అమెరికన్ సైనికుల అరాచాకాలను తన వికీలీక్స్ ద్వారా బయటపెట్టి అగ్ర రాజ్యాన్ని గడ గడ లాడించిన వికీలీక్స్ అధినేత జులియన్ అసాంజేను బ్రిటిష్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడేళ్లుగా బ్రిటన్ కోర్ట్ లో ఆయనపై స్వీడన్‌లో నమోదైన ఆరోపణలపై విచారణ జరుగుతోంది. దాంతో ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు లండన్‌లోని ఈక్వడేరియన్ ఎంబసీలో తలదాచుకున్నాడు. బ్రిటన్ కోర్ట్ విచారణ పూర్తయితే తాము అసాంజేను అదుపులోకి తీసుకోవాలని అమెరికా ఎదురు చూస్తోంది. తాజాగా ఈక్వడేరియన్ ఎంబసీ ఆయనకు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో బ్రిటిష్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అమెరికాతో నేరస్థుల అప్పగింత ఒప్పందం బ్రిటన్ కు ఉంది. ఈ ఒప్పందం ప్రకారం అసాంజేను అమెరికా అధికారులు కూడా త్వరలో అమెరికాకు తీసుకెళ్ళే అవకాశం ఉంది.