పీఎం కేర్స్ నిధులకు యజమాని ఎవరు?

0
632

– స్మతీ కొప్పీకర్‌

పీఎం కేర్స్‌ నిధిని ఏర్పాటు చేసిన 18నెలల్లో దాని యాజమాన్యం గురించి, దానిపై అదుపు, దాని నిర్వహణ గురించి సమాధానాల కంటే ప్రశ్నలే చాలా ఎక్కువగా వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటివరకు వసూలైన మొత్తం, పంపిణీ అయిన మొత్తాల గురించి ఏవిధమైన స్పష్టత లేదు. అసలు ఈ నిధులు భారతదేశ ప్రధానమంత్రికి సంబంధించిందా లేక దానికి బాధ్యుడైన నరేంద్రమోడీకి సంబంధించిందా అంటూ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నలకు ఏ రకమైన సమాధానాలు రాలేదు.

పరస్పర విరుద్ధమైన (అధికార, అనధికార) ప్రకటనలను కొట్టిపారేయలేం. ప్రధాని కార్యాలయానికి చెందిన దిగువ కార్యదర్శి స్థాయి అధికారి సంతకంతో ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఒక అఫిడవిట్‌ పీఎం కేర్స్‌ నిధి పబ్లిక్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌కు సంబంధించిన నిధి, ఇది ప్రభుత్వానికి లేదా రాష్ట్రానికి సంబంధించిన నిధి కాదని ఉద్ఘాటించింది. వసూలైన మొత్తం ‘కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియా'(సీఎఫ్‌ఐ)లో కనిపించదని కూడా ఆ అఫిడవిట్‌ తెలిపింది. సుప్రీకోర్టుకు హాజరైన సోలిసిటర్‌ జనరల్‌, వివిధ కోర్టులకు హాజరైన ఇతర న్యాయాధికారులు, పీఎం కేర్స్‌ నిధిని ప్రభుత్వాధీనంలోకి తీసుకొని రావాలని, లేదా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను(పీఐఎల్‌) వ్యతిరేకించారు. ఆర్టీఐ, సమాచారం ఇవ్వనిరాకరించినందు వలన పిటీషన్‌ దారులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

అఫిడవిట్లు దాఖలయి, వివిధ పత్రికల్లో వార్తాకథనాలు రావడంతో పీఎం కేర్స్‌ నిధి ప్రధాని కార్యాలయం నుంచి తరలివెళ్లింది. మన జాతీయ కోశాగారం నుండి వేతనాలు పొందుతున్న ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు పీఎం కేర్స్‌కు వారి ”గౌరవ” సేవలందించారు. రాజ్యాంగబద్ధమైన పదవిని నిర్వహిస్తున్న మన ప్రధానమంత్రి ఆ నిధి ట్రస్ట్‌ బోర్డుకు చైర్మన్‌. ఆ నిధి వెబెసైట్‌లో ఉన్న వివరాల ప్రకారం, మన ప్రధానమంత్రి దాని సృష్టికర్తగా, భారత యూనియన్‌ మంత్రివర్గంలోని కేబినెట్‌ మంత్రులు ట్రస్ట్‌ సభ్యులుగా ఉంటారు. ఆ వెబెసైట్‌ అధికారికంగా భారత ప్రభుత్వ పోర్టల్‌గా, భారత ప్రభుత్వ చిహ్నంతో ఉంది.

నిధికి సంబంధించిన ప్రతీ వివరం, నిధిని అధికారికంగా ఏర్పాటు చేసినట్లు సూచిస్తున్నాయి. కానీ అది ఒక పబ్లిక్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌గా ప్రారంభమైనట్లు చెపుతున్నారు. దానికి ప్రభుత్వం లేదా సీఎఫ్‌ఐతో ఎటువంటి సంబంధం లేదని దాని నిర్వాహకులు కోర్టులో చెప్పారు. ఇది భారత ప్రధానమంత్రి నిధికి తక్కువగానూ, నరేంద్రమోడీ నిధికి ఎక్కువగానూ ఉన్నపుడు దీనిలో ఎవరి జోక్యం ఉండాలి? అసలు ఇది ఎవరికి సంబంధించిన నిధి? మాయగాళ్ళు, మోసకారులు వారనుసరించిన మార్గం విజయం సాధించినందుకు గర్వపడుతున్నారు.

