సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకోకూడదు?

0
230

వడ్డే శోభనాద్రీశ్వరరావు

ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, మద్రాస్‌ హైకోర్టు మొదలైన న్యాయస్థానాలు సూచనలు ఇస్తూ ఉంటే వాటిని జోక్యం చేసుకోవద్దంటూ అఫిడవిట్‌ దాఖలు చేయటం మోదీ నిరంకుశ స్వభావానికి నిదర్శనం. భారత రాజ్యాంగంలో పేర్కొనబడినట్టుగా ప్రజల ప్రాథమిక హక్కులను, ప్రభుత్వాలు అనుసరించవలసిన ఆదేశిక సూత్రాలను అమలయ్యేలా చూడవలసిన బాధ్యత ఉన్నత న్యాయస్థానాలపైన ఉండటం వల్లనే సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిందన్నది వాస్తవం. దీన్ని అర్థం చేసుకుండా, కేంద్రప్రభుత్వం భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని జోక్యం చేసుకోవద్దని కోరటం మొగుడిని కొట్టి మొగసాలకెక్కిన చందంగా ఉంది.

దేశంలో కరోనా మహమ్మారి వలన రోజుకు వేలాదిమంది ప్రజలు చనిపోతూన్న అమానవీయ పరిస్థితిని గమనించి సుప్రీంకోర్టు సుమోటోగా కరోనా పరిస్థితిని విచారించాలనే నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. ప్రాథమిక విచారణ సందర్భంలో కోర్టు తమ దృష్టిలోకి వచ్చిన అంశాలైన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పాలసీ, వ్యాక్సిన్లకు వేరువేరు ధరలు, వ్యాక్సిన్ల కొరత వంటి వాటిని సమీక్షిస్తూ కొన్నిటిపై వివరణ కావాలని కేంద్రప్రభుత్వాన్ని కోరింది. అంతేగాక కేంద్రం అమలు చేస్తున్న ఆక్సిజన్‌ సరఫరా విధానాన్ని పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ మెరుగైన సూచనలు అందించేందుకు ‘‘నేషనల్‌ టాస్క్‌ఫోర్స్’’ను ఏర్పాటు చేసింది. దీనిపైన ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

ఈ అఫిడవిట్‌లో సుప్రీంకోర్టు లేవనెత్తిన కీలకమైన అంశాలపైన కేంద్రం సరైన వివరణ ఇవ్వకుండా కప్పదాటు వైఖరిని అవలంబించింది. ఉదాహరణకు టీకాల కొరత విషయమే తీసుకుంటే- ఇతర దేశాలలో టీకా ఉత్పత్తి, ప్రజలందరికీ కరోనా టీకా అందించే కార్యక్రమాలను మన ప్రభుత్వం పరిశీలించి, మన దేశ 130 కోట్ల ప్రజానీకానికీ టీకాలు వేయాలనుకుంటే దాదాపు 200 కోట్ల డోసులు అవసరమౌతాయి. కానీ కేంద్రం వాటిని ఏ విధంగా సమకూర్చుకోవాలనే ప్రణాళిక గురించి ఆలోచించనే లేదు. 2020 జూలై -– ఆగష్టు ప్రాంతాల లోనే శాస్త్రవేత్తలు కరోనా సెకండ్ వేవ్‌ గురించి హెచ్చరించారు. అయినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.

టీకాల ఉత్పత్తికి మనదేశంలో విశేషమైన అవకాశాలున్నాయి. గతంలోనే కోట్లాదిమంది భారతీయులకు పోలియో, టీబీ మున్నగు వాటికి టీకాలను ఉచితంగా ప్రభుత్వమే అందజేసింది. భారీస్థాయిలో వీటిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం కొన్ని సంస్థలకు వుంది. ఈ సంస్థలు ప్రస్తుతం నెలకు 10 మిలియన్ల డోసుల కొవాక్సిన్‌‍ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఉత్పత్తిని రాబోయే ఎనిమిది నుంచి పది మాసాల వ్యవధిలో 100 మిలియన్‌ డోసులకు పెంచేందుకు 200 కోట్లు సహాయం చేయాలని తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకొంది. కానీ ఇది అగ్ని ప్రమాదం జరుగుతుండగా బావిని తవ్వినట్లుంది. ఇవేకాక టీకాలు తయారు చేసే అనుభవం, సామర్థ్యం ఉన్న 8 సంస్థలు టీకాల ‘‘ఉత్పత్తి-పరీక్షల’’ ప్రాథమిక దశలో వున్నాయని వీటికి కూడా సహకారాన్ని అందించి టీకా ఉత్పత్తిని పెంచదల్చుకున్నట్లు పేర్కొంటూనే ఇప్పటివరకు వాటికి ఏ మాత్రం నిధులు అందజేయలేదని ఒప్పుకొంది. ఈ నిర్ణయం ఏడెనిమిది నెలల క్రితమే తీసుకొని ఉంటే ప్రస్తుతం దేశం టీకాల విషయంలో ఇంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొని ఉండేది కాదు.

