‘అమ్ము’ కి న్యాయం జరుగుతుందా?

0
319
kakarla Sajaya – Senior Journalist, Women Activist

కరోనా పాండమిక్ పేరుతో అనాలోచితంగా ప్రకటించిన లాక్ డౌన్ ఎన్ని జీవితాలను రోడ్డున పడేసిందో మనందరికీ తెలుసు. ఇంకా ఎన్ని జీవితాలు ఎన్ని రకాల సుడిగుండాల్లో పడ్డాయో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. ఈ సమయంలో వ్యవస్థల నిర్లక్ష్యానికి బలయిన ఒక చిన్నారి దళిత బాలిక గురించి తెలుసుకుందాం. అవును, న్యాయం కోసం రాజ్యాంగ వ్యవస్థల తలుపు తట్టిన పన్నెండు రోజుల వ్యవధిలో అవి చూపించిన తీవ్ర నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలో ఆ బిడ్డ ప్రాణం పోయింది. అవును ఇదే నిజం. నిర్భయ, పోక్సో చట్టాల రీత్యా బాధిత బాలిక పేరు ప్రకటించకూడదు కాబట్టి ఇక్కడ ఆ పాప పేరును అమ్ముగా పేర్కొంటున్నాను.  

‘అమ్ము’  తల్లిదండ్రులిద్దరూ తన చిన్నతనంలోనే అనారోగ్యంతో చనిపోవటంతో 2015లో దూరపు బంధువులు రంగారెడ్డి జిల్లా పరిధిలోని మియాపూర్ మారుతి ఆర్ఫనేజ్ హోంలో చేర్పించారు. ‘అమ్ము’కి లోకల్ గార్డియన్లుగా అక్క వరుసయ్యే కీర్తన, పూజ వాళ్లే వున్నారు. కీర్తన భర్త అనిల్ రాజస్తాన్ కి చెందిన వ్యక్తి. లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. పూజ భర్త విజయ్ ఒక కాటరింగ్ సర్వీస్ లో పనిచేస్తున్నాడు. తమిళనాడుకి చెందిన వ్యక్తి. వారివి అంతంత మాత్రంగా గడిచే పేద కుటుంబాలు.

‘అమ్ము’కి సంబంధించిన విషయాన్ని ఇక్కడినుంచీ ఒక వరుస క్రమంలో చూడాల్సిన అవసరం వుంది. మార్చి మొదటి వారంలోనే హోం నిర్వాహకురాలు విజయ ‘అమ్ము’ బావ అనిల్ కి ఫోన్ చేసి తనని ఇంటికి తీసుకెళ్ళిపొమ్మని చెప్పింది. అయితే వీళ్లు పనుల వత్తిడిలో వుండి వెళ్లలేకపోయారు. మళ్ళీ మార్చి 21వ తేదీన ఫోన్ చేసి “వెంటనే ‘అమ్ము’ని తీసుకెల్లాల్సిందేనని, కరోనా సమయం కాబట్టి పిల్లలు అందర్నీ పంపించివేయమని అధికారులు చెప్పారని తెలిపింది. ఆ రోజు అనిల్ వెళితే, నిజానికి ‘అమ్ము’ నడవగలిగిన పరిస్థితిలో లేదు. నిర్వాహకురాలు విజయ తమ్ముడు జయదేవ్ ‘అమ్ము’ని రెండు చేతులతో ఎత్తుకుని తీసుకువచ్చి కారులో కూర్చోపెట్టాడు. ‘పాపకి ఏమయింది? ఎందుకు నడవలేకపోతోంది?’ అని బంధువులు అడిగితే ‘కొంచం వాంతులు, విరోచనాలు అవుతున్నాయి…అంతే’ అని హోం నిర్వాహకురాలు చెప్పారు. పాప బాధ్యత ఇంక మీదే అంటూ తెలుగులో రాసివున్న పేపర్ మీద అనిల్ తో సంతకం పెట్టించుకున్నారు.