పీఎం కేర్స్‌ నిధి మార్చి 27న ప్రారంభం అయిన తరువాత, ”దయచేసి ఈ నిధికి అందరూ సహాయం అందించాలని” తోటి భారతీయులను కోరినట్లు మోడీ ట్వీట్‌ చేశాడు. ఆ తరువాత మూడు రోజులకు అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంతానికి 3076 కోట్ల రూపాయల నిధి వసూలు అయింది. భయంకరమైన మహమ్మారి తీవ్రమై, కఠినమైన లాక్‌డౌన్‌ విధించిన సమయంలో, కేవలం ఆరువారాల్లో భారీగా 10,600 కోట్లకు (1.4 బిలియన్‌ డాలర్లు) నిధి వసూళ్లు పెరిగాయి.

ప్రభుత్వ రంగ కంపెనీలు, ప్రయివేట్‌ కంపెనీలు, వ్యక్తులు కలిసి ఆ నిధులను సమకూర్చారు. ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని ఆ నిధికి విరాళంగా అందించారు. భారతదేశ ప్రజలు, ప్రధానమంత్రి నిధికి సహాయం అందిస్తున్నామనే భావనతో విరాళాలు అందించారు. విదేశీ విరాళాలు అనుమతించబడ్డాయి, కంపెనీలు వాటి ‘కార్పోరేట్‌ సామాజిక బాధ్యత’ కేటాయింపులను కూడా ఆ నిధికే మళ్ళించాయి.

18నెలలు కోవిడ్‌-19తో పోరాడిన తరువాత, వారి జీవితాలపై ఆర్థిక, ఆరోగ్య ప్రభావాల నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించే ఉద్దేశంతో ఏర్పాటైన ఈ నిధి గురించి భారతీయులకు కొంత సమాచారం ఉంది. ప్రభుత్వం ఈ నిధిని ఏర్పాటు చేసిన మూడు నాలుగు రోజుల తరువాత, మిలియన్ల సంఖ్యలో అసంఘటితరంగ కార్మికులు లాక్‌డౌన్‌ కారణంగా వారి కుటుంబాలతో పట్టణ, నగర ప్రాంతాల నుండి సొంత గ్రామాలకు కాలినడకన భారీగా వలసలు మొదలుపెట్టారు. ఆ ప్రయాణంలో కనీసం వంద మంది తమ ప్రాణాలను కోల్పోయారు. స్వాతంత్య్ర భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఉన్న మానవ సంక్షోభాన్ని నివారించేందుకు, పీఎం కేర్స్‌ నిధి ద్వారా కాక, పౌర సమాజంలోని సంస్థలు ప్రజల విరాళాలతో భారీ సహాయ చర్యలకు పూనుకున్నాయి.

పీఎం కేర్స్‌కు సహాయాన్ని ఎలా అందించాలనే వివరాలను మాత్రమే వెబెసైట్‌లో అందుబాటులో ఉంచారు. కానీ, ప్రధానమంత్రి కార్యాలయం, 1948లో ప్రారంభమైన ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎం ఎన్‌ఆర్‌ఎఫ్‌) వలె కాకుండా, పీఎం కేర్స్‌ ఎవరి నుండి ఎంత విరాళం అందింది, ఎవరికి ఎంత కేటాయించారనే సమాచారం ఇవ్వదు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ గత పది సంవత్సరాలకు (2010-11 నుండి 2019-20) సంబంధించిన జమా, ఖర్చుల పట్టికను తన వెబెసైట్‌లో ఉంచుతుంది. కానీ పీఎం కేర్స్‌కు సంబంధించిన ఇలాంటి సమాచారం అందుబాటులో ఉంచకుండా కేవలం మార్చి31, 2020 నాటికి ఆడిట్‌ చేసిన లెక్కల వివరాలు మాత్రమే వెబెసైట్‌లో ఉంచడం జరిగింది.

గడచిన సంవత్సరంలో తీవ్రమైన విమర్శలు చేసిన తర్వాత, ప్రధానమంత్రి కార్యాలయం ఈ నిధిని ఏర్పాటు చేయడంలోని ఉద్దేశాలను ఒక ప్రకటనలో తెలిపింది. 3100 కోట్ల రూపాయలకు గాను సుమారు రెండు వేల కోట్ల రూపాయలు వెంటిలేటర్ల కొనుగోలుకు కేటాయిస్తామని, వెయ్యి కోట్ల రూపాయలు వలస కార్మికుల బాగోగుల కోసం వినియోగిస్తామని, వంద కోట్లు వ్యాక్సిన్‌ ఉత్పత్తి క్రమం కోసం వెచ్చిస్తామని చెప్పారు. వెయ్యి కోట్ల రూపాయలు వలస కార్మికులకు వసతుల ఏర్పాటుకు, ఆహారం సమకూర్చడానికి, వైద్య సౌకర్యాలు, వారి స్వస్థలాలకు పంపడానికి అవసరమైన రవాణా ఏర్పాట్ల కోసం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయిస్తామని ఆ ప్రకటనలో తెలిపారు. ”మేకిన్‌ ఇండియా” పాలసీ కింద 50 వేల వెంటిలేటర్లను తయారు చేసి, రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి వచ్చిందని చెప్పారు.

