బుద్ధి చెబుతాం

0
230

రెచ్చగొడితే సహించం
అమరుల త్యాగం వృథా కాదు
ప్రతి అంగుళం భూమిని  రక్షించుకుంటాం: ప్రధాని మోదీ
పక్కా ప్రణాళికతో దాడికి తెగబడ్డారు: భారత్‌
ఫోన్‌లో మాట్లాడుకున్న  ఇరుదేశాల విదేశాంగ మంత్రులు

 భారత్‌ శాంతికాముక దేశమని, ఎవరైనా రెచ్చగొడితే మాత్రం తగిన జవాబు ఇచ్చే శక్తిసామర్థ్యాలు తమకున్నాయని ప్రధాని మోదీ చైనాను పరోక్షంగా హెచ్చరించారు.

దిల్లీ: దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవడంలో ఏ మాత్రం రాజీ పడబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గల్వాన్‌లో కొదమసింహాల్లా పోరాడి 20 మంది సైనికులు అమరులైన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ భారత్‌ శాంతికాముక దేశమని.. ఎవరైనా రెచ్చగొడితే మాత్రం తగిన రీతిలో బుద్ధి చెబుతామని తేల్చిచెప్పారు. అమరుల త్యాగాలు వృథా కానివ్వబోమంటూ దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. మరోవైపు- సరిహద్దుల్లో సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని భారత్‌, చైనా తీర్మానించుకున్నాయి. గల్వాన్‌ ఘర్షణ నేపథ్యంలో ఫోన్‌లో మాట్లాడుకున్న ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రణాళిక ప్రకారమే భారత సైనికులపై దాడి జరిపారంటూ ఈ సందర్భంగా చైనాపై విదేశీ వ్యవహారాల మంత్రి జయ్‌శంకర్‌ విరుచుకుపడ్డారు.
అదే సమయంలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి శాంతియుత పరిస్థితులు నెలకొల్పడమే లక్ష్యంగా ఇరుదేశాల మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చలు బుధవారం అసంపూర్తిగా ముగిశాయి. ఈ నేపథ్యంలో త్రివిధ దళాలను భారత్‌ అప్రమత్తం చేసింది. చైనాతో సరిహద్దుల వెంబడి సైన్యం, వాయుసేన అప్రమత్తంగా ఉండాలని ఉన్నతస్థాయి ఆదేశాలు జారీ అయ్యాయి. హిందూమహాసముద్ర ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని నౌకాదళానికి సమాచారం వెళ్లింది. అంతకుముందు.. గల్వాన్‌లో చైనా బలగాలతో ఘర్షణలో అమరులైన సైనికుల పేర్లను భారత సైన్యం విడుదల చేసింది.

సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా వెళ్తాం
తాము ఎప్పుడూ, ఎవర్నీ రెచ్చగొట్టలేదని… దేశ అఖండత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా వెళ్తామని ప్రధాని స్పష్టం చేశారు. గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కరోనా సమస్యపై ముఖ్యమంత్రులతో రెండో రోజు వీడియో సమావేశం ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ.. చైనాతోపాటు ప్రపంచానికి ఆయన తీవ్రమైన సందేశమిచ్చారు. ‘‘ఇక్కడ కరోనా సమస్య గురించి చర్చించేందుకు ఒక్కటయ్యాం. కానీ, ఇప్పుడు దేశం ముందు మరో పెద్ద అంశం వచ్చింది. తూర్పు లద్దాఖ్‌లోని ఎల్‌ఏసీ వద్ద చైనాతో జరిగిన ఘర్షణ విషయంలో దేశంలోని ప్రతి ఒక్కరూ హతాశులయ్యారు. భరతమాత వీరపుత్రులు గల్వాన్‌ లోయలో మాతృభూమిని రక్షించే క్రమంలో ఆత్మబలిదానం చేశారు. ఆ త్యాగమూర్తుల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నా. దేశానికి చెందిన ప్రతి అంగుళం భూమిని రక్షిస్తాం. సాంస్కృతికంగా భారత్‌ శాంతిపూర్వక దేశం. ‘లోకాసమస్తం సుఖినోభవంతు’ అన్నదే భారత్‌ ఆలోచనా విధానం. ప్రతి యుగంలోనూ మానవ కల్యాణం కోసమే మొత్తం శక్తియుక్తులను ధారపోశాం. నిరంతరం ఇరుగుపొరుగుతో సమన్వయం, స్నేహంగా పనిచేశాం. ఎప్పుడూ ఎవర్నీ రెచ్చగొట్టలేదు. త్యాగం, ఓర్పు దేశ చరిత్రలో భాగం. పరాక్రమం, వీరత్వానికీ మన చరిత్రలో అంతే భాగం ఉంది. మన సైనికుల బలిదానం వృథా కాబోదని నేను దేశానికి భరోసా ఇస్తున్నా. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకొనే అంశంలో మమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మన అమరజవాన్ల విషయంలో దేశం గర్వపడుతోంది. వాళ్లు చంపుతూ చంపుతూ చనిపోయారు’’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన రెండు నిమిషాలు మౌనం పాటించి అమరులకు నివాళులర్పించారు.

రేపు అఖిలపక్ష సమావేశం
భారత్‌-చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని ఈనెల 19న అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారు. సాయంత్రం 5 గంటలకు రాజకీయ పార్టీల అధ్యక్షులతో ఆయన వీడియో ద్వారా మాట్లాడనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

ముందస్తు ప్రణాళికతోనే దాడి
తూర్పు లద్దాఖ్‌లో చైనా సైనికుల దుస్సాహసాన్ని భారత్‌ తీవ్రంగా తప్పుపట్టింది. పక్కా ప్రణాళికతోనే వారు గల్వాన్‌ లోయలో సోమవారం దాడికి తెగబడ్డారని ఉద్ఘాటించింది. తాజా అనూహ్య పరిణామం ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపక తప్పదని హెచ్చరించింది. గల్వాన్‌ ఘర్షణ నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయ్‌శంకర్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి బుధవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఈ నెల 6న కుదిరిన ఏకాభిప్రాయానికి చైనా బలగాలు తూట్లు పొడిచాయని, ఫలితంగా భీకర ఘర్షణ చోటుచేసుకుందని జయ్‌శంకర్‌ పేర్కొన్నారు. చైనా వ్యవహార శైలిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘‘ఈ నెల 6న కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు క్షేత్రస్థాయిలో కమాండర్లు తరచుగా సమావేశమవుతున్నారు. అమలు దిశగా కొంత పురోగతి కూడా కనిపించింది. అంతలోనే ఎల్‌ఏసీని దాటి భారత భూభాగంలో ఓ నిర్మాణాన్ని చేపట్టేందుకు చైనా సైన్యం ప్రయత్నించింది. అక్కడే తాజా వివాదానికి పునాది పడింది. అనంతరం చైనా సైన్యం ముందస్తు ప్రణాళికతో భారత సైనికులపై దాడి చేసింది. ఫలితంగా మరణాలు సంభవించాయి. క్షేత్రస్థాయిలో యథాతథ పరిస్థితులను మార్చేందుకు చైనీయులు చేసిన ప్రయత్నమే దీనంతటికీ కారణం’’ అని వాంగ్‌తో జయ్‌శంకర్‌ పేర్కొన్నారు. ఇప్పటికైనా పరిస్థితులను విశ్లేషించుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చైనాకు సూచించారు.