ఇంటికి తీసుకువచ్చినప్పటి నుంచీ ‘అమ్ము’ ఆరోగ్యం పరిస్థితి వారికి ఏమీ అర్థంకాలేదు. ఏమి తిన్నా అరగకపోవటం, వాంతులు చేసుకోవటం, పక్కలోనే విరోచనాలు అవుతూ వుండటం, జ్వరం వస్తూపోతూ వుండటంతో దగ్గరలోని హాస్పిటల్స్ లో చూపించటానికి ప్రయత్నిస్తే లాక్ డౌన్ వల్ల ఎవరూ చూడలేదు. చివరికి ఒక RMP డాక్టర్ కి చూపిస్తే డోలో లాంటి టాబ్లెట్స్ ఇచ్చారు కానీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. కొన్ని రోజులు బాగుండటం, మరికొన్ని రోజులు తీవ్ర అనారోగ్యం.. పైగా పద్నాలుగేళ్ల అమ్మాయి తన రోజువారీ ప్రాకృతిక అవసరాలను కూడా పక్కలోనే తెలియకుండా చేసేయ్యటం వారిని అయోమయానికి గురిచేసింది. ‘అమ్ము’ అక్కలు కీర్తన, పూజలు హోం నిర్వాహకురాలు విజయకు ఫోన్ చేసి “మా చెల్లి పరిస్థితి ఎందుకు ఇలా వుంది?” అని అడిగితే మాకేం తెలియదు అనే సమాధానమే ఎదురయింది కానీ, తమ వైపునుంచీ కనీస సహాయాన్ని అందించటానికి కూడా ముందుకు రాలేదు. ఒక పక్క లాక్ డౌన్ కారణంగా పనులు పోగొట్టుకుని ఆర్ధికంగా తీవ్ర సమస్యలు, రోజులు గడవటమే కష్టమయిన పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆ కుటుంబాలకి ‘అమ్ము’ అనారోగ్య మరింత సమస్యగా మారింది. మరోవైపు ఇంటి యజమానుల నుంచి ఇల్లు ఖాళీ చేయమనే వత్తిడి కూడా తోడయింది. దిక్కుతోచని ఆ స్థితిలో, ఆ అసహనాన్ని, విసుగుని ఆ అక్కలు పాప మీద కూడా చూపించారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో జూలై చివరివారంలో ‘అమ్ము’ని తీసుకుని వెళ్లి మళ్ళీ హోంలో చేర్చుకోమని నిర్వాహకురాలు విజయకు పదేపదే విజ్ఞప్తి చేసినా గానీ, అందుకు ఆమె అధికారుల నుంచీ అనుమతి లేదని చెప్పి నిర్ద్వంద్వంగా నిరాకరించింది.

ఎన్నిసార్లు అడిగినా వొప్పుకోకపోవటంతో, పరిస్థితి అర్థంకాని కీర్తన, అనిల్ జూలై 28న ‘అమ్ము’కి పిన్నివరసయ్యే ప్రీతిని వెంటతీసుకుని హోంకి మళ్ళీ వెళ్లారు. ‘అమ్ము’ని తమ హోంలో జేర్చుకోవటానికి విజయ అంగీకరించకపోగా బన్సీలాల్ పేటలో ఒక హోం వుందని, అక్కడికి తీసుకెళ్ళమని ఫోన్ నెంబర్ ఇచ్చింది. జూలై 29న ఆ అడ్రస్ వెతుక్కుని వెళితే అది వికలాంగుల హోం. ‘అమ్ము’ వికలాంగురాలు కాదు. కేవలం అనారోగ్యంతో సరిగ్గా నడవలేకపోతోంది. ఈ పరిస్థితిలో అక్కడ చేర్చడం ఎందుకు అని ‘అమ్ము’ను పిన్ని ప్రీతి బోయినపల్లి లోని తన ఇంటికి తెచ్చుకుంది. ‘అమ్ము’ సరిగ్గా నడవలేకపోవటం, జ్వరం వస్తూ వుండటాన్ని గమనించిన ప్రీతి “ఏమై ఉండొచ్చు..?” అనే అనుమానంతో తరచి తరచి తనని ప్రశ్నించింది. అప్పుడు అమ్ము మాట్లాడుతూ తమ హోంకి వేణుగోపాల్ రెడ్డి అనే అతను వచ్చేవాడని, అతనితోపాటు తనని కూడా 5వ ఫ్లోర్ కి విజయ పంపించేదని, ఏదో జ్యూస్ ఇచ్చి తాగమనేవాడని, బ్యాడ్ టచ్ చేస్తున్నాడని అనిపించేదని.. కానీ వెంటనే నిద్ర వచ్చేదని, పొద్దున్నే లేచి చూస్తే ఒంటిమీద బట్టలు ఉండేవి కావని, ఫ్రెండ్స్ వచ్చి బట్టలు వేసి కిందకు తీసుకెళ్లేవారని వివరించింది. అలా ఎన్నిసార్లు అయిందంటే చాలాసార్లు అయిందని, ఈ విషయం ఎవరికన్నా చెబితే వూరుకోనని, చంపేస్తానని విజయ బెదిరించటం వంటి విషయాలన్నీ పిన్నితో పంచుకుంది. నర్సుగా పనిచేసిన అనుభవం ఉండటంతో విషయం అర్థంచేసుకున్న ప్రీతికి గుండె పగిలిపోయింది. వెంటనే ‘అమ్ము’ని తీసుకుని జూలై 30న దగ్గరలోని హాస్పిటల్స్ కు  ప్రీతి తిరిగింది.. గానీ కరోనా భయంతో ఎవరూ చూడటానికి ఇష్టపడలేదు. ఒక ప్రైవేటు డాక్టర్ మాత్రం కరోనా సమయం కాబట్టి తాను టెస్ట్ చేయలేనని అంటూనే పాప పరిస్థితిపై తన అభిప్రాయం చెప్పారు. ఇలాంటి సమయంలో, తనకు కొంచం పరిచయం వున్న రిటైర్డ్ ఐపిఎస్ పోలీస్ ఆఫీసర్ దగ్గరకు పాపను తీసుకెళ్లి, ఆవిడ సహాయంతో వెంటనే బేగంపేట విమెన్ పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు. దీంతో జూలై 31న అక్కడినుంచి ఇన్స్పెక్టర్ జ్యోతి వచ్చి ‘అమ్ము’ స్టేట్మెంట్ రికార్డు చేశారు. అదే రోజు ఇన్స్పెక్టర్ జ్యోతి స్టేట్మెంట్ ఆధారంగా బోయెన్పల్లి పోలీస్ స్టేషన్ లో సాయంత్రం 5.30 గంటలకు జీరో ఎఫ్ఐఆర్ ఈ సెక్షన్లతో (sec 376(3), 342, 323, 328, 506, 109 IPC, 5(I)r/w6 POCSO ACT 2012) నమోదు చేశారు.

