ఏదీ నిర్భయ నాటి ప్రజాగ్రహం?

0
175
రాజ్‌దీప్‌ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

‘ఇత్నాసన్నాట క్యోం హై భాయి?’ (ఎందుకు అంత మౌనంగా ఉన్నారు?) – షోలే సినిమాలో ఒక విషాద ఘట్టంలో అంధుడైన తాత పాత్రలో నటుడు ఎకె హంగల్ అడిగిన ప్రశ్న అది. బిల్కిస్ బానో కేసులో ఆటవిక లైంగిక దురాగతానికి పాల్పడినవారి యావజ్జీవ శిక్షను తగ్గించి, జైలు నుంచి విడుదల చేసి, స్వాగతించి, సత్కరించిన వైనంతో దేశ ప్రజల (కనీసం న్యాయాన్యాయాల గురించి నిష్పాక్షికంగా ఆలోచించేవారి) మానసిక స్థితిని ఆ ప్రశ్న ప్రతీకాత్మకంగా ప్రతిబింబించడం లేదూ? కొవ్వొత్తులతో ప్రదర్శనలు లేవు, ధర్నాలు లేవు, వీధుల్లో నిరసనలూ లేవు. అయితే, పది సంవత్సరాల క్రితం (నిర్భయగా జాతి స్మృతిలో నిలిచిపోయిన) జ్యోతి సింగ్ మూకుమ్మడి అత్యాచారానికి, రాక్షస హత్యకు గురైనప్పుడు ఆసేతు శీతాచలం కనిపించిన దృశ్యాలు అవే కావూ? మరి, గుజరాత్ ప్రభుత్వ క్షమాభిక్ష కమిటీ నిర్ణయం మేరకు మన స్వాతంత్ర్య అమృత దినోత్సవం నాడు బిల్కిస్ బానో కేసులో నేరస్థులకు స్వేచ్ఛ కల్పించినప్పుడు, 2012 శీతాకాలంలో పౌర సమాజాన్ని మొక్కవోని సమరశీలతతో సమష్టిగా ఉద్యమింప చేసిన ఆగ్రహావేశాలు మళ్లీ ఎందుకు వ్యక్తం కాలేదు? అధికార నడవాలలో నిశ్శబ్దత ఎందుకు రాజ్యమేలింది?

‘భారత భాగ్య విధాత’తో మన విచారణను ప్రారంబిద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న ఎర్రకోట బురుజు నుంచి జాతి నుద్దేశించి ప్రసంగిస్తూ ‘నారీశక్తి’ గురించి స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చారు. మహిళలను గౌరవించకపోతే ఏ దేశమూ పురోగమించలేదని దేశ పౌరులకు గుర్తు చేశారు. మోదీ ఇలా మాట్లాడిన కొద్ది గంటలకే గుజరాత్‌లోని ఒక జైలు నుంచి, బిల్కిస్‌పై అత్యాచారానికి పాల్పడి, ఆమె పసి బిడ్డతో సహా కుటుంబ సభ్యులు పలువురిని హతమార్చిన ఆటవిక కామాంధులను విడుదల చేశారు. గోధ్రాలోని విశ్వహిందూ పరిషత్ విభాగం, వారిని పూలామాలాంకృతులను చేసి ధీరోదాత్తులుగా స్వాగతించింది! స్వేచ్ఛ పొందిన ఆ నేరస్థులలో ఏ ఒక్కరూ ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. క్షమాభిక్ష కమిటీలో సభ్యుడుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ‘సంస్కారి’ బ్రాహ్మిణులని వారిని ఘనంగా ప్రస్తుతించాడు! ఈ నేరస్థుల విడుదల వ్యవహారంపై మోదీ ప్రభుత్వం ఒక్క మాటా మాట్లాడలేదు. కారణమేమిటి? అధికార దురహంకారమా? 2002 నాటి పరిణామాలను పునర్దర్శించడం మహా ఇబ్బందికర విషయమనా?

