పురుషులు లేని క్లాసురూముల్లో చదువుకోవచ్చు!

0
22

మహిళల విద్య కొనసాగింపుపై తాలిబన్ల ప్రకటన

కాబూల్‌ : ఆఫ్టనిస్తాన్‌లో ఏర్పాటైన తాలిబన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పిజి స్థాయితో పాటు యూనివర్సిటీల్లో తమ చదువును కొనసాగించుకోవచ్చని తెలిపింది. అయితే పురుషులతో కలిసి విద్యనభ్యసించడం మాత్రం కుదరదని స్పష్టం చేసింది. మహిళలు, పురుషులకు ప్రత్యేక తరగతి గదులు ఉండాలని, మహిళలు ప్రత్యేకంగా డ్రెస్‌ కోడ్‌ పాటించాలని ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్‌ బాఖీ హక్కానీ పేర్కొన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉన్నత విద్యకు సంబంధించిన కొత్త పాలసీని ఆయన ప్రకటించారు.

లింగ విభజనను ఖచ్చితంగా అమలు చేస్తామని, కో ఎడ్యుకేషన్‌ను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ‘హిజబ్‌’లు కచ్చితంగా ధరించాలని పేర్కొన్న మంత్రి, తలతో పాటు ముఖం కూడా కనిపించకుండా స్కార్ఫ్‌లు ధరించాలా.. లేక తలకు మాత్రమే సరిపోతుందా అన్న విషయంపై స్పష్టతనివ్వలేదు. అలాగే యూనివర్సిటీల్లో సబ్జెక్టుల్లో కూడా మార్పులు తీసుకొస్తామని చెప్పిన అబ్దుల్‌ బాఖీ హక్కానీ, ఎలాంటి మార్పులన్నది మాత్రం వెల్లడించలేదు.

తాము కాలాన్ని 20 ఏళ్లకు తిరిగి తీసుకెళ్లాలనుకోవడం లేదని.. ఇప్పుడు ఉన్న పునాదులపైనే పున్ణనిర్మాణాన్ని చేపడతామని హక్కానీ ప్రకటించడం గమనార్హం.ఇటీవల మొత్తం పురుషులతో కూడిన ప్రభుత్వాన్ని తాలిబన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 1990 దశాబ్ధంలో సాగించిన పాలనకు భిన్నంగా తాలిబన్లు ఏమైనా వ్యవహరిస్తారా? అని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.

గత పాలన సమయంలో తాలిబన్లు బాలికలు, మహిళలకు విద్య నిరాకరించారు. అదేవిధంగా వారిని ప్రజాజీవితం నుంచి మినహాయించి పూర్తిగా ఇంటికే పరిమితం చేస్తూ దారుణమైన నిర్ణయాలు తీసుకున్నారు. మహిళల పట్ల వైఖరితో సహా ఇతర అంశాల్లో కూడా తాము మారామని ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత చెప్పిన తాలిబన్లు.. సమాన హక్కుల కోసం ఇటీవల ఆందోళనల బాటపట్టిన ఆఫ్ఘన్‌ మహిళలపై హింసకు పాల్పడుతున్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply