న్యూస్‌ టీవీ పతనానికి కారణం ఎవరు?

0
48

అనింద్యో చక్రవర్తి

నేనురెండు దశాబ్దాల పాటు ఎన్డీ టీవీలో పని చేశాను. ఇప్పటికీ అక్కడి అభిప్రాయ వేదికలో వ్యాసాలు రాస్తూనే ఉంటాను. కాబట్టి ఎన్డీ టీవీని కొనేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి నేను ఏమి రాసినా అది ఏకపక్షంగానే ఉంటుంది. ఆ అంశంపై నిష్పాక్షికంగా వ్యాఖ్యానించగలవాళ్ళు రాస్తేనే బాగుంటుంది. నేను ఇక్కడ మరింత విస్తృతమైన అంశం గురించి రాయదల్చుకున్నాను. భారతీయ వార్తా మాధ్యమాల్లోకి, ముఖ్యంగా జాతీయ స్థాయి ఇంగ్లీష్‌ టీవీ వార్తా మాధ్యమాల్లో, వ్యాపార సంస్థలు చొరబాటు గురించి రాయదల్చుకున్నాను. ఇది పాత్రికేయాన్ని శక్తివిహీనం చేసింది. దాన్ని ఒక అంగడి సరుకుగా మార్చింది. నేను ఎవరి వైపో వేలెత్తి చూపటం లేదు. టీవీ న్యూస్ ఇలా హత్యకు గురవటంలో నా తప్పు ఎంతుందో ఆత్మ పరిశీలన చేసుకోవాలనుకుంటున్నాను.

నేను 1999లో నెలకి రూ.10వేల జీతంతో ఎన్డీ టీవీలో చేరాను. 2004 కల్లా నా జీతం నెలకు రూ.85వేలకు చేరింది, ఒక కారు కూడా ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ బూమ్ నడుస్తున్న రోజులవి. (2008లో ఆర్థిక మాంద్యం వల్ల కుప్ప కూలేదాకా ఈ బూమ్ అలాగే కొనసాగింది.) ఆ రోజుల్లో మీడియా కంపెనీలు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించాయి. పెద్ద ఎత్తున సంపదను పెంచుకున్నాయి.

అప్పటికే టీవీ న్యూసులో ముఖం కనపడుతూ ప్రసిద్ధులైనవారికి డిమాండు బాగా పెరిగింది. వీరిలో ఎన్డీ టీవీ సభ్యులూ ఉన్నారు. వీరిని తమ వైపు చేర్చుకొని కొత్త న్యూస్ ఛానెళ్లు మొదలు పెట్టేందుకు తక్కిన మీడియా హౌసులు ప్రయత్నించాయి. పని మాత్రం చేసే భాగస్వాములుగా వీరు అక్కడ చేరారు. వీరి ‘sweat equity’ (శ్రమ భాగస్వామ్యం) విలువ కోట్లల్లో పలికింది. ఈ కొత్త న్యూస్ ఛానెళ్లకు తొలి అడుగులు వేసే క్రమంలో ఉద్యోగ సమూహం అవసరమైంది. అప్పటికే స్థిరపడిన న్యూస్ ఛానెళ్ళలోని ఉద్యోగుల కోసం వేట మొదలైంది. నాకూ అలాగే ఒక కొత్త న్యూస్ ఛానెల్ నుంచి పిలుపు వచ్చింది. ఒకేసారి నా హోదా పెరిగింది, సీనియారిటీ పెరిగింది, జీతమైతే ఏకంగా మూడింతలైంది.