సీనియర్ మంత్రులు ఎవరూ పెదవి విప్పలేదు. వాక్చాతుర్యం ప్రదర్శించే బీజేపీ అధికార ప్రతినిధులు ఎవరూ ప్రతిస్పందించనే లేదు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కానీ, ఆ రాష్ట్ర బీజేపీ నాయకులలో ఏ ఒక్కరు గానీ ఏమీ మాట్లాడనేలేదు. స్మృతి ఇరానీ అయినా గళం విప్పారా? ఊహూ, లేదే! ధారాళమైన ఆమె వాక్ ప్రవాహం ఏ వైపునకు వెళ్లిపోయిందో? జాతీయ మహిళా కమిషన్ నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పొరపాటున ‘రాష్ట్రపత్ని’గా ప్రస్తావించినప్పుడు ఆ ప్రభుత్వ సంస్థ ఎంతగా మండిపడింది! విశ్వహిందూ పరిషత్‌వారు ఆ నేరస్థులకు దండలు వేసి స్వాగతించిన తీరు ఈ ‘సర్కారీ’ సంస్థకు ఎందుకు పట్టలేదో? గర్హించవలసిన నేరస్థులను గౌరవించడమేమిటని ఎందుకు ప్రశ్నించలేదు?

నిర్భయ కేసులో న్యాయ విచారణ ప్రక్రియ సత్వరమే పూర్తయ్యేలా శ్రద్ధ వహించిన సుప్రీంకోర్టు ఇప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎలాంటి చిక్కులు ఎదురవ్వకుండా జాగ్రత్త పడుతోంది. బిల్కిస్ బానో రేపిస్టులకు శిక్ష మాఫీ చేసే విషయాన్ని గుజరాత్ ప్రభుత్వ విచక్షణకు వదిలివేస్తూ గత మేలో దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 1992 నాటి క్షమాభిక్ష విధానం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించింది. అయితే ఆ విధానంలోని పలు అంశాలకు కాలం చెల్లిపోయింది. 2014లో రూపొందించిన కొత్త విధానం ప్రకారం నేర నిర్ధారణ అయిన రేపిస్టులకు జైలు శిక్ష మాఫీ చేయడానికి వీలు లేదు. ఇక 2012లో నిర్భయ ఘటనలను సంపూర్ణంగా కవర్ చేసిన మీడియా బిల్కిస్ విషయంపై శ్రద్ధ పెట్టలేదు. ఆ నిస్సహాయురాలికి న్యాయం జరగవలసిన అవసరాన్ని నొక్కి చెప్పలేదు, కాదు, అసలు గుర్తించనే లేదు. బిల్కిస్ కేసు తీర్పుపై ప్రైమ్ టైమ్ చర్చలు లేవు, కలకలం రేపే సంపాదకీయాలు లేవు.

పౌర సమాజం, ముఖ్యంగా పట్టణ మధ్యతరగతి మహాజనుల విషయమేమిటి? ఒక దశాబ్దం క్రితం నిర్భయ ఉద్యమ సందర్భంగా వీరు తమ ఉదాసీనతను విడనాడి వీధి ప్రదర్శనలలో అంతర్భాగం కాలేదూ? జాతీయ రాజధానిలో ఒక కదులుతున్న బస్సులో చోటు చేసుకున్న ఒక మూకుమ్మడి అత్యాచారం కదిలించినట్టుగా గుజరాత్ మతతత్వ అల్లర్లలో సంభవించిన ఒక రాక్షస అత్యాచారం, వరుస హత్యల దుర్మార్గం వీరి ‘సమష్టి అంతరాత్మ’ను ఎందుకు కల్లోలపరచలేదు? 2002లో రథికాపూర్ అనే మార్మూల గ్రామంలో సంభవించిన ఘోర అఘాయిత్యం ‘నవ’ భారతదేశ జ్ఞాపకాల తీరానికి చాలా చాలా దూరాన సంభవించినది కావడం వల్లే శ్రద్ధ పెట్టడాన్ని ఉపేక్షించారా? ఏదో ఒక నిరసన పిటిషన్‌లో సంతకం చేస్తే చాలదా అని అనుకున్నారా? ఇంతటి నిర్లిపత్త వారిని ఎందుకు ఆవహించింది?

