ఏవి ఉచితాలు?

0
29

దీపా సిన్హా

భారత దేశ రాజకీయాలలో ‘ఉచితాల’ గురించి దేశంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న పెద్దలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జులై 16న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్‌ లో ఒక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ‘ఉచితాలు’ వాగ్దానాలు చేసే ‘రేవారి సంస్కృతికి’ యువకులు ఆకర్షితులై మోసపోవద్దని హెచ్చరించారు. ‘ఉచితాలు’ ఇస్తామని ఓట్ల కోసం వాగ్దానాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇది దేశాభివృద్ధికి ముప్పు, ప్రమాదమని అన్నారు.

కొన్ని రోజుల అనంతరం…ఒక ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ, ఎన్నికల ప్రక్రియను తప్పుదోవ పట్టించే ‘అహేతుకమైన ఉచితాల’ వాగ్దానాలకు వ్యతిరేకంగా పిటీషనర్‌ వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని (పిల్‌) విన్నారు. వాదనలు జరుగుతున్న సమయంలో, ఆయన ‘ఉచితాలు’ చాలా తీవ్రమైన సమస్యగా తయారైందని వ్యాఖ్యానిస్తూ, ఎన్నికల ప్రచారం నిర్వహించే సందర్భంలో రాజకీయ పార్టీలు చేస్తున్న అదుపులేని ‘ఉచితాల’ ప్రకటనల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సమస్యకు తగిన పరిష్కారాలు ప్రతిపాదించే విషయంలో ఫైనాన్స్‌ కమిషన్‌ కూడా భాగస్వామ్యం కావాలని న్యాయస్థానం సూచించింది.

ఇంకా గందరగోళమే…
ఎన్నికల వాగ్దానాల ఫలితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్న ‘ఉచితాల’ లోని లోపాలపై జరుగుతున్న చర్చ భారతదేశానికి కొత్తేమీ కాదు. కానీ, ‘ఉచితాలు’ అంటే ఏమిటనే దానిపై ఇంకా గందరగోళం నెలకొంది. ప్రభుత్వం దేశ పౌరుల కోసం రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన సేవలను కూడా ఈ కేటగిరీ లోకే కలుపుతున్నారు. ఇవి వనరులను వృధా చేస్తున్నాయని, ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న ఆర్థిక వనరులపై మరింత భారం పడుతుందని.. ప్రధానమైన వాదన చేస్తున్నారు. ఇలాంటి చర్చల్లో ‘ఉచితాలు’ అంటే టెలివిజన్లు, బంగారు గొలుసుల లాంటి వస్తువులు మాత్రమే కాక ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) కింద ఉచిత లేదా సబ్సిడీలతో కూడిన రేషన్‌, మధ్యాహ్న భోజన పథకం కింద వండిన ఆహారం, అంగన్వాడీల ద్వారా అనుబంధ పోషకాహారంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా పనిని సమకూర్చడం.

ఆహార ధాన్యాల పంపిణీ
కానీ, అనేకమంది వ్యాఖ్యానిస్తున్నట్లుగా, ప్రభుత్వం చేస్తున్న ఈ ఖర్చులను ‘ఉచితాలు’ గా పరిగణించవచ్చా? ఉదాహరణకు, అనేక మంది ప్రజల జీవితాలను, వారి జీవనాధారాలను సర్వనాశనం చేసిన కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో భారత ఆహార సంస్థ గోడౌన్లలో 100 మిలియన్ల టన్నులకు పైగా బియ్యం, గోధుమల నిల్వ ఉన్నపుడు ఈ ఆహార ధాన్యాలను ఉచితంగా చేసిన పంపిణీని కూడా ‘ఉచితాల’నే అంటారా? ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు, ”ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన” (పీఎంజీకేఏవై) కింద ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా ‘ప్రపంచం లోనే’ అతి పెద్ద ఆహార భద్రతా కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం గురించి పదేపదే ప్రచారం చేసుకున్నారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో ఆకలి ప్రమాదం నుంచి అనేకమందిని దూరం చేసింది ఈ ‘ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన’. ఉచిత లేదా సబ్సిడీలతో కూడిన ఆహారధాన్యాల అవసరం ఉన్న అనేకమంది రేషన్‌ కార్డుల జాబితాలో మినహాయించబడ్డారు కాబట్టి ఈ ‘పీఎంజీకేఏవై’ ని రేషన్‌ కార్డులు లేని వారికి కూడా వర్తించేలా విస్తరింపజేయాలి. కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ పేదరికం పై అనుకూల ప్రభావాన్ని చూపిందని తెలియజేసే అధ్యయనాలు ఉన్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయబడుతున్న సబ్సిడీ ఆహార ధాన్యాలు మౌలిక ఆహార భద్రతకు హామీ ఇవ్వడమే కాక తాము సమకూర్చుకోలేని వస్తువులను కొనుగోలు చేయడానికి వీలు కల్పించే అవ్యక్త ఆదాయ బదిలీగా కూడా ప్రజలకు తోడ్పడుతుంది. కనీస మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించడమనేది రైతులకు ప్రయోజనకరంగా ఉన్న మన దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది. రైతులకు లాభదాయకమైన ధరలకు భరోసా కల్పిస్తూ, వినియోగదారులు చౌకగా ఆహార ధాన్యాలను పొందడానికి ప్రజా పంపిణీ వ్యవస్థ అనుమతిస్తుంది.