ఎన్డీ టీవీతో సహా పాత న్యూస్ నెట్‌వర్కులన్నీ తమ ఉద్యోగుల్ని కాపాడుకోవటానికి ఈ కొత్త కంపెనీల జీతాల ప్యాకేజీలతో పోటీ పడాల్సి వచ్చింది. రాత్రికి రాత్రే జీతాల బిల్లులు రెట్టింపయ్యాయి. 2005 మధ్యలో ఏర్పడిన ఈ పరిస్థితి– టీవీ న్యూస్ సంస్థల స్థిరత్వాన్ని శాశ్వతంగా దెబ్బతీసింది. ఎందుకంటే ఈ సంస్థలు ప్రింటు మీడియా కంటే తక్కువ సంపాదిస్తూ కూడా ప్రింటు మీడియా కంటే ఎక్కువ జీతాలివ్వాల్సిన పరిస్థితిలో పడ్డాయి.

ఒక్కసారి కార్పొరేట్ స్థాయి జీతాలకు అలవాటుపడిన ఉద్యోగులు ప్రతి ఏటా జీతాల్లో భారీ పెరుగుదలను ఆశించారు. వాళ్లకు ఈ విషయంలో సీనియర్ ఎడిటర్లే ఆదర్శంగా కనపడ్డారు. వారిలో కొందరు సీఈఓ స్థాయి జీతాలు అందుకుంటున్నారు.

ఈ దశలో రోజుకొక కొత్త ఛానెల్ పుట్టుకొచ్చింది. పని తెలిసిన వాళ్లు మాత్రం తక్కువమంది ఉన్నారు. ఒక ఎడిటరుగా నా సమయంలో సగం ఉద్యోగుల్ని కాపాడుకోవటానికీ, పెద్ద జీతాలకు ఆశపడి వెళ్ళిపోకుండా వాళ్లని బుజ్జగించటానికీ కేటాయించాల్సి వచ్చింది. ఉద్యోగులను ఆపాలంటే మిగిలిన ఒకే ఒక్క ఉపాయం వాళ్ల పని ఒత్తిడిని బాగా తగ్గించటం. దాంతో అదే పనికి ఎక్కువమంది ఉద్యోగులు కావాల్సి వచ్చారు.

2007 నాటికి కొత్తగా జర్నలిజంలో చేరేవాళ్లకి అంతకు రెండేళ్ళ క్రితం కంటే మూడు రెట్లు ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల మధ్య జర్నలిస్టుల జీవనశైలి మారింది. ఎగువ మధ్య తరగతి నుంచి సంపన్న వర్గానికి వారు బదిలీ అయ్యారు. వాళ్ల ఇళ్లల్లో దేశవిదేశాల నుంచి ఏరి తెచ్చిన అపురూప వస్తువులు కనపడటం మొదలైంది. గుడ్ ఎర్త్ మగ్గుల్లో టీలు తాగారు. లాల్చీ పైజమాలు పోయి సూటూ బూటూ వచ్చాయి.

ఈ దశలో నిజానికి న్యూస్ ఛానెళ్లు బ్రేక్ ఈవెన్ సాధించటానికి ఎంతో కష్టపడుతున్నాయి. ఎంతో లాభసాటి ఛానెళ్లు కూడా పెట్టుబడికి తగిన రాబడి లేక ఇబ్బంది పడుతున్నాయి. చాలా ఛానెళ్లు నష్టాలతో నెట్టుకొస్తున్నాయి. అవి మనుగడ సాధించాలంటే ఉన్న ఏకైక మార్గం భాగస్వాముల రూపేణా, ఋణాల రూపేణా డబ్బు కూడగట్టుకోవటం. కానీ భాగస్వాములై పెట్టుబడిపెట్టే వాళ్ళకు న్యూస్ ఛానెళ్లు లాభం తెస్తాయన్న నమ్మకం లేదు. దాంతో న్యూస్ నెట్‌వర్కు అధినేతలు పెట్టుబడిదారులను, భాగస్వాములను ఆకర్షించటానికి వినోదాత్మక కార్యక్రమాల వైపుకు మళ్లారు. స్టాక్ మార్కెట్లో నమోదై ఉన్న కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ ఉవ్వెత్తున ఎగసింది.

