ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి

0
158
  • గొంతు కోసి హతమార్చిన యువకుడు
  • మృతురాలు అంజలి, నిందితుడు రాజు

గోదావరిఖని-యైటింక్లైన్‌కాలనీ : ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. ప్రేమించమంటూ వేధించి యువతి గొంతు కోసి దారుణంగా హతమార్చిన ఘటన రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం జరిగింది. గోదావరిఖని రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం యైటింక్లైన్‌కాలనీ కేకేనగర్‌కు చెందిన గొడుగు అంజలి(20) తండ్రి ఆమె చిన్నతనంలోనే మృతి చెందాడు. తల్లి లక్ష్మి కూలీ పని చేస్తూ కుమార్తెని పోషిస్తోంది. తల్లి పనికి వెళ్లిన తర్వాత ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన చాట్ల రాజు (20) అనే యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత ప్రేమిస్తున్నానంటూ వేధించడం మొదలుపెట్టాడు. విషయం లక్ష్మికి తెలియడంతో రాజును ఇంటికి రావద్దని హెచ్చరించింది. ఏడాది కిందట పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఈమధ్య అంజలికి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలుసుకున్న రాజు ఫోన్‌చేసి వేధించడం మొదలుపెట్టాడు. ఆమె నుంచి స్పందన రాకపోవడంతో పగ పెంచుకున్నాడు.

మంగళవారం మధ్యాహ్నం అంజలి ఇంటికి వెళ్లి ఆమెతో ఘర్షణకు దిగాడు. కేకలు బయటకు వినిపించకుండా టీవీ సౌండ్‌ పెంచాడు. వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి, అక్కడే ఉన్న కత్తిపీటతో దాడి చేసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. లక్ష్మితో కలిసి కూలీ పని చేసే వ్యక్తి ఒకరు ఉపాధిహామీ జాబ్‌కార్డు ఇచ్చేందుకు మంగళవారం మధ్యాహ్నం వారి ఇంటికి వచ్చాడు. ఎంత పిలిచినా ఎవరూ పలకకపోవడం, టీవీ సౌండ్‌ పెద్దగా వినిపిస్తుండటంతో లోపలికి వెళ్లిన అతడికి రక్తపు మడుగులో పడి ఉన్న అంజలి కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ రవీందర్‌, ఏసీపీ గిరిప్రసాద్‌, సీఐ శ్రీనివాసరావు పరిశీలించి, విచారణ ప్రారంభించారు. నిందితుడు రాజు అంజలిని హత్య చేసిన అనంతరం పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది.

Courtesy Eenadu

Leave a Reply