టీకాల ధరలు కేంద్రానికి ఒకలా, రాష్ట్రాలకు మరోలా, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కి మరొకలా ఉండటంలోని ఔచిత్యాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌కి గాని, భారత్‌ బయోటెక్‌కి గాని టీకాలను అభివృద్ధి చేసేందుకు తాను ఒక్క పైసా కూడా సహాయం చేయలేదని, సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుండి మే, జూన్‌, జూలై మాసాలలో 11 కోట్ల డోసుల కోవిషీల్డ్‌ టీకాలను అందించేందుకు రూ.1732 కోట్లు, అలాగే భారత్‌ బయోటెక్‌కు ఐదు కోట్ల కోవాక్సిన్‌ డోసులను అందించేందుకు రూ.787 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించామని పేర్కొంది. అంతేకాక ఐ.సి.ఎమ్.ఆర్‌ సహకారంతో భారత్‌ బయోటెక్‌ కోవాక్సిన్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు రూ.35 కోట్లు, సీరం ఇన్‌స్టిట్యూట్‌ కోవిషీల్డ్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు రూ.11 కోట్లు ఖర్చయ్యిందని తెలియచేసింది.

ఒక వంక ఇప్పటికి కేవలం 2.7 శాతం మంది భారతీయులు కూడా రెండు టీకా డోసులను తీసుకొని ఉండని పరిస్థితుల్లో కేంద్రం తానే ఒకే ధరకు టీకా తయారీ సంస్థల నుంచి సేకరించి రాష్ట్రాలకు అందచేసి ప్రజలకు ఉచితంగా టీకాలు వేయాలి. కానీ ఈ బాధ్యతను వదుల్చుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ తమతమ ప్రజలకు ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించాయని తెల్పుతూ, సుప్రీంకోర్టును ప్రక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేసింది. జి.ఎస్‌.టి. దెబ్బతో, కోవిడ్‌ సంక్షోభంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వాలపైన అదనపు భారం మోపడం కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రం తగని చర్య.

రెమిడిసివర్‌ మరికొన్ని మందులు బ్లాక్‌ మార్కెట్లో అమ్మబడుతూ పేదలపైన పెనుభారం పడుతూ ఉన్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టు వారు పేటెంట్‌ యాక్టులోని ‘కంపల్సరీ లైసెన్సింగ్‌’ అవకాశాన్ని ఉపయోగించి ఎక్కువ సంస్థల చేత ఉత్పత్తి చేయించవచ్చుకదా అన్న అంశాన్ని ప్రస్తావించారు. దానికి కేంద్రం చాలా సుదీర్ఘమైన వివరణతో రెమిడిసివర్‌ ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామని చెబుతూనే, దాని ఉత్పత్తికి అవసరమైన కొన్ని ముడి వస్తువుల దిగుమతి ఉంటుంది కావున, పేటెంట్‌ చట్టంలో మార్పు చేయడం వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చని సన్నాయి నొక్కులు నొక్కింది.

భారత పేటెంట్‌ చట్టంలో సెక్షన్‌ 92, 100, 102ల ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిలో లాభదాయకమైన వాణిజ్యం కొరకు కాకుండా ప్రజలకు అవసరమైన అత్యవసర సమయాల్లో ‘‘కంపల్సరీ లైసెన్సింగ్‌ ప్రొవిజన్‌’’ను ఉపయోగించుకొని అవసరానికి అనుగుణంగా వీటి ఉత్పత్తిని పెంచవచ్చు. ఇలా ఎందుకు ప్రయత్నించకూడదని సుప్రీంకోర్టు వారేకాక, ఢిల్లీ హైకోర్టు కూడా చేసిన సూచనల విషయంలో కూడా కేంద్రం సరిగా స్పందించ లేదు. ప్రజల ప్రాణాలు కాపాడటం కన్నా, బడా కంపెనీల పేటెంట్‌ హక్కు, వారికి చేకూరు లాభాల పట్లనే ప్రభుత్వం సానుకూల వైఖరిని అవలంబించటం గర్హనీయం.

మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా సంబంధిత అంశాలపై రాకేష్‌ మల్హోత్రా వెర్సస్ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు సందర్భంలో సుప్రీంకోర్టు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ వున్న ఆక్సిజన్‌ సరఫరా విధానంలో కొన్ని లోపాలున్నాయని, ఈ విధానాన్ని పునఃసమీక్షించవలసిన అవసరం వుందనీ, మెరుగైన సూచనలు యిచ్చేందుకు ‘‘నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌’’ ఏర్పాటు చేస్తూ మే 6, 2021న యిచ్చినఉత్తర్వుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తనకు భిన్న అభిప్రాయం ఉందని మాత్రం చెప్పి ఊరుకుంది. అంతేతప్ప పెద్ద పరిమాణంలో మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసి, రాష్ట్రాలకు అందచేసి, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత, రాష్ట్రాలకు కేటాయించే అధికారం తనపై ఉండగా ఎందుకింత ఘోరంగా విఫలమవుతోందో వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా తాము బాధ్యతను చాలా సక్రమంగా నిర్వర్తిస్తున్నామని, తాము తీసుకొనే విధానపర నిర్ణయాలలో సుప్రీంకోర్టు వారు జోక్యం చేసుకోవద్దని కోరడం అత్యంత అభ్యంతరకరం. ప్రభుత్వానికి విధానపర నిర్ణయం తీసుకొనేందుకు అధికారం ఉన్నప్పటికీ ఆ నిర్ణయం సహేతుకంగా, పారదర్శకంగా, వివక్షత లేకుండా ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలని, అందుకు భిన్నంగా ఉన్న ఎడల సుప్రీంకోర్టు/ హైకోర్టులు జోక్యం చేసుకోవచ్చునని స్పష్టంగా పలు తీర్పులుండగా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సాకులు వెదకడం తగదు.

అలాగే 45 సం.ల పైవారికి టీకాలువేసే కార్యక్రమం ఒక కొలిక్కి రాకముందే 18–-44 వయసు వారికి కూడా టీకాలు వేయాలని నిర్ణయించడం సహేతుకం కాదు. రెండు డోసులు తీసుకున్న దరిమిలానే టీకా వలన సరైన ప్రయోజనం చేకూరుతుంది. సరైన సమయంలో రెండవ డోసు తీసుకోలేకపోతే మొదటి డోసు వలన ప్రయోజనం ఏమాత్రమూ ఉండదు, వృథా అయినట్లే. మొదటి డోసు వేసుకున్నవారికి రెండో డోసు వేయడానికే ఇంకా కొన్ని నెలలు పడుతుంది. అందుకు అవసరమైన టీకాల కొరత ఉండగా రాష్ట్ర ప్రభుత్వాలు కోరినందున 18–-44 వయసు వారికి కూడా టీకాలు వేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పడం అవాస్తవం. ఈ విధానం సరికాదని కొన్ని రాష్ట్రాలు విమర్శించాయి కూడా. ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో టీకాల కొరత వలన 18–-44 వయసు వారికి ప్రస్తుతం టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టలేదు.

ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, మద్రాస్‌ హైకోర్టు మున్నగు న్యాయస్థానాలు ప్రజాహితం కోరి సూచనలు ఇస్తూ ఉంటే జోక్యం చేసుకోవద్దని అఫిడవిట్‌ దాఖలు చేయటం మోదీ నిరంకుశ స్వభావానికి నిదర్శనం. భారత రాజ్యాంగంలో పేర్కొనబడినట్టుగా ప్రజల ప్రాథమిక హక్కులను, ప్రభుత్వాలు అనుసరించవలసిన ఆదేశిక సూత్రాలను అమలయ్యేలా చూడవలసిన బాధ్యత ఉన్నత న్యాయ స్థానాలపైన ఉండటం వల్లనే సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిందన్న వాస్తవాన్ని అర్థం చేసుకుండా, కేంద్ర ప్రభుత్వం భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని జోక్యం చేసుకోవద్దని కోరటం మొగుడిని కొట్టి మొగసాలకెక్కిన చందంగా ఉంది. ఇప్పటికైనా కాకమ్మ కబుర్లు కట్టిపెట్టి మోదీ ప్రభుత్వం కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజాసేవా దృక్పథంతో వ్యవహరించవలసిన పరిస్థితి ఎంతైనా వుంది.

Courtesy Andhrajyothi

Leave a Reply