– ఢిల్లీ అల్లర్లలో ప్రాణాలు నిలుపుకున్న మహిళ, వారి పిల్లలు
న్యూఢిల్లీ : సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళన నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసలో అత్యంత ప్రభావితమైన ప్రాంతం శివ్ విహార్. ఇక్కడి ఘర్షణల్లో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వందలాది ఇండ్లు కాలి బుడిదయ్యాయి. ఈ దారుణ ఘటనల నుంచి తప్పించుకోవడానికి ప్రీతి గార్గ్ అనే మహిళ తన పిల్లలు, ఆమె ప్రాణాలను కాపాడుకోవడానికి తాముండే భవంతిలోని మొదటి అంతస్తు నుంచి కిందకు దూకింది. ఆ ఘటనను గుర్తు చేస్తేనే ఆమె వణికిపోతున్నారు. ‘యమునా విహార్ ప్రాంతంలో మా ఇంటిని ఎలా నిప్పంటించారనేది తల్చుకుంటేనే భయంగా ఉంది. మా ఇంటికి నిప్పంటించడంతో బయటకు రావడానికి మార్గం కనిపించకపోవడంతో.. మా ఇద్దరు కుమారుల (ఐదేండ్లు, 9 ఏండ్లు) ప్రాణాలను రక్షించుకోవడానికి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకాను. గాయాలైనప్పటికీ ప్రాణాలను కాపాడుకోగలిగాము’ అని అన్నారు. తమ ఇంటికి దగ్గర్లో ఉన్న పెట్రోల్ పంపునకు సైతం కాషాయమూకలు నిప్పంటించాయని చెప్పారు.
అల్లర్ల గురించి బిల్కిన్ బానో (60) మహిళను అడగ్గా.. అల్లర్లలో తమ ఇంటిని దుండగులు కాల్చి బుడిద చేశారని కన్నీరు మున్నీరయ్యారు. అలాగే తన ఇంటి పక్కన ఉన్న తమ దుకాణాన్ని సైతం అల్లరిమూకలు కాల్చి వేశాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఈ ప్రాంతమంతా చూస్తుండగానే మంటల్లో చిక్కుకుంది. నా ప్రాణాలను కాపాడుకోవడానికి దూరంగా పరుగెత్తాను. ఈ క్రమంలో కిందపడిపోయాను. పలువురు నా మీద నుంచే పరుగులు తీశారు. ఇది గమనించిన నా కుమారుడు నన్ను పైకి లేపి రక్షించాడు. ఈ ఘటనలో పలువురు చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు’ అని చెప్పారు. ఇల్లు, దుకాణం బూడిదవ్వడంతో.. సమీపంలోని ఓ పుణ్యక్షేత్రంలో వారు ఆశ్రయం పొందుతున్నారు. ఢిల్లీలోని అల్లర్లు చోటుచేసుకున్న ప్రాంతాల్లోని వారి పరిస్థితి ఇలా దయనీయంగా మారింది. ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణించలేనిది.
Courtesy Nava Telangana