ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉగ్రరూపం దాల్చింది. సమ్మె తెలంగాణలోని ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలను రంగంలోకి దించింది. సకలజనుల సమరభేరిగా ఉరకలు వేసింది. యావత్తు తెలంగాణ సమాజం బాసటగా నిలబడటంతో కార్మికులు వీరోచితంగా పోరాడుతున్నారు. కార్మికుల డిమాండ్లు కొత్తవేమీ కాదు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ ఉన్నవే. 2014 ఎన్నికలప్పుడు టీఆర్‌ఎస్ వాటిని తన ఎన్నికల హామీల్లోనూ చేర్చింది. ఆర్టీసీపై పడుతున్న పన్నుల భారాలను ప్రభుత్వమే తగ్గించుకొని సంస్థ నష్టాలను భరిస్తుందన్నారు. అదే వ్యక్తి నేడు నిర్లజ్జగా మాట మారుస్తున్నారు. సమ్మె చేస్తున్న కార్మికులను బెదిరించి అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతున్నారు. పోరాడుతున్న ఉద్యోగుల్ని లొంగతీసుకోవడం కోసం నానా యాగీ చేస్తున్నారు.
ఆర్టీసీ ఉండదని తెగేసి చెబుతున్నారు. కార్మికులది పిచ్చి పంథా, సమ్మెకు ముగింపు ఆర్టీసీని ముగించడమేనని మాట్లాడుతున్నారు. దిక్కుమాలిన సంఘాలనీ, సంఘాల మాటలు నమ్ముకొని రోడ్డెక్కిన ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా నష్టపోయారని కార్మిక సంఘాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయ లబ్ది కోసమే యూనియన్లు దిక్కుమాలిన సమ్మె చేస్తున్నాయనీ’ యూనియన్ల వల్లే ఈ దుస్థితి వచ్చిందనీ, ఆర్టీసీ భవితవ్యం తేలిపోయిందనీ, ఆ సంస్థను ప్రయివేటీకరించటం తప్పదని చెప్పేశారు. ఆర్టీసీపై ప్రేమ ఉండబట్టి నాలుగేండ్లలో కార్మికులకు జీతాలు 67శాతం పెంచామనీ, గొంతెమ్మ కోర్కెలు కోరితే ఎట్లా? అని ఆర్టీసీ ఉద్యోగులకు సగటున 50,000 జీతం ఇస్తున్నామని పచ్చి అబద్ధాలతో ఎదురు దాడికి దిగడం ఉద్యమనేతకు సమంజసమేనా?
జీతాలు ఇవ్వకుంటే హైకోర్టు కొడుతుందా? దిక్కుమాలిన యూనియన్లే ఆర్టీసీని ముంచాయని దుర్భాషలాడు తున్నారు. సంస్థ నష్టాల్లో ఉంది. జీతాలివ్వాలంటే మూడు డిపోలు అమ్ముకోవాల్సిందే నంటున్నారు. సంస్థకు 1400 ఎకరాల విలువైన భూమి ఉంది. దాని విలువ పెరిగిన మార్కెట్ ధరలో సుమారు రూ.60 వేల కోట్లు ఉంటుంది. దానిని తమ అనుయాయులకిచ్చి ప్రసన్నం చేసుకోదల్చు కున్నది. దేశంలో పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు దివాళా తీయడానికి, నష్టాలకు 98శాతం ప్రభుత్వ విధానాలు, యాజమాన్యాల అసమర్ధతే కారణమని ప్రభుత్వం నిర్వహించిన సర్వేలు వెల్లడించిన విషయం ముఖ్యమంత్రికి తెలియదా?
అసలు సంగతి ఆర్టీసీ ప్రయివేటీకరణకు ఈ ప్రభుత్వం కుట్ర పన్నింది. సమ్మెను ఆయుధంగా ఉపయోగించుకొని తన రహస్య ఎజెండా అమలు పర్చుకోవడానికి పూనుకుంది. ఆర్టీసీ ఆస్తుల్ని లీజు పేరిట మింగేస్తున్నారు. సర్వీస్ ప్రొవైడర్ రూపంలో పెట్రోల్ బంక్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కొల్లగొడుతున్నారు. ఆర్టీసీ నిర్వహించే 115 బంకుల్లో 56బంకులు అధికార పార్టీ నేతల గుప్పెట్లోనే ఉన్నాయి. ఆర్టీసీ ఆదాయంలో 60శాతం వారే కొల్లగొడుతున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలో బస్ భవన్ 10ఎకరాల స్థలాన్ని అన్యాక్రాంతం చేయడానికి పావులు కదుపు తున్నారు. ఆర్మూర్‌లో 700 గజాల స్థలాన్ని 33ఏండ్లు లీజుకిచ్చారు. కరీనంగర్‌జిల్లా కేంద్రంలో కోట్లాది విలువైన భూములను 66ఏండ్లు లీజుకిచ్చారు. వరంగల్‌లో నాలుగున్నర ఎకరాల భూమిని ఆర్టీసీ రీ-ట్రేడింగ్ సెంటర్ మూసేసి మరీ అధికార పార్టీ ఎంపీకి ధారాదత్తం చేశారు. ఇంకా వెలుగు చూడని నిజాలు మరెన్నో. ప్రపంచ బ్యాంకు నిర్దేశిత ఆదేశాలే నాడు చంద్రబాబు, నేడు చంద్రశేఖర్‌రావుల నోట వినబడుతున్నాయి. 50శాతం ఆర్టీసీ బస్సులు, 30శాతం అద్దె బస్సులు, 20శాతం ప్రయివేట్ బస్సులు తిరుగుతాయని ప్రకటించారు. ఇది ఆర్టీసీని పూర్తిగా ప్రయివేటీకరించడం కోసం కంకణం కట్టుకోవడమే. లాభాలొచ్చే 20శాతం రూట్లు ప్రయివేట్ సంస్థలకిచ్చి, 50శాతం ఆర్టీసీ బస్సులు సంపాదించే డబ్బులను 30శాతం అద్దె బస్సులకు కిరాయి చెల్లిస్తే ఆర్టీసీకి మిగిలేది ఆకలి – దప్పికలే.
ఆర్టీసీ వద్దు – ప్రయివేటే ముద్దు అనే పాట ఎత్తుకున్నారు. జబ్బార్, దివాకర్, కేశినేని ట్రావెల్స్‌కి లాభాలొస్తుండగా ఆర్టీసీకి నష్టాలెందుకొస్తున్నాయని ఎదురుదాడి చేస్తున్నారు. సమ్మె నుంచి ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నమే ఇది. ప్రయివేట్ ట్రావెల్స్ నడిపించే రూట్లు, ఆదాయమొచ్చే మార్గాలు, వారి బస్సుల కండీషన్లకు ఆర్టీసీ నడిపించే బస్సులకు నక్కకూ నాగలోగానికీ ఉన్నంత తేడా. ప్రయివేటు సంస్థలు లాభాపేక్షతో వ్యాపారం చేసే సంస్థలు. ఆర్టీసీ ప్రజా సంస్థ. ప్రయివేట్ బస్సులు ఆర్టీసీ వారు నడిపించే మారుమూల ప్రాంతాలకు, గిరిజన గూడేలకు, తండాలకు నడిపిస్తే అర్థమవుతుంది వారి లాభాల సంగతి. ప్రయివేట్ బస్సుల్లో రాయితీలుండవు.
ప్రభుత్వం అవాస్తవాలతో కూడిన గణాంకాలు చెప్పి అటు హైకోర్టును, ఇటు తెలంగాణ సమాజాన్ని తప్పు దారి పట్టించింది. ఆర్టీసీ ఉద్యోగులకు 50వేలకు పైగా జీతాలిస్తున్నామన్నారు. కానీ అత్యధిక సర్వీసు కల్గిన ఉద్యోగి నెల వేతనం రూ.32 వేలకు మించి రావడం లేదు. ఉద్యోగులు 6గంటలే పని చేస్తున్నారని, సంస్థ మనుగడ కోసం మరో రెండు గంటలు అదనంగా పని చేయలేరా? అంటూ ప్రజల ముందు ఆర్టీసీ ఉద్యోగుల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఆర్టీసీలో కొత్త నియామకాలు లేకపో వడంతో కార్మికులపై పనిభారం పెరిగింది. రోజుకు 12-14 గంటలు పనిచేస్తున్నారు. పని ఒత్తిడి భరిం చలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఉద్యోగులెందరో!
