పోషకాహార సంక్షోభం

0
247

– అనేక రాష్ట్రాల్లో మహిళలు, చిన్నారుల్లో పెరిగిన రక్తహీనత
– తక్కువ బరువుతో శిశుజననాలు
– ఎత్తుకు తగిన బరువులేని ఎదుగుదల
– కేంద్ర సంక్షేమ పథకాల్లో కోతలే దీనికి కారణం : తాజా అధ్యయనంలో పరిశోధకులు

కరోనా సంక్షోభం పేదలు, అణగారిన వర్గాలు, మధ్య తరగతికి ఉపాధిని దూరం చేసింది. మరోవైపు సంక్షేమ పథకాలపై కేంద్రం నిధుల వ్యయం తగ్గించుకోవటం వారిని మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయి. ఆ వర్గాల్లోని మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపం తీవ్రస్థాయిలో ఉందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. సుదీర్ఘకాలంగా ఉపాధి లేకపోవటం, సంక్షేమ పథకాల తోడ్పాటు దూరమవ్వటం దేశవ్యాప్తంగా కనపడుతోంది. ఆ వర్గాల్లో అనేక కుటుంబాల భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ సమస్యను పాలకులు చాలా తేలిగ్గా తీసుకున్నారని అధ్యయనంలో పరిశోధకులు చెబుతున్నారు. గర్భిణుల్లో రక్తహీనత, తక్కువ బరువుతో శిశుజనాలు నమోదు కావటం ‘పోషకాహార సంక్షోభానికి’ సంకేతాలని ప్రముఖ ఆర్థికవేత్త జీన్‌ డ్రీజ్‌, ఆర్థిక పరిశోధకుడు అన్మోల్‌ సోమాంచీ చెబుతున్నారు.

న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌ అమలు పేదలు, అణ గారిన వర్గాలు, మధ్య తరగతిలో ఎలాంటి మార్పులకు దారితీసింది? అన్నదానిపై ప్రముఖ ఆర్థికవేత్త జీన్‌ డ్రీజ్‌, ఆర్థిక పరిశోధకుడు అన్మోల్‌ సోమాంచీ నేతృత్వంలోని పరిశోధకులు బృందం అధ్యయనం చేసింది. ఇందులో పోషకాహార లోపంపై వారు పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపం మునుపటికన్నా ఎక్కువైందని గణాంకాలు చెబుతున్నాయి. మహిళల్లో 15-49 ఏండ్లున్నవారిలో 53.1శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని ‘4వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ తెలిపింది. దీనివల్ల ఏమవుతోందంటే.. తక్కువ బరువు, పోషకాహార లోపంతో శిశుజననాలకు దారితీస్తున్నది. ఆయా కుటుంబాలను సుదీర్ఘకాలం పాటు ఆరోగ్య సమస్యలు ప్రభావితం చేయడానికి కారణమవుతున్నది. 5ఏండ్ల లోపు చిన్నారుల్లో 21శాతం మంది ఎత్తుకు తగిన బరువులేరని సర్వే తెలిపింది.

ఎందుకిలా?
కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌ కష్టాలు..దేశంలో పేదలు, అణగారిన వర్గాలు, మధ్య తరగతిపై తీవ్ర ప్రభావం చూపాయి. నెల..రెండు నెలలు కాదు…ఏడాదిన్నర కాలంగా సంక్షోభం కొనసాగుతూనే ఉన్నది. సంక్షోభంతో దెబ్బతిన్న వర్గాలను ఆదుకునే ప్రత్యేక కార్యక్రమాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టలేదు. ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలకు మోడీ సర్కార్‌ కోతలు పెట్టింది. ఉచిత రేషన్‌ సరుకులు ఇచ్చేసి..అంతా అయిపోయిందన్నట్టు పాలకులు చేతులు దులుపుకున్నారు. గర్భిణీల పౌష్టికాహారం, శిశుసంరక్షణ ఉద్దేశించి అమల్లో ఉన్న కేంద్ర పథకం ‘పీఎం మాతృ వందన యోజన’. ఇందులో లబ్దిదారులైన గర్భిణీలు, ప్రసవ మహిళలకు రూ.5వేలు నగదు బదిలీ ద్వారా అందజేయాలి. అయితే కరోనా సంక్షోభ సమయాన ఈ పథకం అమలు పూర్తిగా నిలిచిపోయింది. తద్వారా ఎంతోమంది పేదలు, అణగారిన వర్గాల్లో మహిళలు ప్రభావితమయ్యారు. ఇలాంటి సంక్షేమ పథకాల్లో కేంద్రం వ్యయం చాలా వరకు తగ్గిందని అధ్యయనం అభిప్రాయపడింది.

అన్నీ ఆగిపోయాయి..
గర్భిణీలు, శిశుసంరక్షణ కోసం చేపట్టిన కేంద్ర పథకాలకు సుమారుగా రూ.2,500కోట్లను కేంద్రం కేటాయించింది. ఆమేరకు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో వ్యయం చేసింది. ఈ పథకంలో పీఎం సురక్షిత్‌ మాతృత్వ అభియాన్‌ను, మిషన్‌ శక్తిని కూడా చేర్చారు. నిధుల కేటాయింపు మాత్రం (రూ.2500 కోట్లు) మారలేదు. దాంతో ‘మాతృ వందన యోజన’ పథకం పక్కకు పోయింది. అనేక రాష్ట్రాల్లో ప్రసవ మహిళలు, శిశు రక్షణ, ఆరోగ్యం, పౌష్టికాహార పథకాలు, కార్యక్రమాలు రద్దయ్యాయి. రెగ్యులర్‌గా జరిగే హెల్త్‌చెకప్స్‌ అన్నీ ఆగిపోయాయి. కరోనా నేపథ్యంలో ఆరోగ్యకేంద్రాల వద్ద వైద్య సేవలన్నీ స్తంభించిపోయాయి. గర్భిణీలు, ప్రసవ మహిళలు..వైద్య సేవలు పొందటం కష్టతరంగా మారింది. వారి కుటుంబాలు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉదాహరణకు రాజస్థాన్‌లో ‘పీఎం సురక్షిత్‌ మాతృత్వ అభియాన్‌’ పథకం ప్రయోజనం లబ్దిదారుల్లో కేవలం 27శాతం మందికే అందింది. ఇందులోనూ నగదు బదిలీ అన్నది దరఖాస్తు చేసుకున్న 7-8 నెలల తర్వాత లబ్దిదారుల ఖాతాల్లో జమవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

Courtesy Nava Telangana

Leave a Reply