అంబులెన్సులను ఎందుకు ఆపారు?

0
27
 • తక్షణమే మా ఆదేశాలు అమలుపర్చాలి.. 
 • రాజ్యాంగంపై స్వారీ చేసే అధికారం ఏ రాష్ట్రానికీ లేదు
 • అంబులెన్సులను నిలిపివేయడం 
 • జీవించే హక్కును హరించడమే!
 • అధికారుల చర్య కోర్టు ధిక్కారమే!
 • తెలంగాణ జీవోను నిలిపేసిన హైకోర్టు
 • అధికారులపై బెంచి తీవ్ర అసంతృప్తి
 • కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు ఉంటేనే తెలంగాణలోకి అనుమతి
 • ఈ నిబంధన అమలు చేస్తాం: ఏజీ
 • కరోనా రోగులను అడ్డుకోవడం అమానుషం
 • మానవతా దృక్పథంతో అనుమతించాలి: విపక్షాలు

‘ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలా వ్యవహరించలేదు. జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వ ఆస్తులు. వాటిపైకి వెళ్లే ముందు కేంద్రం నుంచి మీరు అనుమతి తీసుకునే వెళ్లారా?’ 

‘రోగుల ప్రాణాలు అక్కడే గాలిలో కలిసిపోవాలా? ఇవేం ఉత్తర్వులు? మీ చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు’

‘ఈ జీవో ముమ్మాటికీ కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఈ ఉత్తర్వులు జారీచేసిన అధికారి కోర్టు ధిక్కార చర్యలను ఆహ్వానించినట్లే’
– హైకోర్టు 

హైదరాబాద్‌ : కొవిడ్‌ చికిత్స కోసం అంబులెన్సుల్లో హైదరాబాద్‌ వచ్చే పొరుగు రాష్ట్రాల రోగులను సరిహద్దుల్లో నిలిపివేయడంపై హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై తామిచ్చిన స్పష్టమైన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై మండిపడింది. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. పొరుగు రాష్ట్రాల నుంచి… ముఖ్యంగా ఏపీ నుంచి అంబులెన్సులలో వచ్చే రోగులను సరిహద్దులలో నిలిపివేయడానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ సీఎస్‌ ఈనెల 11న ఇచ్చిన జీవోను హైకోర్టు నిలిపివేసింది. కొవిడ్‌కు మెరుగైన చికిత్స కోసం పెద్ద సంఖ్యలో రోగులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి అంబులెన్సులలో రావడంతో రాష్ట్ర ప్రభుత్వం వారిని సరిహద్దుల్లో అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామం గత కొన్ని రోజులుగా ఉభయ రాష్ట్రాల మధ్య పెద్ద సమస్యగా మారింది. దీనికి సంబంధించి తెలంగాణ సీఎస్‌ ఇచ్చిన జీవోను హైకోర్టు పక్కన పెట్టడంతో… ప్రస్తుతానికి పొరుగు రాష్ట్రాల రోగులు హైదరాబాద్‌ రావడానికి మార్గం సుగమం అయ్యింది.

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలాంటిది దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ జారీచేయలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పొరుగు రాష్ట్రాల నుంచి చికిత్స కోసం వచ్చే రోగులను అడ్డుకోవద్దని తాము ఆదేశాలిచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి జీవో జారీచేయడమేంటని ప్రశ్నించింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి రిస్కుతో వచ్చే రోగుల హక్కులను మీరెలా ఉల్లంఘిస్తారని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్యాంగానికి, కేంద్ర మార్గదర్శకాలకు లోబడే ఉండాలని తేల్చిచెప్పింది. కోర్టు ఉత్తర్వులు అందేవరకూ వేచి చూడకుండా తక్షణమే ఈ ఆదేశాలను అమలుచేసి రోగులు ఆస్పత్రులకు చేరుకునేందుకు వెసులుబాటు కల్పించాలని తేల్చిచెప్పింది. ఈ వ్యాజ్యంలో మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీచేసింది. ఆ కౌంటర్లకు వారంలోగా బదులివ్వాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది.  కోర్టు తదుపరి విచారణను జూన్‌ 17కి వాయిదా వేసింది. చికిత్స కోసం వచ్చే రోగులను అడ్డుకునేందుకు జీవో/మార్గదర్శకాలు/సర్క్యులర్‌ ఏ రూపంలోనూ ఉత్తర్వులు జారీచేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఈమేరకు హైకోర్టు సీజే హిమా కోహ్లీ, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.

రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోవాలా?:బెంచి
ఏపీ నుంచి కొవిడ్‌ చికిత్స కోసం అంబులెన్సులలో వస్తున్న రోగులను తెలంగాణ పోలీసులు నిలువరించడాన్ని సవాల్‌ చేస్తూ విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి గరిమెళ్ల వెంకట కృష్ణారావు శుక్రవారం హౌస్‌మోషన్‌లో హైకోర్టును ఆశ్రయించారు. ‘దీనికి సంబంధించి మేము స్పష్టమైన ఆదేశాలిచ్చాం. చికిత్స కోసం నగరానికి వచ్చే అంబులెన్సులను నిలువరించరాదని చెప్పాం. అయినా మీరు ఇలాంటి జీవో ఎందుకిచ్చారు? రంజాన్‌ పండుగ రోజున పనికల్పించ వద్దని ఆరోజే చెప్పాం. అయినా మీరు అదేపని చేశారు. రోగులు వారి సౌకర్యం కోసం వస్తారు? మీ కంట్రోల్‌ రూమ్‌ నుంచి అనుమతి ఎందుకు పొందాలి? అన్నీ మీకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చుకుంటే ఎలా? రోగులు అందుబాటులో ఉండే ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందే అవకాశం వారికి ఉంటుంది. ‘ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలా వ్యవహరించలేదు. జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వ ఆస్తులు. వాటిపైకి వెళ్లే ముందు కేంద్రం నుంచి మీరు అనుమతి తీసుకునే వెళ్లారా?’ అని నిలదీసింది. ప్రాణాపాయ స్థితిలో ఉండి చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్న రోగులను సరిహద్దుల్లోనే నిలిపివేయాలని ఎలా ఉత్తర్వులిస్తారని ప్రశ్నించింది.

‘రోగుల ప్రాణాలు అక్కడే గాలిలో కలిసిపోవాలా? ఇవేమి ఉత్తర్వులు! సారీ… మీ చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు’ అని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలోని దూరప్రాంతాల్లోని రోగులు హైదరాబాద్‌కు రాకుండా అడ్డుకునేలా కూడా ఉత్తర్వులు ఉన్నాయా? అని ప్రశ్నించింది. కేవలం పొరుగు రాష్ట్రాలలోని రోగులను అడ్డుకోవడం కోసం వివక్షాపూరితంగా ఇలాంటి ఉత్తర్వులు జారీచేశారని ఆక్షేపించింది. ‘ఈ జీవో ముమ్మాటికీ కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఈ ఉత్తర్వులు జారీచేసిన అధికారి కోర్టు ధిక్కార చర్యలను ఆహ్వానించినట్లే’అని వ్యాఖ్యానించింది. ‘చికిత్స కోసం వచ్చే రోగుల ప్రాణాలు వారి ఇష్టం. ఆసుపత్రిలో పడకలు లభిస్తే చికిత్స తీసుకుంటారు. లేదా తిరిగి వెళ్లిపోతారు. అది వారి రిస్క్‌. వారిని నిలువరించే హక్కు మీకెక్కడిది? మీరు రాజ్యాంగంపై సవారీ చేయడానికి వీల్లేదు. రాష్ట్రాలు రాజ్యాంగానికి లోబడే ఉండాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అత్యవర చికిత్స కోసం వచ్చే వారు ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు? వారి గుర్తింపు కార్డులు చూపాలని కోరవద్దని సుప్రీంకోర్టు జారీచేసిన స్పష్టమైన ఆదేశాలు ఉండగా ఇలాంటి జీవో జారీచేయడం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది.

సుప్రీం ఆదేశాలకు వ్యతిరేకం: దమ్మాలపాటి
పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదించారు. తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు ఏప్రిల్‌ 25న కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలకు, సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 30న ఇచ్చిన ఆదేశాలకు పూర్తి విరుద్ధమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలు విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల నియంత్రణ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల రోగులను హైదరాబాద్‌ రాకుండా అడ్డుకోడానికే తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చిందని ఏపీ ఏజీ శ్రీరామ్‌ వాదించారు. ఈ చర్య ప్రజల జీవించే హక్కును హరించి వేయడమేనని ఆయన తెలిపారు.

వైరస్‌ మరింత ప్రబలుతుంది: తెలంగాణ ఏజీ
పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు ఇక్కడ ఆసుపత్రుల్లో పడకలు దొరకక పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృథాపర్చుకోరాదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిందని తెలంగాణ ఏజీ బీ.ఎస్‌. ప్రసాద్‌ కోర్టుకు వివరించారు. రాష్ట్రంలోని 85శాతం ఐసీయూ పడకలు కొవిడ్‌ రోగులతో నిండిపోయాయని అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్‌, ఏపీ రాష్ట్రాల నుంచి కొవిడ్‌ రోగులు నగరానికి వచ్చి, పలు ఆసుపత్రుల చుట్టూ తిరగడం వల్ల వైరస్‌ మరింత ప్రబలే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలలోకి వెళ్లే వారికి ఆర్టీపీసీఆర్‌ టెస్టు నెగిటివ్‌ రిపోర్టు ఉంటేనే అనుమతిస్తున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. ఇక్కడ కూడా అటువంటి నిబంధనను అమలుపరిచేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి రోగులు ఎక్కువగా వస్తున్నందున ఔషధాలకు, ఆక్సిజన్‌కు కొరత ఏర్పడుతోందని ఏజీ చెప్పారు.

Courtesy Andhrajyothi

Leave a Reply