ఆగస్ట్ 1న కేసు అమీన్పూర్ స్టేషన్ కి బదిలీచేసారు. ఆగస్ట్ 1న ‘అమ్ము’ను నాంపల్లిలోని భరోసా సెంటర్ కు తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్ టెస్ట్ చేసి ఆమె మీద అత్యాచారం జరిగిందని డిక్లేర్ చేశారు. ‘అమ్ము’ వాంగ్మూలాన్ని భరోసా సెంటర్ లో మరోసారి నమోదు చేసారు. పాపను తీసుకుని ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పటంతో వెనక్కి వచ్చేసారు. ఆగస్ట్ 3వ తేదీ ఉదయం నేరేడ్మెట్ లోని మేడ్చల్ జిల్లా సఖి సెంటర్ కి రమ్మని రంగారెడ్డిజిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్లు ఫోన్ చేసి పిలిచి.. “హోం నిర్వాహకుల మీద ఎట్లా కంప్లైంట్ చేస్తారని ఆగ్రహంతో ప్రశ్నించారని, ‘అమ్ము’కి ఆరోగ్యపరమైన సమస్య వుంది కాబట్టి వెంటనే హాస్పిటల్ లో చేర్పించి చికిత్స చేయిస్తామనటంతో పాపను వారికి అప్పజెప్పామని, అలా వారికి అప్పజెప్పినట్లుగా తమ దగ్గరి నుంచీ సంతకాలు కూడా తీసుకున్నారని, ఆ తర్వాత పాపను ఎక్కడికి పంపించారో తమకు తెలియదని, ఆ తర్వాత ఫోన్ చేస్తే నింబోలి అడ్డ హోమ్ కు పంపించామని తెలిపారని, అక్కడికి వెళ్లి కలుస్తామని చెప్పినా గానీ వొప్పుకోలేదనీ, చివరికి 10వ తేదీన ‘అమ్ము’కి సీరియస్ గా వుందని నిలోఫర్ కి రమ్మని ఫోన్ చేశారని, తాము వెళ్లేసరికి ‘అమ్ము’ దాదాపు కోమా పరిస్థితిలో వుందని, పన్నెండో తారీఖున చనిపోయిందని, ఏం జరిగిందో తమకు అర్థంకావడం లేదని, 7వ తారీఖునే హాస్పిటల్లో చేర్పించినప్పటికీ 10వ తేదీ వరకూ తమకు సమాచారం ఇవ్వలేదని” ప్రీతి దుఃఖంతో చెబుతోంది.

ఇదే కాకుండా, 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ‘అమ్ము’ని హాస్పిటల్ జేర్పించిన తర్వాత, సాయంత్రం 5 గంటలకు రంగారెడ్డి జిల్లా cwc ప్రతినిధి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ‘అమ్ము’ బావలు అనిల్, విజయ్ ల మీద లైంగిక వేధింపులు, హింస సెక్షన్ల కింద కేసు నమోదు చేయటం ఆ కుటుంబాన్ని అయోమయంలోకి నెట్టేసింది. విసుగుతో అక్కలుగా తాము ఒకటి రెండు దెబ్బలు వేసిన మాట నిజమే గానీ, లైంగికంగా వేధించడం, గాయపడేలా హింసించడం మాత్రం జరగలేదని వారు మొత్తుకుంటున్నారు.

