జ్వరాల సీజన్‌ ముగిశాక ఫాగింగ్‌ యంత్రాలు కొంటారా?

0
279

జ్వరాల సీజన్‌ ముగిశాక ఫాగింగ్‌ యంత్రాలు కొంటారా?

  • డెంగీ నివారణ చర్యల్లో సర్కారు
  • తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి
  • సమగ్రంగా మరో నివేదికకు ఆదేశం
  • తదుపరి విచారణ 15కి వాయిదా
  • రాష్ట్ర ప్రభుత్వం డెంగీ నివారణ చర్యల నివేదికపై హైకోర్టు అసంతృప్తి
  • సమగ్ర వివరాలతో మరో నివేదికివ్వాలని ఆదేశం

హైదరాబాదు: డెంగీ నివారణకు తీసుకుంటున్న చర్యలపై శనివారం ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘నివేదికలో నివారణ చర్యలు చేపట్టామని చెప్పినా, క్షేత్రస్థాయిలో అమలు చేసినట్లు ఆధారాలు లేవు’ అని ఆక్షేపించింది. అక్టోబరు 24న ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్ని ఫాగింగ్‌ యంత్రాలు, స్ర్పేయర్లు కొనుగోలు చేశారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది బదులిస్తూ.. యంత్రాల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చామని, మంగళవారం వరకు కొన్ని అందుబాటులో కి వస్తాయని తెలిపారు. ఈ సమాధానంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘నాలుగువారాల్లో పరిస్థితిని అదుపులోకి తేవాలని ఆదేశించాం. ఇప్పటికే రెండు వారాలు గడిచాయి, ఇంకెప్పుడు కొంటారు. ఆర్నెల్ల తర్వాత కొంటారా?’ అని ప్రశ్నించింది. ఈలోగా జ్వరాల సీజన్‌ ముగిసిపోతుందని వ్యాఖ్యానించింది. దోమకాటు వ్యాధుల నియంత్రణ చర్యలపై కేంద్ర సంస్థలు చేసిన సూచనలు పాటిస్తున్నారా? అని ఆరాతీసింది. నవంబరు 14లోగా పూర్తి వివరాలతో మరో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది. అంతకుముందు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో 1996లో డెంగీ మరణాలు 3.3శాతంగా ఉంటే ప్రస్తుతం 0.5కి తగ్గాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సెప్టెంబరు 6 నుంచి అక్టోబరు 6 దాకా 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేశామని ప్రభుత్వం పేర్కొంది.

Courtesy Andhrajyothy..

Leave a Reply