ఢిల్లీకి చేరిన.. మహిళా రైతులు

0
313

– నేడు మహిళా కిసాన్‌ దివస్‌
– 101వ రోజు కొనసాగిన ఉద్యమం
– చట్టాలు రద్దు చేయాలని మరో అన్నదాత ఆత్మహత్య
– 11న ఉద్యమం తదుపరి ఎజెండా విడుదల : రైతు సంఘాలు
– రద్దు చేస్తేనే ఉద్యమాన్ని ఆపేది : రాకేష్‌ తికాయత్‌

న్యూఢిల్లీ : ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు నిర్వహించనున్న మహిళా కిసాన్‌ దివస్‌కు భారీ స్పందన వస్తోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు సంఘాల నేతలు ఈ దివాస్‌కు పిలుపునిచ్చారు. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ఢిల్లీ సరిహద్దులకు వెళ్లేందుకు ఆదివారం సిద్ధమయ్యారు. సుమారు 40 వేల మందికి పైగా మహిళలు సరిహద్దులకు చేరుకుంటారని అంచనా. వీరంతా ఇప్పటికే ట్రాక్టర్లలో బయలు దేరారని సమాచారం. పిల్లలకు పరీక్షల నేపథ్యంలో కొంత మంది మహిళలు ఈ దివస్‌లో పాల్గొని…మార్చి 9 తిరిగి పంజాబ్‌కు చేరుకుంటారని బీకేయూ (దాకౌండ) మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు బల్బీర్‌ కౌర్‌ అన్నారు. ఆదివారం ఉదయం మన్సా నుంచి అనేక మంది మహిళలు బయలు దేరతారని చెప్పారు. అతిపెద్ద రైతు మహిళా విభాగం బీకేయూ ( ఉగ్రహాన్‌) ప్రధాన కార్యదర్శి సుఖ్బీర్‌ సింగ్‌ కొక్రీఖలాన్‌ మాట్లాడుతూ..ఆదివారం ఉదయం 500 బస్సులు, 600 మినీ బస్సులు, 115 ట్రక్కులు, 200 చిన్న వాహనాలు బయలు దేరతాయని తెలిపారు. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ నుంచి వేలాది మంది మహిళా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థినులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దల్లో జరుగుతున్న రైతు ఆందోళన వద్దకు చేరుకున్నారు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌, పల్వాల్‌, షాజహాన్‌ పూర్‌ల్లో జరుగుతున్న రైతు ఉద్యమం కేంద్రాల్లో సోమవారం పూర్తిగా మహిళా రైతులు, కార్యకర్తలు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులే అన్ని నిర్వహిస్తారని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. మహిళలే ఆందోళనకు నాయకత్వం వహిస్తారు. వేదికపైన కూడా వారే అధ్యక్షత వహిస్తారు. మహిళలు చేతనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

”మహిళలు సమాజంలో పెద్ద భాగం కాని వారికి గుర్తింపు లభించదు. నిజానికి, వారు పురుషుల కంటే ఎక్కువ పని చేస్తారు. మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పంజాబ్‌, హర్యానాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10,000 మంది మహిళలు సరిహద్దులకు వస్తారు” అని రైతు నేత కుల్వంత్‌ సింగ్‌ సంధు తెలిపారు. ”సింఘూ సరిహద్దులో మహిళలు కీలక పాత్ర పోషించారు. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుండి వందలాది మంది మహిళలు వాహనాల్లో వస్తున్నారు.” అని పంజాబ్‌లోని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (డాకాండ) కు చెందిన జగ్మోహన్‌ సింగ్‌ అన్నారు. ”బెహ్నౌ రలో ప్రవ సంఫ్‌ు, (సోదరీమణులు మీ సోదరులతో చేరండి)..మిల్కర్‌ లాడి హాకీ జాంగ్‌ (కలిసి మన హక్కుల కోసం పోరాడుదాం) ” అంటూ నినాదాలతో ఢిల్లీకి చేరుకున్నారు.

గత ఏడాది సెప్టెంబరులో రైతుల ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి పంజాబ్‌లో మహిళలు ఉద్యమానికి తమ గొంతును ఇస్తూ వస్తున్నారు. ఆ ఉద్యమం తరువాత దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఈసారి రైతు సంఘాలతో పాటు పంజాబ్‌ నుంచి మహిళా సంఘాలు కూడా ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాయి. చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ”మహిళా వ్యతిరేక” వ్యవస్థపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు.

”మేము నివసిస్తున్న లోతైన పితృస్వామ్య వ్యవస్థలో మహిళా రైతులు, కార్మికులు పురుష రైతుల వలే ఎక్కువ పనిలో ఉన్నప్పుడు కూడా మేము కనిపించమని, మా మాట వినలేరు. ఇంకా భూమి, ఇతర వనరుల యాజమాన్యం హక్కు పురుషుల చేతిలో ఉంది. కాబట్టి అసమానతను వ్యాప్తి చేసే ఈ వ్యవస్థపై పోరాడటమే పరిష్కారం” అని పంజాబ్‌లోని ఇస్త్రీ జాగృతి మంచ్‌ కార్యదర్శి అమన్‌దీప్‌ డియోల్‌ అన్నారు.

