకే దక్కాలని రాష్ట్రాలను సంప్రదించకుండా లాక్‌డౌన్‌ విధించారు. ఇందుకు రాష్ట్రాలకు కనీసం సమయం కూడా ఇవ్వలేదు. అయితే వృద్ధి రేటు, జీఎస్టీ పడిపోవడం ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’ కంటే ‘యాక్ట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా’వల్ల జరిగింది. అనేక దేశాలు లాక్‌డౌన్‌ పూర్తిగా విధించలేదు. మరి కొన్నయితే అసలే విధించలేదు. అయినప్పటికీ కరోనాను అక్కడ కట్టడి చేశాయి. అందువల్ల కేంద్రం ఆర్థిక విధానాల, ఏకపక్ష లాక్‌డౌన్‌ నిర్ణయం వల్ల జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. ఇప్పుడు కేంద్రం తాను బాధ్యత తీసుకోను అంటే న్యాయమేనా?. 2016 డిసెంబర్‌ 22-23లో ఏడో జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌లో ” రాష్ట్రాలకు జీఎస్టీ ఆదాయం తగ్గితే వాటికి ఇవ్వాల్సిన బాధ్యత రాజ్యాంగరీత్యా కేంద్రం తీసుకుంటుంది” అని ఆనాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. దానిని మినిట్స్‌లో కూడా చేర్చారు. అసలు జీఎస్టీ చట్టంలో ఎక్కడైనా యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ అనే పదం ఉందా? ఇది కేవలం కమర్షియల్‌ కాంట్రాక్టుకు వర్తిస్తుంది. రాజ్యాంగ సవరణ ద్వారా, పార్లమెంటు చట్టం ద్వారా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య కుదిరే చట్టాలకు యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ వర్తించదు. ఇది అర్థరహితం. కానీ, కేంద్ర మంత్రి దీనికి యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ వర్తిస్తుందని పేర్కొనడం ఆశ్చర్యకరం. ఆర్బీఐ దగ్గర కేంద్రానికి పరపతి అధికం. కానీ, కేంద్రం మాత్రం తాను అప్పు తీసుకోననడం ఒక రకంగా భారత ఫెడరల్‌ వ్యవస్థకు తూట్లు పొడవడం అవుతుంది. భవిష్యత్తులో ఏ రాష్ట్రమైనా కేంద్రాన్ని నమ్మగలుగుతుందా? రాజ్యాంగ ఉల్లంఘనకు కేంద్రమే పాల్పడితే ఎలా అన్నదే ఇక్కడ ప్రశ్న.

Courtesy Nava telangana

Leave a Reply