తక్కువగా అంచనా వేయొద్దు: వాంగ్‌
ఈ నెల 6న కుదిరిన ఏకాభిప్రాయాన్ని భారత బలగాలే సోమవారం తుంగలోకి తొక్కాయని వాంగ్‌ యి ఆరోపించారు. ‘‘భారత సైనికులు మళ్లీ ఎల్‌ఏసీని దాటి వచ్చారు. రెచ్చగొట్టారు. దాడి చేశారు’’ అని ఆయన పేర్కొన్నారు. తాజా ఘర్షణపై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారత్‌ను డిమాండ్‌ చేశారు. ప్రాదేశిక సార్వభౌమత్వ రక్షణపై చైనా సంకల్పాన్ని తక్కువగా అంచనా వేయొద్దని భారత్‌ను హెచ్చరించారు. మరోవైపు- జయ్‌శంకర్‌, వాంగ్‌ సంభాషణపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉద్రిక్తతలను పెంచే చర్యలేవీ చేపట్టొద్దని ఇరుదేశాలు అంగీకారం కుదుర్చుకున్నట్లు అందులో పేర్కొంది. ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రొటోకాల్‌ల ప్రకారం క్షేత్రస్థాయిలో వీలయినంత త్వరగా శాంతి నెలకొనేలా చూసేందుకు జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఇరువురు నేతలు నిర్ణయించారని తెలిపింది.

అసంపూర్తిగా ముగిసిన చర్చలు
వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా భారత్‌, చైనా సైనికాధికారుల మధ్య బుధవారం జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. పలుచోట్ల నుంచి బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఏకాభిప్రాయం కుదరలేదు. గల్వాన్‌ లోయ ప్రాంతంలో సోమవారం భీకర ఘర్షణ చోటుచేసుకున్న గస్తీ పాయింట్‌-14 వద్దే భారత్‌-చైనా మధ్య మేజర్‌ జనరల్‌ల స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గల్వాన్‌ ఘర్షణ నేపథ్యంలో తాజా సమావేశం చాలా గంభీరంగా సాగిందని ‘ఈటీవీ భారత్‌’తో ఓ సైనికాధికారి చెప్పారు. అందులో ఏకాభిప్రాయమేదీ కుదరలేదని చెప్పారు. అయితే, మరిన్ని చర్చల కోసం మళ్లీ భేటీ అవ్వాలని ఇరుదేశాల అధికారులు నిర్ణయించారని తెలిపారు.

త్రివిధ దళాలు అప్రమత్తం
గల్వాన్‌ ఘర్షణ నేపథ్యంలో త్రిదళాధిపతి(సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌తోపాటు సైన్యం, వాయుసేన, నౌకాదళాల చీఫ్‌లతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం చైనాతో దాదాపు 3,500 కిలోమీటర్ల మేర ఉన్న సరిహద్దుకు సమీపంలో సైన్యం, వాయుసేనకు చెందిన స్థావరాలన్నీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, లద్దాఖ్‌లలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి చైనా సైన్యం దూకుడుగా వ్యవహరిస్తే గట్టిగా సమాధానం చెప్పాలని స్పష్టమైన సంకేతాలు అందాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో సున్నితమైన ప్రాంతాలకు అదనపు బలగాలు తరలి వెళ్లాయి. మరోవైపు- హిందూ మహాసముద్రంలో అప్రమత్త స్థాయిని పెంచాలని నౌకాదళానికి ఆదేశాలు అందాయి. ఆ మహాసముద్రంలో చైనా నౌకాదళం కదలికలు ఎక్కువగా ఉన్న సంగతి గమనార్హం.

18 మంది సైనికులకు లేహ్‌లో చికిత్స
గల్వాన్‌లో చైనా బలగాలతో ఘర్షణలో గాయపడ్డ 18 మంది సైనికులకు లేహ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నలుగురికి తీవ్ర గాయాలున్నాయని.. అయితే, వారు చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని సైనిక వర్గాలు వెల్లడించాయి. మరో 58 మంది సైనికులకు గల్వాన్‌లో స్వల్ప గాయాలయ్యాయి. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న వారు.. 2 వారాల్లో తిరిగి విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉంటారని సమాచారం.

Courtesy Eenadu

Leave a Reply