ప్రజా పంపిణీ వ్యవస్థ, ఉపాధిహామీ చట్టం
సుమారుగా 2000 నుంచి, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి విస్తరించడం, ధరలను తగ్గించడంతో ఇది ఒక రాజకీయ సమస్యగా మారింది. ఇంతకు ముందు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థలోని ధరల తగ్గుదల కూడా ఎన్నికల సమస్యగా మారింది. 2009 లో జరిగిన సాధారణ ఎన్నికలతో పాటు 2000 దశాబ్ది మధ్య కాలం నుంచి చివరి దాకా దాదా పు అన్ని రాజకీయ పార్టీలు వారి ఎన్నికల ప్రచారంలో ఇలాంటి వాగ్దానాలను చేశాయి. ఇది చివరకు, 2013లో పార్లమెంట్‌ ఏకగ్రీవంగా జాతీయ ఆహార భద్రతా చట్టం ఆమోదించడానికి దారి తీసింది. దీనిలో లోపాలు ఉన్నప్పటికీ, దేశంలోని మూడింట రెండొంతుల ప్రజలకు కరోనా మహమ్మారి వ్యాప్తి కాలంలో జాతీయ ఆహార భద్రతా చట్టం లేకుండా, పీఎంజీకేఏవై మరియు దాని మద్దతు సాధ్యమయ్యేది కాదనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా విస్తరించడంతో మినహాయింపులకు చెందిన దోషాలు (మొత్తం కాకపోయినా) వాటంతటవే తగ్గి పోయాయి. సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ మనను మన లక్ష్యానికి దగ్గరగా కూడా చేర్చుతుంది.

ప్రభుత్వ సబ్సిడీ భారాన్ని పెంచుతుందని అదే పనిగా విమర్శిస్తున్న ఇతర సంక్షేమ పథకాలు కూడా మానవ అభివృద్ధికి, పోషకాహారం, పని మొదలగు వాటిపై ప్రజల మౌలిక హక్కుల సంరక్షణకు, ముఖ్యంగా గౌరవంగా జీవించే హక్కుకు దోహదం చేస్తాయి. ఉదాహరణకు, కరోనా మహమ్మారి వ్యాప్తి కాలంలో, అంతకుముందు కాలంలో కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేకమంది ప్రజలకు జీవనాధారంగా ఉంటూ వస్తున్న మరొక పథకం. ఒకవేళ ఈ చట్టం వాస్తవమైన స్ఫూర్తితో అమలు చేసినట్లైతే ఇది కూడా డిమాండ్‌ ఆధారిత పథకమే.

అదేవిధంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల్లో విద్యార్థుల చేరికల నమోదు పెరుగుదలకు మరియు తరగతి గదుల్లో పిల్లల ఆకలి సమస్య పరిష్కారానికి దోహదం చేసిందని రుజువైన పథకం. వృద్ధాప్య, ఒంటరి మహిళలు, వికలాంగుల పెన్షన్లు, పట్టణ ప్రాంతాల్లో కమ్యూనిటీ వంటశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఉచిత యూనిఫాం దుస్తులు, పాఠ్య పుస్తకాలు మరియు ఉచిత వైద్య సేవల లాంటి ఇతర అనేక పథకాలు…మన దేశంలో సామాజిక భద్రత, మౌలిక సదుపాయాల కల్పనలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. వాస్తవానికి ఈ పథకాలలో అనేక లోపాలున్నాయి. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా విస్తరించాలి. ఎక్కువ వనరుల కేటాయింపులు జరగాలి. జవాబుదారీతనం, సమస్యల పరిష్కారానికి యంత్రాంగాలను పెంచాల్సిన అవసరం ఉంది.