అప్పుడే 2008 ఆర్థిక మాంద్యం పిడుగులా వచ్చి పడింది. ప్రపంచ వ్యాప్తంగా దాని ప్రభావం వ్యాపించింది. టీవీ న్యూస్ నెట్‌వర్కుల మార్కెట్ విలువ కుప్పకూలింది. దాని ఫలితంగా వాళ్లు తమ ఆస్తులను చూపి అప్పులు పుట్టించే స్తోమతను కోల్పోయారు. మార్కెట్ పెట్టుబడులపై ఆశ వదిలేసుకొని రెవెన్యూ పెంచుకోవటంపై దృష్టిపెట్టాల్సి వచ్చింది. ఈ దశలోనే జర్నలిజానికీ, రేటింగులకీ మధ్య అప్పటికే ఏర్పడిన సమస్యాత్మక సంబంధం మరింత విషపూరితంగా మారింది.

భారీయెత్తున జీతాలు తీసుకుంటున్న సీనియర్ జర్నలిస్టులు వాటిని కాపాడుకోవటానికి రేటింగులు పెంచే విధంగా వార్తల్ని అల్లటానికి సిద్ధపడ్డారు. ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేయాలంటే వార్తలు వినోదాత్మకంగా ఉండాలి. అంటే భావోద్వేగాలను రెచ్చగొట్టే, వినోదాన్ని పండించే అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆ విధంగా స్టార్ ఏంకర్లు శబ్ద కాలుష్యం ద్వారా రేటింగులు పెంచే కళలో నిష్ణాతులయ్యారు. మాటల యుద్ధాలు పెచ్చుమీరే ‘ఒపీనియన్ టీవీ’ ప్రైమ్ టైమును ఆక్రమించింది. ఛానెళ్లు ప్రయాణ ఖర్చుల్ని తగ్గించి, కొన్ని బ్యూరోలను మూసివేయటంతో వార్తా సేకరణ నాసిరకంగా మారింది.

ఈ పతనానికి లొంగకుండా ఎదురు తిరిగిన వాళ్ల రేటింగులు పడిపోయాయి, దాంతో రాబడులూ పడిపోయాయి. ఈ దశలో ఆ సంస్థలను చేజిక్కించుకోవటం ద్వారానో, అవి నిలదొక్కుకొనేందుకు ఆర్థిక సాయం అందించటం ద్వారానో పెద్ద పెద్ద కార్పొరేట్లు రంగంలోకి దిగారు. వార్తా పాత్రికేయం ఇలా కార్పొరేటు రంగు పూసుకోవటాన్ని సీనియర్ పాత్రికేయులందరూ గమనిస్తూనే ఉన్నారు. చాలామంది దీన్ని ఒప్పుకోవటమే కాదు, ఎదురెళ్ళి మరీ కార్పొరేట్ ప్రపంచానికి వంతెనలు వేసేందుకు ఉత్సాహ పడ్డారు. చాలాకొద్దిమంది మాత్రమే ఈ కార్పొరేట్ పెత్తనాన్ని ప్రశ్నించే సాహసం చేశారు. చివరికి వాళ్లు కూడా, పెద్ద ఫలితమేమీ లేని నిరసనల తర్వాత లొంగిపోయారు. ఎందుకంటే ఎవరి వల్ల కంచంలో అన్నం పడుతున్నదో వాళ్ళూ గుర్తించారు.

ఈ రోజు, న్యూస్ మీడియాపై కార్పొరేట్ అజమాయిషీ పరిపూర్ణమైంది. జర్నలిస్టులు తమ విలువను పెంచుకునే రద్దీలో పడి కొట్టుకుపోవటం, చివరకు మేనేజిమెంటు స్థాయి జీతాలకు ఆశపడటం తాలూకు ఫలితమిది. పాత్రికేయవృత్తి ఈ స్థితికి చేరిందంటే అందుకు పాత్రికేయులే బాధ్యత వహించాలి.

మాజీ సీనియర్ మేనేజింగ్ ఎడిటర్
ఎన్డీ టీవీ ఇండియా – ఎన్డీ టీవీ ప్రాఫిట్

Leave a Reply