2014-15లో 56,740 మందిగా వున్న ఉద్యోగుల సంఖ్య 2019 ఆగస్టులో 49,733 మందికి, అంటే సుమారు 7,007 మంది తగ్గారు. సంఖ్య తగ్గడంతో వేతనాలపై ఖర్చు కూడా తగ్గింది. ఈ కాలంలో బస్సుల సంఖ్య తగ్గినప్పటికీ గతంలో తిరిగిన రోజుకి 34లక్షల కి.మీ.లకు బదులు 36లక్షల కి.మీ.ల దూరం బస్సులను అదనంగా తిప్పుతున్నారు. 2014-15లో రోజుకి 90లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానానికి చేరవేసిన కార్మికులు నేడు 97లక్షల మందిని చేర్చుతున్నారు. కానీ ప్రభుత్వరంగంలో ఆర్టీసీని బలోపేతం చేయాలన్న సంకల్పం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఆర్టీసీ నష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణం. మారిన పన్నుల విధానం వల్ల కూడా ఆర్టీసీపై భారం పడుతోంది. కొత్త బస్సులపై 14.25శాతం ఎక్సైజ్ డ్యూటీ ఉండగా, జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తరువాత అది 28శాతానికి పెరిగింది. బస్‌బాడీ తయారీ వస్తువులపై 5శాతం మాత్రమే వ్యాట్ ఉండగా అది నేడు 28శాతానికి పెరిగింది. పన్నుల భారం వల్ల ఆయిల్‌పై ఖర్చు ఆదాయంలో 26శాతం నుంచి 32శాతానికి పెరిగింది. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలకు డబ్బులు తిరిగి చెల్లించడం లేదు. 2018-19లో రూ.644.51 కోట్లు రాయితీల సొమ్ము ఆర్టీసీకి చెల్లించాల్సి ఉండగా, బడ్జెట్‌లో రూ.520కోట్లు ప్రతిపాదించి కేేవలం రూ.130 కోట్లు మాత్రమే చెల్లించారు. చెల్లించింది గోరంత, ప్రచారం కొండంత. గత ఐదేండ్లలో ఈ బకాయి రూ.2,802.74 కోట్లు. మోటార్ వెహికల్ ట్యాక్స్ రూపంలో రూ.1052 కోట్లు, పన్నుల రూపంలో రాష్ట్ర వాటాగా రూ.1234 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ సంస్థ నుంచి ఎదురు తీసుకున్నది.
నరేంద్రమోడీ తీసుకొచ్చిన కొత్త మోటారు వాహనాల చట్ట ప్రకారమే ప్రయివేట్ వాహనాలకు పర్మిట్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి అంటున్నారు. బీజేపీ వాళ్ళు చేసిందే తాము చేస్తున్నామంటున్నారు. ప్రయివేటీకరణ వస్తే పోటీతత్వం పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని సీఎం అంటు న్నారు. పార్లమెంట్‌లో మోటార్ వెహికల్ చట్ట సవరణ హృదయ పూర్వకంగా బలపర్చిన టీఆర్‌ఎస్ ఇప్పుడు ఆ సవరణల వల్లే ప్రయివేటికరిస్తున్నామని చెప్పడం ఎవరిని మోసం చేయడానికో ప్రజలు గమనించాలి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలన్నీ ప్రయివేటీకరణ విధానాలను బలపర్చి అమలు పర్చినవే అని గ్రహించాలి. ఆర్టీసీ నష్టాలకు పూర్తి బాధ్యత వహించాల్సింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే. కఠోర శ్రమ, త్యాగాలతో నేడు ఆర్టీసీని కాపాడుతున్నది కార్మికులు, యూనియన్లే.
– పాలడుగు భాస్కర్
సెల్: 9490098033