ఇప్పుడే ఎందుకు?

0
298

ఇప్పట్లో పార్లమెంటు ఎన్నికలు లేవు.. పాక్‌ పూర్తిగా బలహీనపడింది

శీతాకాలం ఉగ్రవాదులకు కష్టమే.. కశ్మీరు పరిష్కారం మోదీ కల

జమ్మూకశ్మీరు విషయంలో కీలక నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయమని మోదీ సర్కారు ఎందుకు భావిస్తోంది? కొన్ని దశాబ్దాలుగా కేంద్రంలోని ప్రభుత్వాలేవీ ఆలోచించడానికి కూడా సాహసించని నిర్ణయాన్ని తీసుకోవడానికి వడివడిగా అడుగులు వేయడానికి ఎందుకు సిద్ధపడుతోంది? అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఇందుకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. అవి..

ఎన్నికలు లేవు

కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం అధికారానికి వచ్చింది. మరో నాలుగున్నరేళ్ల పాటు ఎన్నికలు లేవు. ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం ఎదురు తగిలినా ప్రభుత్వ సుస్థిరతపై ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రతిపక్షంలోనూ ఐక్యత కొరవడింది. కశ్మీరుపై ప్రభుత్వం ఎత్తుగడ విఫలమైనా ఏకతాటిపైకి వచ్చి, ప్రభుత్వం మీద యుద్ధం చేసే వాతావరణం కనబడటం లేదు.

పాక్‌ బలహీనం

కశ్మీరుపై తనకూ హక్కుందని వాదిస్తున్న పాక్‌ ఆర్థికంగా దినదిన గండంగా నడుస్తోంది. ఏదో ఒక దేశం నుంచి అప్పు పుడితే కానీ ఇల్లు గడవని పరిస్థితి. ప్రధాని ఇమ్రాన్‌ ఇప్పటికే బలహీన ప్రధానిగా నిరూపించుకున్నారు. అమెరికాకు వెళ్లి ప్రాధేయపడే పరిస్థితిలో ఉన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజాన్ని సమీకరించే స్థితిలో లేరు.

బలీయంగా బలగాలు

ప్రస్తుతం భారత సైన్యం నైతికంగా బలమైన స్థితిలో ఉంది. బాలాకోట్‌పై వైమానిక దాడులు చేయడంతో సైన్యానికి నైతిక బలం చేకూరింది. భారీ ఎత్తున బలగాలను దించడం, సైనికులపై నమ్మకం ఉంచి స్వేచ్ఛనివ్వడం ఫలితాలను ఇస్తోంది.

శీతాకాలం

వచ్చేది శీతాకాలం. కశ్మీరు కొండల్లో ఉగ్రవాదులకు ఆగస్టు వరకు ఉన్న అడ్వాంటేజీ తగ్గిపోతుంది. మళ్లీ ఫిబ్రవరి వరకు ఉగ్రవాదుల కదలికలు తగ్గిపోతాయి. ఈలోగానే ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకుంటే తలెత్తే విపరిణామాలను తేలిగ్గా ఎదుర్కోవచ్చని భావిస్తున్నారు.

పొరుగు దేశాలు

ప్రస్తుతం పాకిస్థాన్‌ తప్ప భారత్‌ పొరుగు దేశాలన్నీ స్నేహపూర్వకంగా ఉన్నాయి. ఇటీవల మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారానికి ఆగ్నేయాసియా దేశాధినేతలంతా వచ్చారు. అంతర్జాతీయ ఒత్తిడి ముఖ్యగా పొరుగు దేశాల స్పందనను బట్టే ఉంటుంది.

రాచపుండు సమస్య

కశ్మీరు సమస్య భారత్‌ను రాచపుండులా వేధిస్తోంది. మోదీ మూడో దఫా గెలిచినా పూర్తికాలం ఐదేళ్లపాటు అధికారంలో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. తాను అధికారంలోంచి తప్పుకొనేలోగా కశ్మీరు సమస్యను పరిష్కరించానన్న కీర్తిని కూడగట్టుకోవాలని మోదీ భావిస్తున్నట్లు సమాచారం.

అమెరికా ఆకాంక్ష

అమెరికాకు కశ్మీరులో ఏదో పాత్ర పోషించాలనే ఆకాంక్ష లేదు. ఉగ్రవాదం మూలాలను నాశనం చేయడంపైనే దాని దృష్ణంతా. ఆ విషయంలోనే పాకిస్థాన్‌పై నిరంతర ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో కశ్మీరు సమస్యను భారత్‌ తనంత తానుగా పరిష్కరించుకోగలిగితే అమెరికాకూ హ్యాపీయే.

చైనాకు ఉత్సాహం లేదు

అమెరికా-చైనాల మధ్య ప్రస్తుతం ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. చైనా శక్తియుక్తులన్నీ ఇప్పుడు అమెరికా మీదే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి వాతావరణంలో చైనా తన మిత్రుడు పాకిస్థాన్‌ కోసం భారత్‌తో ఘర్షణ పడే అవకాశం లేదు.

(Courtacy Andhrajyothi)

Leave a Reply