జ్యోతి సింగ్ విషాదం, న్యాయం కోసం బిల్కిస్ చేస్తోన్న అంతులేని పోరాటం పట్ల భిన్న ప్రతిస్పందనలు గత దశాబ్దంలో దేశ రాజ్య వ్యవస్థ, పౌర సమాజం ఎంతగా మార్పు చెందాయో స్పష్టంగా వెల్లడించాయి. మెజారిటీ వాద రాజకీయాలు అసమ్మతి స్వరాలను అణచివేస్తున్నాయి. పాలక వర్గాల కథనాలను ప్రశ్నించే వారిని సహించే పరిస్థితి పూర్తిగా కొరవడింది. పంచాయత్ నుంచి పార్లమెంటరీ ఎన్నికల దాకా ఎటువంటి ప్రయోజనం పొందాలన్నా హిందూ అస్తిత్వాన్ని సుసంఘటితం చేసుకోవడమే ఏకైక మార్గమన్న విశ్వాసం పాదుకొనిపోయింది. ఓటు బ్యాంకు రాజకీయాలతో రాజకీయ నైతికత పూర్తిగా హరించుకు పోయింది. 1980ల్లో సమానహక్కుల కోసం పోరాడిన ఒక ముస్లిం మహిళ పక్షాన నిలవడంలో విఫలమయిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు ముస్లిం మతాచార్యులను బుజ్జగించింది. లౌకిక వాద భారతదేశ నిర్మాణ లక్ష్యాలకు షా బానో కేసు తీవ్ర విఘాతం కలిగించింది. బీజేపీ ప్రభవ ప్రాభవాలకు అది తొలి మెట్టు అయింది. ఇప్పుడు చరిత్ర మళ్లీ మొదటికొచ్చింది. మెజారిటీ వర్గం వారిని బుజ్జగించే రాజకీయాలను బీజేపీ ప్రతిభావంతంగా ఆచరిస్తోంది. న్యాయం కోసం మరో ముస్లిం మహిళ అవిరామంగా చేస్తోన్న పోరాటాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఎన్నికల ప్రయోజనాలకే ఈ పాలక పార్టీ ప్రాధాన్యమిస్తోంది.

అమానుష నేరాల బాధితులకు సహాయం సమకూర్చేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ సంస్థలు నిరంకుశంగా ప్రవర్తిస్తున్న పాలకులతో రాజీ పడ్డాయి. సుప్రీంకోర్టు సూచన మేరకు గుజరాత్ ప్రభుత్వం నియమించిన క్షమాభిక్ష కమిటీ అధికార పక్ష ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చింది. ఆ కమిటీలో సభ్యులుగా ఉన్న ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు న్యాయబద్ధంగా వ్యవహరించేందుకు ఆస్కారమే లేదు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో బిల్కిస్ నిస్సహాయురాలుగా మిగిలింది. అయితే పాలకుల పాక్షిక, న్యాయవిరుద్ధ వైఖరిని ధిక్కరించింది. మరి ఆమె వాదనలను న్యాయవ్యవస్థ నిష్పాక్షికంగా పరిగణనలోకి తీసుకుంటుందా? అందుకు అవకాశాలు దాదాపుగా లేవు. నేరస్థుడు ఒకరికి న్యాయస్థానం విధించిన ఒక శిక్షను తగ్గించాలన్నా లేదా మాఫీ చేయాలన్నా అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని 2016లో రాజ్యాంగ ధర్మాసనం ఒకటి రాజీవ్ గాంధీ హంతకులకు సంబంధించిన ఒక కేసులో సూచించింది. మరి బిల్కిస్ ఘోర ఉదంతంలోని నేరస్థులను కేంద్ర ప్రభుత్వ సమ్మతి లేకుండానే విడుదల చేశారా? ఈ న్యాయవిరుద్ధ చర్యకు బాధ్యత ఎవరిది? జరిగిన అపరాధం నుంచి అధికార పక్షం తప్పించుకోగలదా? సత్యమేమిటంటే అతి విధేయ అధికార గణం, బలహీనపడిన న్యాయవ్యవస్థ, భజనపరత్వంతో మనుగడ సాగిస్తున్న మీడియాతో విచక్షణారహితంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కార్యనిర్వాహక వర్గాన్ని అదుపు చేయడమనేది అసాధ్యమై పోయింది.

