ప్రేమోన్మాదం: చికిత్స పొందుతూ బాధితురాలు మృతి

0
231
ఆ లెక్చరర్‌ చనిపోయింది..!

ముంబై: ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైంది. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మహారాష్ట్రలోని వార్దాకు చెందిన ఓ యువతి(25) లెక్చరర్‌గా పనిచేస్తోంది. కాగా విక్కీ నగ్రాలే అనే వివాహితుడు గత రెండేళ్లుగా ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో గత సోమవారం సదరు యువతిపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.

కాగా వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇక విక్కీకి గతంలోనే పెళ్లయిందని, అతడికి ఏడు నెలల వయస్సు గల కొడుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడు బల్లార్షాలో పనిచేసేవాడని.. బాధితురాలికి నిప్పు అంటించిన తర్వాత అతడు కూడా ఆత్మహత్యకు యత్నించాడని పేర్కొన్నారు. ఇక మహిళా లెక్చరర్‌పై అఘాయిత్యానికి నిరసనగా స్థానికులు నిరసన చేపట్టారు. నిందితుడికి ఉరిశిక్ష వేసి.. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర ప్రభుత్వం బాధితురాలి తరఫున వాదించేందుకు ప్రముఖ న్యాయవాది ఉజ్వల్‌ నికాంను ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తున్నట్లు పేర్కొంది. అదే విధంగా హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రెండు రోజుల క్రితం ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Courtesy Sakshi

Leave a Reply