ఇక్కడ వస్తున్న ప్రశ్నలేమిటంటే, అంతకుముందు హోం నిర్వాహకులు, వేణుగోపాలరెడ్డి మీద అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో నమోదయిన కేసు గురించి ఎక్కడా ఎందుకు ప్రస్తావించలేదు? అసలు ఆ సంగతే తమకు తెలియదన్నట్లుగా కుటుంబ సభ్యుల మీద లైగిక వేధింపులు పెట్టటం చూస్తే, కేసుని పక్కదారి పట్టించే వ్యవహారం ఏదో వుందనే అనుమానం అందరికీ వస్తోంది. 1వ తేదీనే అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినప్పటికీ, హోం నిర్వాహకులు విజయ, ఆమె తమ్ముడు జయదేవ్, లైంగిక హింసకు పాల్పడిన వేణుగోపాలరెడ్డిని ‘అమ్ము’ ఆరోగ్య పరిస్థితి విషమించి హాస్పిటల్ లో జేర్పించిన తర్వాత 7వ తేదీ వరకూ ఎందుకని అదుపులోకి తీసుకోలేదు? రంగారెడ్డి జిల్లా నుంచీ భౌగోళికంగా సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చిన తర్వాత  అమీన్పూర్ హోమ్ నిర్వాహకులు ఆ వివరాలను పరిపాలనాపరంగా ఆ జిల్లాకు ఎందుకు మార్చలేదు? పాపమీద అత్యాచారం జరిగిందనే విషయం తెలిసిన తర్వాత ‘అమ్ము’ని పిలిపించి ఆరోగ్యపరంగా చికిత్స అందిస్తామని బాధ్యత తీసుకున్న సిడబ్ల్యుసి వాళ్లు వెంటనే ఆమెని హాస్పిటల్ కి ఎందుకు పంపించలేదు? కుటుంబ సభ్యులు మొదటినుంచీ చెబుతున్న అంశం ఇదే! అయినా గానీ ఆ విషయాన్ని పరిగణనలోకి ఎందుకు తీసుకోలేదు? కుటుంబ సభ్యుల మీద అనుమానం వుంటే 3వ తేదీనే కేసు నమోదు చేయకుండా 7వ తేదీ వరకూ ఆగి, పాప ఆరోగ్యం విషమించిన తర్వాత ఎందుకు చేశారు? ఎవర్ని తప్పించడానికి ఈ విధంగా చేశారు? ‘అమ్ము’ని నింబోలి అడ్డ హోంకి పంపించిన తర్వాత కూడా పాప ఆరోగ్య సమస్యని అక్కడి వారెందుకు పట్టించుకోలేదు? అరకొర సౌకర్యాలతో, ఆర్ధిక సమస్యలున్నా గానీ ‘అమ్ము’ బంధువుల వద్ద సజీవంగానే వుంది. కానీ, ప్రభుత్వ వ్యవస్థల చేతుల్లోకి వెళ్ళిన పన్నెండు రోజుల వ్యవధిలోనే చనిపోయే పరిస్థితి వచ్చిందంటే ఆ నిర్లక్ష్యాన్ని ఎలా అర్థం  చేసుకోవాలి? ఈ అధికారులందరూ వాళ్ల సొంత పిల్లల విషయంలో కూడా అలానే వుంటారా?? పెద్దల రక్షణలేని పిల్లల సంరక్షణను బాధ్యతాయుతంగా పట్టించుకోవలసిన ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం కాదా ఇది? మొదటి దుర్మార్గం తల్లిదండ్రులు లేని ‘అమ్ము’ మీద ఒక అనాధాశ్రమంలో జరిగిన లైంగిక అత్యాచారం, దానికి సహకరించిన నిర్వాహకులది అయితే, రెండోది ‘అమ్ము’ ఆరోగ్య పరిస్థితిని గమనించకుండా, పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిన ప్రతి ఒక్కరిదీ. ‘అమ్ము’ సంఘటనతో అయినా పిల్లల సంరక్షణాలయాలు బాధ్యతగా పనిచేసేలా, రక్షణతో కూడిన వ్యవస్థగా రూపొందుతాయా? నేరస్థులకు శిక్ష పడేలా వేగవంతంగా విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తుందా? ఆ వైపుగా స్పందిస్తుందా?

Leave a Reply