అమ్మాయిలకు బీచ్లో రాత్రి ఏం పని?

0
29

– మైనర్లపై లైంగికదాడి కేసులో గోవా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

పనాజీ : గోవాలో ఇద్దరు మైనర్‌ బాలికలపై లైంగికదాడి ఘటనలు దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనలపై విపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. గోవాలో శాంతిభద్రతలు లేవనీ, మహిళలకు రక్షణ లేకుండా పోతున్నదని ఆరోపిస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. మైనర్‌ బాలికలపై జరిగిన అఘాయిత్యంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో అసెంబ్లీలో సీఎం ప్రమోద్‌ సావంత్‌ స్పందించారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైనర్‌ బాలికలకు రాత్రి పూట బీచ్‌ల్లో ఏం పని? అని ఆయన ప్రశ్నించారు. టీనేజీ అమ్మాయిలున్న తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలనీ, రాత్రిపూట బీచ్‌ పార్టీలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ’10 మంది పిల్లలు బీచ్‌లో పార్టీ చేసుకునేందుకు వెళ్లారు. ఆ పది మందిలో ఇద్దరు అమ్మాయిలు మాత్రం రాత్రంతా బీచ్‌లోనే గడిపారు.

అర్ధరాత్రి పూట బీచ్‌లో ఉండాల్సిన అవసరమేంటి? తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులు మాట వినడంలేదని ఆ బాధ్యతను పోలీసులకు వదిలేయడం కరెక్టు కాదు’ అని సీఎం ప్రమోద్‌ సావంత్‌ అసెంబ్లీలో అన్నారు. ఈ నెల 24న సౌత్‌ గోవాలోని కోల్వా బీచ్‌లో ఇద్దరు మైనర్‌ బాలికలపై లైంగికదాడి జరిగింది.

దీనిపై మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. కాగా, అమ్మాయిల విషయంలో సీఎం ప్రమోద్‌ సావంత్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన తీరుపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గోవాలో అర్ధరాత్రి పూట స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు ఉండాలనీ, అది గోవా బ్రాండ్‌ ఇమేజ్‌ అని స్పష్టం చేస్తున్నారు. అర్ధరాత్రి తిరిగినా ఏం కాదనే భరోసా ఇవ్వాలి తప్ప.. బాధితులను నిందించడం కరెక్టు కాదనీ, సీఎం స్థాయిలో ఉండి అలా మాట్లాడడం సిగ్గు చేటని విమర్శిస్తున్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply