- పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారు?
- మరిమయ్మ లాక్‌పడెత్ కేసులో హైకోర్టు వ్యాఖ్యలు
హైదరాబాద్ : ‘‘నేరం జరిగితే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం పోలీసుల విధి. చట్టాన్ని అమలు చేయాల్సిన వారు.. దానిని చేతుల్లోకి ఎలా తీసుకుంటారు? అధికారులపై వేటు వేస్తే, బాధితులకు పరిహారం చెల్లిస్తే.. పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా!?’’ అని హైకోర్టు రాచకొండ పోలీసులను నిలదీసింది. యాదాద్రి-భువనగిరి జిల్లా అడ్డగుడూరు ఠాణాలో మరిమయ్మ లాక్‌పడెత్‌కు సంబంధించి తాజా నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరియమ్మ మృతిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని, బాధ్యులైన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశించాలంటూ.. పౌరహక్కుల సంఘం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రభుత్వం, రాచకొండ పోలీస్ కమిషనర్ దాఖలు చేసిన కౌంటర్‌ను ధర్మాసనం పరిశీలించింది.
మరియమ్మ కుమారుడిని చిత్రహింసలకు గురి చేయలేదని, అతడికి సాధారణ గాయాలున్నట్లు డాక్టర్లు తమ నివేదికలో పేర్కొన్నారని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. ఈ కేసులో రీపోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని పేర్కొంది. అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. ఆలేరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నివేదిక ఇంకా సిద్ధం కాలేదని, గత నెల 2న రీపోస్టుమార్టం జరిగిందని అన్నారు. నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వ కౌంటర్ ప్రకారం మే 27 వరకు సీసీటీవీల మరమ్మతులకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. సంఘటనలన్నీ జరిగాక జూన్ 25న మరమ్మతులు చేశారని తెలిపింది. సీసీటీవీలు పనిచేయకపోవడానికి కేబుల్ దెబ్బతినడమే కారణమని కౌంటర్లో పేర్కొన్నారని వివరించింది. ‘‘సీసీటీవీ కెమెరాలు పనిచేయని కాలంలో పోయిన ప్రాణాల సంగతేంటి? ముందుస్తుగా చర్యలు ఎందుకు తీసుకోలేదు?’’ అని హైకోర్టు ప్రశ్నించింది.
తీవ్రంగా పరిగణించాల్సిన అంశం..
మరియమ్మ మృతిని ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుందని, ఒక ఎస్ఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లను డిస్మిస్ చేసిందని అడ్వకేట్ జనరల్ సమాధానమిచ్చారు. అయితే అధికారులను బయటకు పంపడం వల్ల పోయిన ప్రాణాలను వెనక్కి తీసుకురాలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్బంధం, పోలీస్ కస్టడీలో మరణించిన సంఘటనల్ని దేశంలో తీవ్రంగా పరిగణించాల్సి ఉందని పేర్కొంది. మరియమ్మ కుమారుడికి రూ.15 లక్షల పరిహారం చెల్లించామని, ఉద్యోగం కూడా ఇచ్చామని హైకోర్టు దృష్టికి అడ్వకేట్ జనరల్ తీసుకెళ్లగా.. పరిహారం, ఉద్యోగం తల్లి ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ సంఘటనపై తాజా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రీపోస్టుమార్టం నివేదిక అందాక.. పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆలేరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 15వ తేదీకి వాయిదా వేసింది.
Courtesy Andhrajyothi