బిల్కిస్ బానోకు న్యాయం సమకూర్చేందుకు జరుగుతోన్న ఉద్యమంలో తమ గొంతు వినిపించేందుకు ప్రభావశీల ప్రాబల్యాలు గల పౌరులు ఎందుకు భయపడుతున్నారు? 2012లో స్వతస్సిద్ధంగా ప్రజ్వరిల్లిన తిరుగుబాటుకు ఇచ్చిన విధంగా ఆమె న్యాయపోరాటానికి మద్దతు ఇవ్వడానికి వెనుకాడుతున్నారెందుకు? పది సంవత్సరాల కాల గమనంలో మంచి, చెడుల గురించి వివేచించడంలో మారిపోయిన ప్రజా వైఖరులు ఒక విభజిత సమాజాన్ని ప్రతిబింబిస్తున్నాయి. తీవ్ర హానికర దురభిమానాలు, సంపూర్ణ మత సంకుచితత్వ సులోచనాల ద్వారానే ప్రతి అంశాన్ని చూడడమనేది స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న భారతీయ సమాజంలో అంతకంతకూ పెరిగిపోతోంది. మరి న్యాయాన్ని గురించి ఇటువంటి వారి భావనలు అందుకు విరుద్ధంగా ఉంటాయా? ధర్మ బద్ధత అనేది పాక్షికమైపోయింది. కనుకనే బిల్కిస్ దుస్థితిని మతపరంగా కాకుండా మానవతా దృష్టితో చూడలేక పోతున్నారు. ఆ నిస్సహాయురాలు చవిచూసిన అమానుష నేర పరిపూర్ణ పాశవికతను ఉపేక్షించి ఆమె ముస్లిం అస్తిత్వాన్నే మన సమాజం పరిగణనలోకి తీసుకున్నది. మరి న్యాయం దుర్లభమవకుండా ఎలా ఉంటుంది?

సరే, ఒక హిందూ మహిళ అత్యాచారానికి, చిత్ర వధకు గురైనప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? సామాజిక మాధ్యమాలలో కరడుగట్టిన మితవాదులు తరచు అడుగుతున్న ప్రశ్న అది. 2012లో ధర్మాగ్రహంతో ఊగిపోయిన భారతీయ సమాజ ఆదర్శప్రాయ న్యాయనిరతి స్థానంలో ఇప్పుడు ఒక నిగూఢ ప్రయోజనాన్ని ఆశిస్తున్న స్వార్థపర, హేతు విరుద్ధ వైఖరి దృఢంగా పాదుకుపోయింది. మన మనసులు సంకుచితమై పోయాయి. వికృత లక్ష్యాలే మనలను నడిపిస్తున్నాయి. ఈ అసహ్యకర ఆలోచనా ధోరణులకు బిల్కిస్ ఒక బాధితురాలు. వాటికి ఆమే ఆఖరి బలిపశువు కాదు. ఇది, మరింత వ్యాకుల పరిచే వర్తమాన వాస్తవం.

Leave a Reply