దృష్టి కోణం…
ప్రభుత్వ జోక్యాలను ‘ఉచితాలు’గా పేర్కొనడం ద్వారా వాటి ప్రాధాన్యతలను బలహీన పరచడం, పేదలను అనుత్పాదకులుగా, దయాదాక్షిణ్యాలపై ఆధారపడే వారిగా పరిగణించే మన సమాజం లోని శ్రేష్ఠత్వాన్ని బహిరంగం చేస్తుంది. వాస్తవానికి ఇక్కడ సమస్య ఏమంటే, రాజకీయ ప్రక్రియలో ఇలాంటి సమస్యలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సంక్షేమ పథకాలను ఎన్నికల అంశంగా మార్చి ప్రజల నుంచి ఒత్తిడి పెంచడమే ప్రస్తుత అవసరం. మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లు అందించాలా, వద్దా? ఉపాధి హామీ పథకం కింద ఎన్ని రోజుల పనిని సమకూర్చుతారు? ఉచితంగా మందులు పొందే పథకాలు, లేదా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సబ్సిడీ ఆహార ధాన్యాల ధర ఎంత? అనే అంశాలపై, మెజారిటీ ప్రజల అవసరాలకు ప్రతిస్పందనగా చేసే చర్చ ఎన్నికల ప్రజాస్వామ్యంలో సానుకూలమైన సూచికలుగా ఉంటాయి. అనేక సంక్షేమ పథకాలు, మానవాభివృద్ధి ఫలితాల్ని మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి. దీని ఫలితంగా భవిష్యత్తులో ఆర్థిక వృద్ధి బాగా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రక్రియ ‘నిష్ప్రయోజనం’ అనిపిస్తుంది, అయితే వాటిని పూర్తిగా కాదనకుండా ఖచ్చితంగా చర్చించాలి.

అసలు, ‘ఉచితాన్ని’ ఎలా నిర్వచించాలి? కార్పొరేట్‌ టాక్స్‌ చెల్లింపుదారులకు భారీగా టాక్స్‌ ప్రోత్సాహకాలు ప్రకటించిన ఫలితంగా సంవత్సరానికి దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతుంది ప్రభుత్వం. అన్ని పన్నుల మినహాయింపులు…విదేశీ వాణిజ్య, వ్యక్తిగత ఆదాయ పన్నుల రాయితీలను అన్నింటినీ కలిపితే…సంవత్సరానికి ప్రభుత్వం కోల్పోతున్న ఆదాయం ఐదు లక్షల కోట్ల రూపాయలు. పైగా కార్పొరేట్‌ పన్నుల రేట్లు తగ్గుతూ ఉన్నాయి. 2019-2020 సంవత్సరంలో లాభాల రేటు పెరిగితే, పన్ను రేట్లు తగ్గినట్లు మన బడ్జెట్‌ పత్రాలు తెలియజేస్తున్నాయి. కానీ ప్రధాన స్రవంతిలో జరుగుతున్న చర్చల్లో ఈ రాయితీల సమర్థన గురించి ఎక్కడా మనకు ఒత్తిడి కనిపించదు. ఒక వ్యవస్థ ద్వారా పేదలకు ఇచ్చే కొద్దిపాటి మొత్తాలను ”ఉచితాలు” అంటున్నారు. కానీ తక్కువ పన్ను రేట్లు, మినహాయింపుల పేరుతో నిత్యం ధనవంతులు పొందుతున్న ఉచితాలను మాత్రం ”ప్రోత్సాహకాలు” అంటున్నారు. ఇది మన దేశంలోని ప్రజాస్వామ్య స్వభావం యొక్క ప్రతిబింబం తప్ప మరొకటి కాదు.

(వ్యాసకర్త ఢిల్లీలోని డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ యూనివర్సిటీలో అధ్యాపకురాలు)

Leave a Reply