11న ఉద్యమం తదుపరి ఎజెండా విడుదల :రైతు సంఘాల నేతలు
న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకూ ఢిల్లీ సరిహద్దుల నుంచి తిరిగి వెళ్లబోమని రైతు సంఘాలు ఆదివారం స్పష్టం చేశాయి. ఉద్యమం తదుపరి ఎజెండాను ఈ నెల 11న యూనియన్లు వెల్లడిస్తాయని బికెయు ప్రధాన కార్యదర్శి జగన్మోహన్‌ సింగ్‌ పాటియాలా తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్‌, కర్నాటక, ఒడిశా వంటి రాష్ట్రాలకు ఉద్యమాన్ని విసృత్తం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వం, దాని ఏజెన్సీల నుంచి అవరోధాలు ఎన్ని ఉన్నా ఉద్యమం బలంగా వెళ్లుతుందని, మరింత పెద్దదిగా అవుతుందని రైతు సంఘాల నేతలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం సాగుతున్నదని నేతలు ఉద్ఘాటించారు.

నల్ల చట్టాలు రద్దు చేస్తేనే ఉద్యమం ఆపేది : రాకేష్‌ తికాయత్‌
ముజఫర్‌ నగర్‌ : మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని రైతు నేత రాకేష్‌ తికాయత్‌ స్పష్టం చేశారు. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలను చేపట్టి 100 రోజులు పూర్తైన సందర్భంగా ముజఫర్‌ నగర్‌లోని రామ్‌రాజ్‌ పట్టణంలో ఆయన మాట్లాడారు. ఈ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారని, వాటిని కేంద్రం రద్దు చేసేంత వరకు ఆందోళనలను విరమింప జేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ట్రాక్టర్‌ ర్యాలీని ప్రారంభించారు. ఇది ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ జిల్లాల మీదుగా ప్రయాణించి మార్చి 27న ఘాజిపూర్‌లోని రైతులు నిరసన ప్రాంతాలకు చేరుకుంటుందని తెలిపారు.

ఆత్మహత్యకు పాల్పడిన మరో రైతు
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన 101 రోజూ కూడా కొనసాగింది. ఈ ఆందోళనలో ఇప్పటి వరకు 270 మంది రైతులు అమరులైయ్యారు.

అమరవీరులైన రైతులకు ఆదివారం సింఘూ సరిహద్దు వద్ద నివాళులర్పించారు. అలాగే టిక్రీ సరిహద్దు వద్దు హర్యానాలోని హిసార్‌ జిల్లాకు చెందిన 49 ఏండ్ల రైతు రాజ్‌బీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆందోళన స్థలానికి ఏడు కిలో మీటర్ల దూరంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.రాజ్‌బీర్‌ రాసిన సూసైడ్‌ నోట్‌లో మూడు వ్యవసాయ చట్టాలే తాను తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి కారణమని పేర్కొన్నారు. చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం తన చివరి కోరికను నెరవేర్చాలని అందులో పేర్కొన్నారు.

అమెరికా నుంచి వచ్చి..రైతులకు ఉచితంగా వైద్యమందిస్తూ…
న్యూఢిల్లీ: అమెరికా నుంచి వచ్చిన ఓ వైద్యుడు ఇక్కడే ఉండి ఆందోళనకారులకు నిరంతరం వైద్యం అందిస్తున్నారు. అమెరికాలో వైద్యుడిగాఉన్న డాక్టర్‌ స్వైమన్‌సింగ్‌ ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వచ్చారు. ఈక్రమంలోనే ఇక్కడే ఉండి వైద్యమందించాలని నిర్ణయించుకున్నాడు. మూడు నెలలుగా ఉచిత వైద్యమందిస్తూ.. మందులు సరఫరా చేస్తున్నారు. టిక్రిలోనే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని నడిపిస్తూ మందులు కూడా ఉచితంగా అందజేస్తున్నారు. తాను ఎన్నో ఏండ్లుగా ప్రతిసంవత్సరం వైద్యసేవలకేంద్రం ఏర్పాటు చేసి వైద్యమందిస్తున్నామని, ఈ క్రమంలోనే కొంతమంది తమకు ఆప్తులుగా మారారని తెలిపారు. ఈ క్రమంలోనే ఓ పేషంట్‌ ధర్నాలో పాల్గొన్న క్రమంలో స్ట్రోక్‌ రావడంతో తనకు ఫోన్‌ చేశారని, దీంతో తాను వచ్చానని ఆ డాక్టర్‌ తెలిపారు.

ఇక్కడకు వచ్చాక ఓ ఐదు రోజుల పాటు ఉందామనుకున్నాని, తర్వాత తన సొంత ఖర్చులతో ఓ మెడికల్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేద్దామనుకున్నాని, కానీ, తర్వాత తాను అమెరికా వెళ్లడాన్ని వాయిదా వేసుకుని ఇక్కడే వైద్యసేవలందించేందుకు నిర్ణయించుకున్నాని తెలిపారు. ఇక్కడి ప్రజల కష్టాలు చూసి తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని, వాళ్ల ఆశాకిరణంగా భావించుకుని మూడు నెలలుగా ఇక్కడే ఉండిపోయానని తెలిపారు. ఈ మెడికల్‌ క్యాంప్‌ టిక్రిలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఉందన్నారు.
అమెరికాలో మంచి ఉద్యోగం, మంచి వేతనాన్ని వదలేసి ఇక్కడ ఉండిపోయావేమని కొంతమంది అడిగారని, కానీ డబ్బు తనకు పెద్ద విషయం కాదని, తాను గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వాడినేనని, ఇక్కడ రైతులు రోడ్లపైనే చనిపోతున్నారని, వీరు కూడా ఒకానొకపుడు తనలాంటి జీవితాన్ని అనుభవించిన వారేనని, ఆ ఆలోచనే తనను ఇక్కడ ఉండేలా చేసిందని వివరించారు.

Courtesy Nava Telangana

Leave a Reply