పీఎం కేర్స్‌ నిధి పంపిణీ అనుకున్న ప్రకారం జరిగిందా లేదా అన్నది నిష్పాక్షికంగా ఆడిట్‌ జరిగిన తరువాత మాత్రమే తెలుస్తుంది. ఈ నిధిని, ఒక స్వతంత్ర సంస్థ అయిన ‘భారత కమ్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌’ ఆడిట్‌ చేయకుండా బీజేపీ నాయకులతో సంబంధాలు కలిగి ఉన్న ఒక ప్రయివేట్‌ సంస్థ చేత ఆడిట్‌ చేయించారు. అయినా నిధులు ఎక్కువగా ఖర్చైన 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఆడిట్‌ రిపోర్ట్‌ ఇప్పటికీ అందుబాటులో ఉంచలేదు. వాస్తవానికి ట్రస్ట్‌ దస్తావేజులు, డిసెంబర్‌ 2020లో అంటే పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించిన తొమ్మిది నెలల తర్వాత మాత్రమే బహిరంగ పర్చారు. పీఎం కేర్స్‌ నిధిని ఒక ‘చీకటి కొట్టు’ అని పేర్కొంటూ, ప్రతిపక్షాలు ఈ సమస్యను లోక్‌సభ దృష్టికి తెచ్చాయి, కానీ పాలక బీజేపీ, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిని, గాంధీలను ఎత్తిచూపుతూ సమస్యను పక్కదారి పట్టించింది.
కాబట్టి, భారత ప్రజానీకం ఈ ఏడాది ఆరంభంలో కరోనా మహమ్మారితో పోరాటం చేసిన సమయంలో, ఆక్సీజన్‌ సిలిండర్ల కొరత, రెమ్‌ డెసివిర్‌ లాంటి మందుల ధరలు విపరీతంగా పెరిగాయి. అప్పుడు కూడా పీఎం కేర్స్‌ నిధులను సమకూర్చలేదు. ఈ మహమ్మారికి గురైన భారతీయులు అనేక మంది పేదరికంలోకి నెట్టబడ్డారు. కానీ అటువంటి కుటుంబాలకు పీఎం కేర్స్‌ చేయూతనిచ్చిందని చెప్పుకున్న సందర్భాలు ఒక్కటి కూడా లేదు. కోవిడ్‌-19 సోకి కోలుకోలేక మరణించిన కుటుంబాలకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ ఈ పని చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. దేశంలో లక్షా ఇరవై వేల మంది పిల్లలు కోవిడ్‌ కారణంగా అనాధలుగా మారారని ఒక అధ్యయనం అంచనా వేసింది. కానీ ఆ అనాధ పిల్లల ఆలనాపాలనతో పాటు వారికి 18ఏండ్లు వచ్చేంతవరకు వారి చదువులకయ్యే ఖర్చును భరిస్తుందని పీఎం కేర్స్‌ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

పీఎం కేర్స్‌ నిధిని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు? దీని ద్వారా లబ్ది పొందేవారెవరు? అందకుండా ఎదురు చూస్తున్న వారెవరు? దాని పనితీరు లోని రహస్యం, అస్పష్టత ముఖ్యంగా దాని కేటాయింపులకు సంబంధించి, పీఎం కేర్స్‌పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది భారత ప్రభుత్వం ఆధీనంలో, ప్రధానమంత్రి హామీ ఉంటుందనే ఉద్దేశంతో మిలియన్ల సంఖ్యలో భారతీయులు, విదేశీయులు భారీగా విరాళాలు సమకూర్చారు. నెలలు గడుస్తున్నా కొద్దీ దాఖలవుతున్న వైరుధ్యాలతో కూడిన అఫిడవిట్‌ల సంఖ్య పెరుగు తుండడంతో, ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వేతర సంస్థగా కనిపిస్తున్నది. ఒక రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ప్రధాని నేతృత్వంలో నడిచే ట్రస్ట్‌ మోసపూరితమైనదనే అనుమానం ప్రజలలో కలుగుతుంది.

Courtesy Nava Telangana

Leave a Reply