గిరిజన బాలిక రేప్, హత్య పై మహిళా జాక్ నిజనిర్ధారణ

0
55
Sujatha Surepally

ఎక్కడికి పోతున్నాం మనం? ఆడపిల్లల అంటే చిన్న పిల్లల మీద వరస అఘాయిత్యాలు ఎక్కడి సంస్కృతి? వాడేవడో పక్కనే పొంచి ఉంటాడు లేదా ఇంట్లోనే చుట్టమో ,తండ్రి,అన్న రూపంలో ఉంటాడు. వాడు తాగి ఉంటాడు కాబట్టి ఏమన్నా చేస్తాడు, ఆ పిల్ల బ్రతికి ఉన్న జీవచ్ఛవం లాగా పడి ఉంటుంది కానీ ఇప్పుడు కనీసం ప్రాణాలతో కూడా వదిలిపెట్టట్లేదు. చిన్న పసిపాపలు,ఆట తప్ప కసాయి లోకం తెలియని బొమ్మలు.అయినా బ్రతకనివ్వరు. ఈ ‘పాప’ తన ఇంటికి కొన్ని అడుగుల దూరంలో నెలకొని ఉన్న వినాయకుడి రికార్డులకి చెంగు చెంగున అందాల బొమ్మలాగా డాన్స్ వేసింది. తల్లి తండ్రులకి మురిపాల ముద్దుగుమ్మ. నిన్న సాయంత్రం తల్లి స్నానం చేయించింది. తాను రాత్రికి రొట్టెలు చేసుకుంటూ పాప ఆడుకోవడానికి పోయిందిలే అనుకుంది. అక్కడ అడుగడుగునా ఒక రూమ్ అంటే ఒక ఇల్లు, దాదాపు 50 వేల జనాభాని పోగేసుకున్న అనధికారంగా ఉంటున్న బస్తి. దేవరకొండ,అచ్చంపేట, నల్గొండ వంటి తాండాలనుండి తండోపతండాలుగా పొట్ట చేతపట్టుకొని వచ్చి పెద్దతండాగా మారిన బస్తి. ఇంకా వడ్డెర ఇతర చిన్న కులస్తులు కూడా ఉన్నారు. నాలుగు సిమెంట్ రేకులు అడ్డము,పొడుగు వేస్తే అది ఒక రూము, అక్కడ యథేచ్ఛగా సారా, గంజాయి ఇతర మత్తు పదార్థాలు దొరుకుతాయని వాళ్ళే చెపుతున్నారు. ఎవరన్నా కొనుక్కోవచ్చు,లక్షన్నర, రెండు లక్షలకి తలదాచుకునేంత జాగా..అంతా కూలి,నాలి,రిక్షా తొలుకునే జనం.

ఆ పాప తండ్రి 4 ఎకరాల రైతు, నక్కలగండి, దేవరకొండ వాగు ప్రాజెక్ట్ లో భూమి పోగొట్టుకుని, వచ్చిన సగం డబ్బుతో అక్కడే ఒక 150 గజాల జాగా కొనుక్కొని, ఇంకాస్త డబ్బుతో ఇక్కడ ఒక రూమ్ తీసుకొని ఆటో నడుపుకుంటూ గత మూడేళ్ళుగా ముగ్గురు పిల్లలతో కష్టంగా కాపురాన్ని నడిపిస్తున్నడు. భార్య మీషన్ కుడుతుంది. నిన్న సాయంత్రం 4.30 స్నానం చేపించి తన పనిలో పడింది తల్లి. బయటకి పోయిన పాప మీద ధ్యాస 6. గం లకి వచ్చి వెతకడం ప్రారంభించారు. తన పక్కనే ఉన్న రూమ్ తాళం వేసి ఉండడం ఎందుకో తల్లికి అనుమానం వచ్చింది, అందులో వెతకమని అన్నది, తన బంధువులకి చెప్పింది, వాళ్ళు పోలీసులకి చెప్పినా రాత్రి 12 గం వరకు ఆ రూం తాళం తీయలేదు, ఎందుకో తెలియదు. తీస్తే ఏముంది ఒక పరుపులో విగత జీవిగా పడి ఉంది పాప. ఆ పాపని చంపిన వాడు తాగుబోతు ,తల్లి,భార్య వదిలేస్తే ఒక్కడే ఉంటున్నాడు. ఈ పాప మీద ఎప్పటినుంచి కన్ను వేశాడో తెలియదు కాని వాడి కామానికి బలి అయిపోయింది. ఎవరు బాద్యులు? రైతుని రోడ్డున పడేసిన ప్రభుత్వమా? విచ్చలవిడిగా అక్కడ అమ్ముడవుతున్న మద్యం,గంజాయి నా ? నేర చరిత్ర ఉన్నా కూడా చూసి చూడనట్టు వదిలేస్తే తరువాత ఎవరు బలి కావాలి? రక్షణ లేని బస్తీలా ? చెప్పండి. అవును మగ మహారాజులు రాజకీయాలు చేయడమేనా లేకపోతే ఫెస్బుక్ లో పడి ఆడవాళ్లు ఎం రాస్తున్నారు, తాగుతున్నారు అని ఏరి, వెతికి అడ్డగోలుగా గోడల మీద రాసుడేనా? ఆడపిల్ల లని కూడా వదలని అడ్డమైన నీచమైన మగ జాతిని నిలదీయరా? అది కేవలం ఆడవాళ్ళ విషయమా ? ఎదో అంశం,ఎవరినో అంటే ఉడుక్కుని చచ్చి, ఉరుక్కున వచ్చి బట్టలు చింపుకుంటారు కదా. మా శీలాలు, శల్య పరీక్షలు చేస్తారు కదా, ఎక్కడ చచ్చారు ఇపుడు? మీలో ఎంతో మంది బెవార్స్ గా తిరుగుతుంటారు ఇలాంటి చోట్ల మీరు కాపలా కాస్తే తప్పేంది? మీ మగ మద మెక్కిన మెదళ్ళని మార్చడానికి మీరు ఉద్యమించరా? ఎందుకు ఇంత నీచంగా తయారు అవుతున్నారో చెప్పరా ?కదలండి రాజకీయాలంటే కేవలం ఓటులో మాత్రమే లేవు, రావు, ప్రజలకి నమ్మకం కావాలి. సొల్లు, సోది ఆపి మీ మగవాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారని ఆశిస్తున్నాము. (అందరి మగవాళ్ళు భుజాలు తడుముకోవద్దు,ఇది మంచి వాళ్ళకి కాదు).

Leave a Reply